హైదరాబాద్‌లో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ పని చేస్తుందా.?
కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనే సౌకర్యాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పాస్ ధర రూ.3,000గా నిర్ణయించారు. అయితే ఈ పాస్ ఏయే రోడ్లకు వర్తించదో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలేంటీ యాన్యువల్ పాస్..?
జాతీయ రహదారి వినియోగదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే.. ఈ ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ఒక సంవత్సరం లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్‌లకు (ఏది ముందు అయితే అది) అనుమతిస్తుంది. దీనికోసం రూ. 3000 వన్ టైమ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా లేదా ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లిస్తే.. రెండు గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.
ఎక్కడ చెల్లుబాటు అవుతుంది?
FASTag యాన్యువల్ పాస్ కేవలం జాతీయ రహదారులు (National Highways), ఎక్స్‌ప్రెస్‌వేలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ముఖ్యంగా NHAI నిర్వహించే మార్గాలకు వర్తిస్తుంది. ముఖ్యంగా నేషనల్ హైవే 19 (Delhi-Kolkata), నేషనల్ హైవే 3 (Agra-Mumbai), నేషనల్ హైవే 48 (North-South Corridor), నేషనల్ హైవే 27 (Porbandar-Silchar), నేషనల్ హైవే 16 (Kolkata-Eastern Coast), నేషనల్ హైవే 65 (Pune-Machilipatnam), నేషనల్ హైవే 11 (Agra-Bikaner), నేషనల్ హైవే 44 (Srinagar-Kanyakumari) చెల్లుంది.
ఎక్కడ వర్తించదు.?
ఈ పాస్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే రహదారులపై అమలులో ఉండదు. అంటే, స్టేట్ హైవేలు, రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేలపై మీరు మళ్లీ ఫాస్టాగ్ బ్యాలెన్స్‌తోనే టోల్ చెల్లించాలి. యమునా ఎక్స్‌ప్రెస్‌వే, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే వంటి వాటికి యాన్యువల్ పాస్ వర్తించదు.
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై వర్తిస్తుందా.?
హైదరాబాద్ ORR (Outer Ring Road) HMDA (Hyderabad Metropolitan Development Authority) ఆధ్వర్యంలో ఉంది. ఇది NHAI నిర్వహణలో లేనందువల్ల, FASTag Annual Pass ఈ రోడ్డుపై పనిచేయదు. అంటే ORR వినియోగదారులు టోల్ చెల్లించేటప్పుడు సాధారణ FASTag బ్యాలెన్స్ వాడాల్సి ఉంటుంది.
ఏ మార్గాల్లో వర్తిస్తుంది.? ఎలా తెలుసుకోవాలి.?
NHAI రూపొందించిన Rajmarg Yatra App ద్వారా యూజర్లు తమ యాన్యువల్ పాస్ ఎక్కడ చెల్లుబాటు అవుతుందో సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం యాప్ ఓపెన్ చేసి “Annual Pass Valid Routes” అనే విభాగంలోకి వెళ్లాలి. అక్కడ NHAI నిర్వహించే హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు పూర్తి జాబితా చూడొచ్చు. ఈ విధంగా మీ ప్రయాణానికి ముందు రూట్ చెక్ చేసుకుని, పాస్ ఎక్కడ వాడగలరో స్పష్టంగా తెలుసుకోవచ్చు.
యాన్యువల్ పాస్‌కు భారీ స్పందన
NHAI సమాచారం ప్రకారం, FASTag యాన్యువల్ పాస్ మొదటి నాలుగు రోజుల్లోనే 5 లక్షల మంది కొనుగోలు చేశారు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లోనే ఎక్కువ పాస్‌లు అమ్ముడయ్యాయి. అలాగే టోల్ ప్లాజాల వద్ద గరిష్ట లావాదేవీలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ఇది ఈ పాస్‌పై ఉన్న డిమాండ్‌ను చూపిస్తుంది.