- Home
- Telangana
- Hyderabad Fake Currency : వీడెవడండీ బాబు..! మొబైల్ లో వీడియోలు చూసి కోట్ల రూపాయలు తయారుచేశాడా..!!
Hyderabad Fake Currency : వీడెవడండీ బాబు..! మొబైల్ లో వీడియోలు చూసి కోట్ల రూపాయలు తయారుచేశాడా..!!
యూట్యూబ్ లో చూసి వంటలు, ఇతర పనులు నేర్చుకోవడం కాదు ఏకంగా కరెన్సీ నోట్లను ముద్రించడం ఎలాగో నేర్చుకున్నాడో కేటుగాడు. ఇలా ఓ హైదరబాదీ నకిలీ కరెన్సీ నోట్ల దందా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు

హైదరాబాద్ లో నకిలీ నోట్ల కలకలం
Fake Currency : సాధారణంగా యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలో వంటల వీడియోలు చూసి రుచికరమైన అహారపదార్థాల ఎలా వండాలో నేర్చుకునేవారిని చూస్తుంటాం. ఇక ఆన్ లైన్ క్లాసుల ద్వారా చదువునే విద్యార్థులను, ప్రొఫెషనల్ వర్క్స్ నేర్చుకునేవారికి చూస్తుంటాం. వస్తువులను తయారుచేయడం, మార్కెటింగ్ చేసుకోవడం, పంటలు పండించడం, ఏది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడం, ఈ-కామర్స్ షాపింగ్... ఇలా అదీఇదని కాదు స్మార్ట్ ఫోన్ లోనే అన్నిపనులు జరిగిపోతున్నాయి, అంతా టెక్నాలజీమయం అయిపోయింది. చివరికి పరిస్థితి ఎలా తయారయ్యిందంటే క్రైమ్స్ ఎలా చేయాలో కూడా యూట్యూబ్ వీడియోలు, ఏఐ వంటి టెక్నాలజీ సాయంతో నేర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వెలుగుచూసింది.
హైదరాబాద్ లో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో నవంబర్ 1న అంటే గత ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారును ఆపారు... అందులోని వ్యక్తుల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో 8 లక్షల రూపాయల విలువైన నోట్ల కట్టలు ఆ కారులో దొరికాయి... వాటిని పరిశీలిస్తే దొంగ నోట్లుగా తేలాయి. దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు తీగలాగితే హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న పెద్ద దొంగనోట్ల ముఠా డొంక కదిలింది.
అద్దె ఇంట్లో కోట్ల రూపాయల ప్రింటింగ్
కారులో లభించిన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్న పోలీసులు మడుపోజు కరుణాకర్, మాణిక్యరెడ్డి, రత్నాకర్ రెడ్డి, అజయ్ కుమార్ లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నగర శివారు పెద్ద అంబర్ పేటలో దొంగ నోట్లను ప్రింటింగ్ చేస్తున్నట్లుగా తేలింది. కుంట్లూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని దొంగనోట్ల దందా నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు.
ఆ అద్దె ఇంట్లో నకిలీ నోట్ల ముఠా చేసిన సెటప్ చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ కోసం ఖరీదైన ప్రింటర్లు, కంప్యూటర్లను వాడుతున్నట్లు గుర్తించారు. అప్పటికే ప్రింట్ చేసి రెడీగా ఉంచిన 6.78 కోట్ల రూపాయల విలువైన 500 కరెన్సీ నోట్ల కట్టలు కూడా లభించాయి. ఈ నోట్ల సరఫరా కోసం నకిలీ నంబర్ ప్లేట్లతో సిద్దంగా ఉంచిన వాహనాలను కూడా గుర్తించారు. వీటన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
యూట్యూబ్ లో చూసే నకిలీ కరెన్సీ తయారుచేశారట...
ఈ నకిలీ కరెన్సీ కేసుకు సంబంధించిన వివరాలను ఫ్యూచర్ సిటీ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. ఈ ముఠా సభ్యులంతా గతంలో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేశారట... ఆ పరిచయంతోనే ఈజీగా డబ్బులు సంపాదించాలనే నకిలీ నోట్ల దందా ప్రారంభించారని సిపి తెలిపారు. వీళ్లు యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాలు, గూగుల్ లో సెర్చ్ చేసి నకిలీ నోట్ల ప్రింటింగ్ గురించి పూర్తి సమాచారం సేకరించినట్లు తెలిపారు.
ముందుగా హైదరాబాద్ శివారులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ నోట్ల ప్రింటింగ్ కు అవసరమైన ఖరీదైన ప్రింటర్లు, కంప్యూటర్లను సేకరించుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి నకిలీ నోట్ల తయారీకి అవసరమయ్యే సామగ్రిని ఆర్డర్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే అసలైన కరెన్సీ నోట్ల మాదిరిగా ఉండేలా గ్రీన్ థ్రెడ్ కూడా నకిలీ నోట్ల తయారీలో ఉపయోగించారు. ఇలా అచ్చుగుద్దినట్లు రూ.500 కరెన్సీ నోట్ల ప్రింటింగ్ చేపట్టినట్లు సిపి వెల్లడించారు.
ఫేక్ కరెన్సీ నోట్ల దందా పేరిట మోసం
మొదట ఈ ముఠా అసలు నగదు ఇస్తే తాము తయారుచేసిన నకిలీ నోట్లను ఇస్తామని కొందరిని నమ్మించే ప్రయత్నం చేసిందట. లక్ష రూపాయల అసలు కరెన్సీ ఇస్తే 3 నుండి 4 లక్షల విలువైన నకిలీ ఇస్తామని ఆశజూపారు... కానీ ఇందుకు ఎవరూ ముందుకురాలేదు. దీంతో కొత్త మోసానికి తెరతీశారు ముఠాసభ్యులు.
ముందుగా అసలు కరెన్సీ నోట్లను చూపించి ఇవి తాము తయారుచేసిన నకిలీ కరెన్సీ అని నమ్మించేవారు. దీంతో వీటిని తీసుకునేందుకు వచ్చినవారు సరిగ్గా డబ్బులు తీసుకోగానే ఈ ముఠా సభ్యులే పోలీసుల వేషంలో వచ్చేవారు. నకిలీ కరెన్సీ తీసుకున్నవారిని భయపెట్టి వారివద్ద ఉన్న అసలు, నకిలీ నగదును స్వాధీనం చేసుకునేవారు. ఇలా నకిలీ కరెన్సీ ప్రింట్ చేయడమే కాదు నకిలీ పోలీసుల వేషంలో మోసాలకు తెరతీశారు.
ఈ నకిలీ కరెన్సీ ముఠాలో ఉప్పరిగూడకు చెందిన కరుణాకర్ కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అతడితో పాటు మరో ముగ్గురు నిందితులు ఇప్పటికే పట్టుబడ్డారు. ఇక వెంకటేష్, బాలరాజు, శ్రీనివాస్ అనే మరో ముగ్గురు కూడా ఈ ముఠా సభ్యులుగా పోలీసులు గుర్తించారు. వీళ్లు కూడా వేరే కేసులో అరెస్టయి జైల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాా సభ్యులందరినీ ఒక్కదగ్గరికి చేర్చి విచారించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.





