వర్షాలు.. అస్సలు తగ్గేదేలే. వచ్చే రెండు రోజులు ఈ ప్రాంతాల్లో కుండపోతే
గడిచిన వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా వచ్చే రెండు రోజులు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో వరద హెచ్చరికలు
గత పది రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నిరంతర వర్షాలతో రహదారులు జలమయమై, నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. సాధారణ జీవనం దెబ్బతినడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) కొత్తగా భారీ వర్షాల హెచ్చరికను జారీ చేసింది.
ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో నేడు 20 సెంటీమీటర్లకు మించి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ప్రకటించింది. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం కాకుండా బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, ఖమ్మం, జనగామ, కుమురం భీం ఆసిఫాబాద్, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగతా 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
రికార్డు స్థాయిలో వర్షాలు
శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 560 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ములుగు జిల్లా గోవిందరావుపేటలో 22 సెం.మీ. వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. అదేవిధంగా ఆదిలాబాద్ తాంసిలో 17.3 సెం.మీ., మంచిర్యాల కన్నెపల్లిలో గంటన్నర వ్యవధిలోనే 12.5 సెం.మీ. వర్షం కురిసింది. ఈ గణాంకాలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి.
సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
భారీ వర్షాల కారణంగా అనేక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరదలో ఇరుక్కున్న ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఆదిలాబాద్ సుభాష్‌నగర్‌లో వరదలో చిక్కుకున్న వారిని విజయవంతంగా బయటకు తీసుకొచ్చారు. అధికారులు ప్రజలను ఇళ్లలోనే ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా..
వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మోస్తరు వర్షాలు పడవచ్చు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు. ఆదివారం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
సోమవారం(ఆగస్టు 18) నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మరోక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
~ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) August 16, 2025