- Home
- Andhra Pradesh
- IMD Rain Alert: మొదలైన అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు. బీ అలర్ట్
IMD Rain Alert: మొదలైన అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు. బీ అలర్ట్
IMD Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతుండడంతో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. శ్రీలంక తీరానికి సమీపంగా ఉన్న ఈ వ్యవస్థ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే 24–36 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. గంటకు 35–55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున తక్కువ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
రాయలసీమ–కోస్తా ప్రాంతాల్లో మూడు రోజుల వర్షాలు
దక్షిణ ఆంధ్రప్రదేశ్‌పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో మూడురోజులు వరుసగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షపాతం అధికంగా ఉండనుంది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే మొంథా తుఫాను ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూసిన నేపథ్యంలో ఈ వర్షాలు పంటలపై మరింత ప్రభావం చూపవచ్చని అధికారులు భావిస్తున్నారు.
మత్స్యకారులకు హెచ్చరిక
తీవ్ర గాలులు, అలజడి సముద్ర పరిస్థితుల కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని వాతావరణ కేంద్రం ఖచ్చితంగా సూచిస్తోంది. గాలుల వేగం పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పెరుగుతోన్న చలి తీవ్రత
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలోని ఆదిలాబాద్‌తో పాటు పలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ వర్షాలు పడితే చలి మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు.
అప్రమత్తమైన యంత్రాంగం
APSDMA సమాచారం ప్రకారం, అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వచ్చే రెండు రోజులపాటు విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని దక్షిణ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం లేని ప్రయాణాలు తగ్గించాలని సూచిస్తున్నారు.