- Home
- Telangana
- ఫ్రెండ్ భార్యతో వివాహేతర సంబంధం, ఆపై హత్య.. హంతకుడిని పట్టించిన బాలయ్య ఫొటో. సినిమాను మించిన క్రైమ్ స్టోరీ
ఫ్రెండ్ భార్యతో వివాహేతర సంబంధం, ఆపై హత్య.. హంతకుడిని పట్టించిన బాలయ్య ఫొటో. సినిమాను మించిన క్రైమ్ స్టోరీ
Crime Diary: ఎంత ప్లాన్ చేసి నేరం చేసినా చట్టం ముందు ఏ నేరస్థుడూ తప్పించుకోలేడనేది సత్యం. నిజ జీవితంలో జరిగిన ఇలాంటి ఓ క్రైమ్‌కి సంబంధించిన విశేషాలను సీఐ జి. శ్రీనివాస వర్మ ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఊహించని ఘోరం అపార్ట్‌మెంట్‌లో దారుణం
హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దారుణ హత్య ఉదంతాన్ని సీఐ శ్రీనివాస వర్మ వివరించారు. 2017లో ఎర్రగడ్డలోని ఒక అపార్ట్‌మెంట్‌లో మహిళ మరణించారన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి చూడగా, అక్కడ సౌమ్య అనే ఓ మహిళ దారుణంగా హత్యకు గురై పడి ఉన్నారు. పోలీసులు మృతదేమాన్ని గమనించగా.. తలపై రాడ్‌తో కొట్టినట్లు గుర్తించారు. అనంతరం మృతదేహంపై దేవుడు గదిలో ఉండే నూనెను పోసి అంటించారు. ఆ తర్వాత వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఆన్ చేసిన నిందితుడు బయట నుంచి లాక్ చేసుకొని వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో సౌమ్య ఏడాదిన్నర బాబు కూడా ఉన్నాడు.
మొదటి అనుమానం భర్తపై..
పోలీసులు మొదట భర్త ప్రమేయం ఉందన్న కోణంలో విచారణ ప్రారంభించారు. భర్తను అదుపులోకి తీసుకొని అన్ని విధాల విచారించారు, మెట్రోలో సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న అతను.. సౌమ్య మరణించిన సమయంలో ఇంట్లో లేనని తెలిపాడు. పోలీసులు కూడా ఈ వివరాలను క్రాస్ చెక్ చేయడంతో హత్యలో సౌమ్య భర్త ప్రమేయం లేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో అసలు హంతకుడు ఎవరన్న దానిపై దృష్టి సారించారు.
దర్యాప్తు ప్రారంభం: టెక్నాలజీ ఆధారాల వేట
పోలీసులకు నిందితుడిని గుర్తించడం మొదట్లో పెద్ద సవాలుగా మారింది, ఎందుకంటే అక్కడ ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు. పోలీసులు ఆ అపార్ట్‌మెంట్ పరిసరాల్లోని వారిని, కంపెనీ వివరాలను సేకరించి విచారణ ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల వివరాలను సేకరించారు. నిందితుడిని పట్టుకోవడానికి సోషల్ మీడియా అకౌంట్లు (ఫేస్‌బుక్ వంటివి), కాల్ డేటా రికార్డులను (CDR) క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించారు.
భర్త స్నేహితుడిపై అనుమానం..
విచారణలో భాగంగా పోలీసులు సౌమ్య భర్తను కొన్ని ప్రశ్నలు అడిగారు. గతంలో ఎవరైనా స్నేహితులు ఉన్నారా అని ప్రశ్నించగా.. 2014లో అస్సాంలో పనిచేసిన సమయంలో రాజు, ప్రకాశ్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారని కానీ వారిపై ఎలాంటి అనుమానం లేదని సౌమ్య భర్త తెలిపాడు. కానీ పోలీసులు మాత్రం విచారణలో భాగంగా రాజు, ప్రకాశ్‌ల ఫోన్ నెంబర్లను తీసుకుని వారిపై నిఘా పెట్టారు. ఇద్దరు నెంబర్లను పరిశీలించగా.. హత్య జరిగిన రోజు ప్రకాశ్ హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు.
