ఈ తల్లి చేసిన పనికి పశువులు కూడా కాండ్రించి ఉమ్మేస్తాయి.. ప్రియుడి కోసం ఇంత దారుణమా.?
Crime News: మనిషివా.. పశువ్వా అని తిడుతుంటాం. అయితే కొందరు మనుషులు చేసే పనులు చూస్తే ఆ పశువులే కాండ్రించి ఉమ్మేస్తాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఓ తల్లి చేసి పనికి సమాజం ఉలిక్కిపడింది.

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన వివాహేతర సంబంధం
సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో చోటుచేసుకున్న విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తల్లితనాన్ని మరిచి, రెండేళ్ల వయసున్న కుమారుడి ప్రాణాలను బలిగొన్న ఓ మహిళ కథనం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. మొదట సహజ మరణంగా కనిపించిన ఈ ఘటన వెనుక ఉన్న భయానక నిజం దాదాపు 20 రోజుల తర్వాత బయటపడింది. వివరాల్లోకి వెళితే.. జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన స్వామి జీవనోపాధి కోసం క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో నివసిస్తున్నాడు. భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో వారి జీవితం సాధారణంగానే సాగుతున్నట్లు కనిపించింది. అయితే జ్యోతికి పెళ్లికి ముందు నుంచే నవీన్ అనే వ్యక్తితో పరిచయం ఉండేది. కాలక్రమేణా ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. భర్త ఇంట్లో లేని సమయంలో నవీన్ తరచూ జ్యోతి ఇంటికి వచ్చేవాడని దర్యాప్తులో వెల్లడైంది.
పసిబిడ్డ ఏడుపే ప్రాణాలు తీసింది
గత నెల చివర్లో స్వామి పనిమీద బయటకు వెళ్లిన సమయంలో నవీన్.. జ్యోతి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరూ ఇంట్లో ఉండగా రెండేళ్ల చిన్నారి హరికృష్ణ ఏడవడం ప్రారంభించాడు. బిడ్డ ఏడుపుతో అసహనానికి గురైన నవీన్, ఆ బాలుడు తమకు అడ్డుగా ఉన్నాడని భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిన్నారిని అడ్డు తొలగించాలనే దారుణ ఆలోచనకు ఇద్దరూ ఒప్పుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అనంతరం బాలుడిపై దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాల కారణంగా చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.
ఫిట్స్ వచ్చి చనిపోయాడంటూ నమ్మించిన తల్లి
బాలుడు మృతి చెందిన తర్వాత అసలు విషయం బయటపడకుండా జ్యోతి మరో నాటకానికి తెరలేపింది. భర్త ఇంటికి వచ్చిన వెంటనే బిడ్డకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చిందని ఆ కారణంగానే ప్రాణాలు కోల్పోయాడంటూ చెప్పి కన్నీరు పెట్టుకుంది. భార్య చెప్పిన విషయాన్ని నిజమని నమ్మిన స్వామి, కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాడు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఈ ఘటన సహజ మరణంగా ముగిసిపోయిందని అందరూ భావించారు.
భార్య ప్రవర్తనతో మొదలైన అనుమానం
అంత్యక్రియల తర్వాత కొద్దిరోజులకే జ్యోతి ప్రవర్తనలో మార్పులు కనిపించడంతో స్వామికి అనుమానం వచ్చింది. ఇంట్లో కొన్ని అనుమానాస్పద పరిస్థితులు కనిపించడంతో తన కుమారుడి మరణంపై సందేహాలు మరింత పెరిగాయి. దీంతో కుటుంబ సభ్యుల సమక్షంలో భార్యను ప్రశ్నించగా ఆమె సమాధానాలు పొంతన లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. చివరకు ఒత్తిడిని తట్టుకోలేక జరిగిన ఘటన గురించి ఆమె నిజం బయటపెట్టినట్లు సమాచారం.
కేసు నమోదు.. పరారీలో ప్రియుడు
భార్య ఒప్పుకున్న విషయాల ఆధారంగా స్వామి కీసర పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తదుపరి విచారణలో చిన్నారి మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశం నుంచి వెలికితీసి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు కారణమైంది. పసిబిడ్డ ప్రాణాలను కాపాడాల్సిన తల్లే అతడి మరణానికి కారణమైందన్న విషయం తెలిసి గ్రామస్థులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

