- Home
- Telangana
- తెలంగాణలో మరో కంచి.. బంగారు, వెండి బల్లి కూడా ఉంటాయి. హైదరాబాద్ నుంచి గంట ప్రయాణం అంతే.
తెలంగాణలో మరో కంచి.. బంగారు, వెండి బల్లి కూడా ఉంటాయి. హైదరాబాద్ నుంచి గంట ప్రయాణం అంతే.
బంగారు, వెండి బల్లి అనగానే మనలో చాలా మందికి తమిళనాడులోని కంచి గుర్తొస్తుంది. అయితే తెలంగాణలో అది కూడా హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో కూడా ఇలాంటి ఓ దేవాలయం ఉందని మీకు తెలుసా.? ఈ ఆలయ ప్రాముఖ్యత, ఎలా వెళ్లాలి? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కొడకంచి గ్రామంలో
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామం పచ్చని పొలాల మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది కొడకంచి ఆదినారాయణ స్వామి ఆలయం. ఇక్కడి శ్రీదేవి, భూదేవి సమేత ఆదినారాయణ స్వామి ఆలయం ప్రత్యేకతలతో భక్తుల మనసును ఆకట్టుకుంటుంది.
KNOW
కలలో దర్శనమిచ్చిన స్వామివారు
పూర్వకాలంలో అల్లాణి వంశానికి చెందిన రామోజీరావుకు స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చారు. “మంబాపూర్ అటవీ ప్రాంతంలో నా విగ్రహం ఉంది. దానిని తీసుకువచ్చి కొడకంచి గ్రామంలోని కొండపై ప్రతిష్టించాలి” అని ఆదేశించారని ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు. ఆ ప్రకారం అల్లాణి వంశీయులు ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి, పెద్ద ఎత్తున పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఆలయం ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది.
మరో కంచి అని ఎందుకు అంటారు?
ఈ ఆలయంలోని పూజా విధానాలు, ఆచారాలు కంచి ఆలయ సంప్రదాయాలకు దగ్గరగా ఉంటాయి. అందువల్ల భక్తులు దీన్ని “మరో కంచి” అని పిలుస్తారు. కంచి వెళ్ళలేకపోయిన వారు కొడకంచికి వస్తే అదే పుణ్యఫలం లభిస్తుందని స్థానికులు విశ్వసిస్తారు. అంతేకాకుండా అచ్చం కంచిలోని ఆలయంలో ఉన్నట్లే ఇక్కడ కూడా బంగారు, వెండి బల్లులు ఉంటాయి.
బంగారు – వెండి బల్లుల విశిష్టత
ఆదినారాయణ స్వామి ఆలయంలో బంగారు, వెండి బల్లుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణ. వీటిని దర్శించడం వల్ల బల్లి దోషం తొలగిపోతుందని విశ్వాసం. ఈ విగ్రహాలను చూసినవారికి సాక్షాత్తు కంచి క్షేత్రంలో దర్శనం చేసినంత పుణ్యం కలుగుతుందని భావిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
ఎలా చేరుకోవాలి.?
హైదరాబాద్ ప్రజలు అత్యంత సులభంగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ముందుగా పటాన్‌చెరువు చేరుకోవాలి. ఇక్కడి నుంచి కొడకంచి ఆలయం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పటాన్ చెరువు బస్టాండ్ నుంచి జిన్నారం వైపు వెళ్లే రహదారి ద్వారా సులభంగా చేరుకోవచ్చు. స్థానిక బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రైవేట్ వాహనాలైతే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. పటాన్ చెరు నుంచి కేవలం 20 నిమిషాల్లో ఆలయానికి చేరుకోవచ్చు. అలాగే నగరంలో ఎక్కడి నుంచైనా సుమారు గంటలో ఆలయం వెళ్లొచ్చు.
ఆసక్తికరమైన అంశాలు
* ఆలయంలో కంచి తరహాలో ప్రతిరోజూ పూజలు జరుగుతాయి.
* స్వామివారిని దర్శించడం వల్ల కుటుంబంలో శాంతి, సంపద కలుగుతుందని అంటారు.
* ప్రత్యేక ఉత్సవాల సమయంలో ఆలయం చుట్టూ పల్లె వాతావరణం మరింత ఆధ్యాత్మికంగా మారుతుంది.
* కేవలం ఒక్క రోజులోనే ఈ ఆలయానికి వెళ్లి రావొచ్చు. కాగా ఈ ఆలయాన్ని దర్శించుకునే సమయంలో మరో మూడు ఆలయాలను కూడా సందర్శించవచ్చు. బొంతపల్లిలోని శ్రీ వీర భద్ర స్వామీ ఆలయం, ఇంద్రేశంలోని శ్రీ ఇంద్రేశ్వర స్వామీ ఆలయం, బీరంగూడలోని శ్రీ బ్రమరాంభ మల్లీఖార్జున స్వామీ ఆలయాన్ని దర్శించుకోవచ్చు.