తీగ లాగితే కదిలిన డొంక..
హత్య జరిగిన రోజున ప్రకాశ్ ఫోన్ సౌమ్య ఇంటి దగ్గర ఉన్నట్లు లొకేట్ అయ్యింది. ప్రకాశ్ ఫోన్‌ను ట్రాక్ చేస్తూ వెళ్తే.. మెహీదీపట్నం నుంచి మహబూబ్ నగర్, అక్కడి నుంచి కర్నూలు మీదుగా అనంతపురం వెళ్లిపోయినట్లు గుర్తించారు. హత్య జరిగిన సమయంలో ప్రకాశ్ ఫోన్ స్విఛ్ ఆఫ్ ఉండడం, మరుసటి రోజున అనంతపురం వెళ్లడం పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చింది. దీంతో వెంటనే పై అధికారుల పర్మిషన్ తీసుకొని రాత్రికి రాత్రి అనంతపురం బయలుదేరి ఉదయం 5 గంటలకల్లా చేరుకున్నారు.
ప్రకాశ్ గురించి ఆరా తీయగా..
అనంతపురం చేరుకున్న సీఐ శ్రీనివాస్ వర్మ అక్కడి అధికారుల సహకారంతో వీఆర్ఏతో ప్రకాశ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీఆర్ఏ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశ్ అనే వ్యక్తి అక్కడే ఉంటాడని, అతనికి బ్లాక్ కలర్ స్కార్పియో కార్ ఉంటుందని తెలిపాడు. కారుకు నెంబర్ ప్లేట్ ఉండదని, బ్యాక్ సైడ్ అద్దానికి హీరో బాలకృష్ణ ఫొటో ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఫోన్ టవర్ ఆధారంగా ట్రాక్ చేయగా ప్రకాశ్ సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బైక్స్‌ను తీసుకొని పోలీసులు స్కార్పియోను వెంబడించారు. ఆ క్రమంలోనే నెంబర్ ప్లేట్ లేని కారు, బాలయ్య ఫొటో కనిపించడంతో పోలీసులు కారును ఫాలో అయ్యారు. వెంటనే కారును పక్కకు ఆపి ప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలోనే ప్రకాశ్ తను చేసిన మొత్తం వివరాలను వెల్లడించడం ప్రారంభించాడు. అతను ఈ కేసులో దోషిగా తేలాడు.
అసలు సౌమ్యతో ఎలా పరిచయం.?
పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. ప్రకాశ్‌కు సౌమ్యకు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే తనకు డబ్బులు కావాలని 3 నెలల క్రితం సౌమ్యను ప్రకాశ్ అడిగాడు. సౌమ్య కూడా రూ. 3 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చిందని అందుకే హైదరాబాద్ వచ్చినట్లు తెలిపాడు. అయితే తీరా డబ్బుల గురించి అడిగితే.. డబ్బులు అడ్జెస్ట్ కాలేవని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. డబ్బులు ఇవ్వక పోతే ఇద్దరి మధ్య సంబంధం గురించి మీ భర్తకు చెబుతాను అని ప్రకాశ్ బెదిరించాడు. ఈ క్రమంలోనే గొడవ పెద్దగా మారడంతో సౌమ్య తలపై రాడ్‌తో బాదాడు. ఈ హత్యను ప్రమాదంగా మార్చాలనే ఉద్దేశంతో గ్యాస్ లీకేజ్ డ్రామా ఆడాడు. అనంతరం సౌమ్య మెడలో ఉన్న బంగారాన్ని లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఎన్ని డ్రామాలు వేసినా చివరికి ప్రకాశ్ పోలీసులకు చిక్కాడు.

