Chicken Crisis : ఓ హైదరబాదీ... ఏమిటీ నీకీ గతి..!
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం కారణంగా ప్రస్తుతం గ్యాస్ కొరత కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ కొరత ప్రచారం కంగారుపెడుతోంది. ఇవి చాలవన్నట్లు తెలంగాణలో ఇప్పుడు చికెన్ కొరత ఏర్పడబోతోంది.

చికెన్ షాపులు బంద్..
Hyderaba : 'ముక్క లేనిదే ముద్ద దిగదు'... ఇది తెలంగాణోళ్ల ఫుడ్ స్టైల్ గురించి చెప్పే మాట. అనాదిగా వీరి జీవితాల్లో మాంసాహారం భాగమయ్యింది. ఇక హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... ఇక్కడి చికెన్ బిర్యానీకి ఏ స్థాయిలో డిమాండ్ ఉంటుందో అందరికీ తెలుసు. రోజూ బిర్యానీ తినే హైదరబాదీలు చాలామందే ఉంటారు... దేశంలోనే మాంసం తినేవారు అత్యధికంగా ఉన్న నగరం మనదే.
ఇలాంటి మాంసాహార ప్రియుల నగరంలో చికెన్ కొరత ఏర్పడితే..? ఇప్పుడు ఇదే జరగబోతోంది. ఏప్రిల్ 1 అంటే ఇవాళ్టి నుండి తెలంగాణవ్యాప్తంగా చికెన్ షాపులు మూతపడనున్నాయి. సమస్యల పరిష్కారం కోసం చికెన్ షాపులు యజమానులు నిరవధిక బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో హైదరాబాద్ తో సహా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ విక్రయాలు నిలిచిపోయాయి. ఈ స్ట్రైక్ ఇలాగే కొనసాగితే నాన్ వెజ్ ప్రియుల నాలుక చప్పబడటం ఖాయం.
హైదరబాదీలు ఆగమాగం...
భారతదేశంలో అత్యధికంగా మాంసాహారం తినే ప్రాంతం తెలంగాణ, నగరం హైదరాబాద్. ఈ నిజాంల నగరం మాంసాహారానికి చాలా ఫేమస్. తెలంగాణ పల్లెల్లో యాట (మేక, గొర్రె మాంసం) ఎక్కువగా తింటారు... కానీ హైదరాబాద్ లో చికెన్ దే పైచేయి. అలాంటి చికెన్ విక్రయాలు నిలిచిపోతే నగరవాసులకు ఇబ్బందులు తప్పవు.
మేక మాంసం (మటన్) కిలో ప్రస్తుతం రూ.800-1000 వరకు ఉంది. అదే చికెన్ అయితే కిలో రూ.200 నుండి 300 వరకు ఉంటుంది. మహా అయితే రూ.400 దాటదు. ఈ ధరల వ్యత్యాసం కూడా హైదరాబాద్ లో చికెన్ వినియోగం ఎక్కువగా ఉండటానికి రీజన్. ఇప్పుడు చికెన్ బంద్ అయితే నగరవాసులు మటన్ వైపు మళ్లాలి... ఇది వారి జేబులకు చిల్లు పెట్టనుంది. నగరవాసులు జీవన వ్యయం పెరిగే అవకాశాలున్నాయి.
తెలంగాణ ప్రజలు చికెన్ లేకుండా ఉంటారా..?
మాంసాహారానికి రుచి మరిగిన పులిని గడ్డి తినమంటే తింటుందా..? ఈ మాటలు ప్రస్తుతం తెలంగాణవారికి సరిగ్గా సరిపోతాయి. చికెన్ షాపుల బంద్ నేపథ్యంలో రోజూ చికెన్ తినేవారు కాయగూరలతో సరిపెట్టుకోవాల్సిందే. ఒకటి రెండ్రోజులు అయితే పరవాలేదు... కానీ చాలాకాలం చికెన్ దొరక్కుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇది అహార అలవాట్లపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు... ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీయవచ్చు.
ఎందుకు చికెన్ షాపులు స్ట్రైక్ చేస్తున్నాయి..?
తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన నగరాలతో పాటు జిల్లాల్లోనూ చికెన్ విక్రయాలు నిలిచిపోయాయి. చికెన్ సెంటర్ల యజమానులు స్వచ్ఛందంగా బంద్‌కు పిలుపునివ్వడంతో మాంసం ప్రియులకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఈ ఆకస్మిక బంద్‌కు ప్రధాన కారణం హోల్‌సేల్ వ్యాపారుల సిండికేట్‌గా మారడమేనని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. చికెన్ ధరలు సామాన్యుడికి భారంగా మారడమే కాకుండా, వ్యాపారం చేయడం తమకు భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా పౌల్ట్రీ ఫారమ్ యజమానులు, బ్రాయిలర్ కంపెనీలు ధరలను నియంత్రిస్తుండటం వల్ల రిటైల్ వ్యాపారులు నష్టపోతున్నట్లు సమాచారం. ఎండల తీవ్రత పెరగడంతో కోళ్ల మరణాల రేటు పెరిగిందని, దీనివల్ల సరఫరా తగ్గి ధరలు పెరిగాయని ఉత్పత్తిదారులు చెబుతుండగా.. రిటైలర్లు మాత్రం ఇది కృత్రిమ కొరత అని వాదిస్తున్నారు. కిలో చికెన్ ధర గతంలో ఎన్నడూ లేని విధంగా పెరగడం వల్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని, షాపుల అద్దెలు, పనివారి ఖర్చులు కూడా రావడం లేదని వ్యాపార సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
హోటల్స్ పై ప్రభావం..
ఇప్పటికే గ్యాస్ కొరతతో కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు చికెన్ షాపుల బంద్ ప్రభావం కూడా హోటల్, రెస్టారెంట్ రంగంపై తీవ్రంగా పడనుంది. చికెన్ లభ్యత లేకపోవడంతో బిర్యానీ, ఇతర మాంసాహార వంటకాల తయారీ నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో ఆదివారం వంటి కీలక రోజుల్లో కూడా హోటల్స్ కు గిరాకీ తగ్గే అవకాశాలున్నాయి. ఇలా వాటి ఆదాయం మరింత తగ్గనుంది.
పౌల్ట్రీ రంగంలోని సమస్యలను పరిష్కరించి, అటు వినియోగదారులకు, ఇటు చిరు వ్యాపారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రతిష్ఠంభణ మరికొన్ని రోజులు కొనసాగితే పౌల్ట్రీ రంగం మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

