- Home
- Telangana
- స్లీపర్ బస్సుల్లోనే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి.? బస్సు ఎక్కే ముందు వీటిని చెక్ చేసుకోండి
స్లీపర్ బస్సుల్లోనే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి.? బస్సు ఎక్కే ముందు వీటిని చెక్ చేసుకోండి
Kurnool Bus Accident: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. దీంతో స్లీపర్ బస్సుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

స్లీపర్ బస్సుల డిజైన్
స్లీపర్ బస్సుల నిర్మాణ విధానం భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ బస్సుల్లో సాధారణంగా 2x1 సీటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఒకసారి 30 నుంచి 40 మంది వరకు ప్రయాణించవచ్చు. బెర్త్‌ల పొడవు సుమారు 6 అడుగులు, వెడల్పు 2.5 అడుగులు మాత్రమే ఉంటుంది. అయితే ఈ బస్సుల్లో కేవలం స్లీపర్ సీట్లు మాత్రమే ఉండడంతో బస్సు మధ్యలో ఉండే స్థలం చాలా ఇరుకుగా ఉంటుంది. లావుగా ఉండే ఒక వ్యక్తి కూడా సరిగ్గా నడవలేని పరిస్థితి ఉంటుంది. దీంతో ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు బస్సులో నుంచి బయటకు అంత సులభంగా వచ్చేందుకు అవకాశం ఉండడం లేదు. బస్సు లోపలి నిర్మాణం సౌకర్యవంతంగా ఉన్నా, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు సరైన ప్రదేశాల్లో లేకపోవడం, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు లేకపోవడం వంటి అంశాలు మరణాల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి.
బస్సుల ఎత్తు కూడా ఓ కారణం
స్లీపర్ బస్సుల ఎత్తు సాధారణ బస్సుల కంటే ఎక్కువగా ఉంటుంది. సుమారు 8 నుండి 9 అడుగుల వరకు ఉంటాయి. ఈ ఎత్తు కారణంగా బయట నుంచి ఎవరైనా కాపాడేందుకు ప్రయత్నించినా.. బస్సు లోపలికి వెళ్లడంలో ఇబ్బంది ఉంటుంది. ఇది రెస్క్యూ ఆపరేషన్‌ను ఆలస్యం చేస్తూ మరణాల సంఖ్య పెరగడానికి కారణమవుతుంది.
డ్రైవర్ల అలసట, రాత్రి ప్రయాణాల ముప్పు
స్లీపర్ బస్సులు ఎక్కువగా రాత్రివేళల్లో దూర ప్రయాణాలకు వినియోగిస్తారు. గంటల కొద్దీ నిరంతరంగా డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్లు అలసటకు గురవుతున్నారు. 2018లో నిర్వహించిన సర్వే ప్రకారం, సుమారు 25 శాతం మంది డ్రైవర్లు నిద్ర మత్తుతో డ్రైవింగ్ చేశామని అంగీకరించారు. అయితే కొన్ని అధునాతన బస్సుల్లో డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టమ్స్ ఉన్నా, వాటి పనితీరు సరిగ్గా ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా అర్థరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రమాదంలో ఆ రెండు నిమిషాలే కీలకం
నిపుణుల ప్రకారం, ప్రమాదం జరిగిన తర్వాత మొదటి రెండు నిమిషాలలో తీసుకునే చర్యలే ప్రాణాలను కాపాడగలవు. స్లీపర్ బస్సుల్లో ఎక్కువ మంది నిద్రలో ఉండటంతో మొదటి క్షణాల్లోనే గందరగోళం నెలకొంటుంది. లోయర్ బెర్త్‌లలో ఉన్నవారికి బయటపడే అవకాశం ఉన్నా, అప్పర్ బెర్త్‌ల్లో ఉన్నవారు చిక్కుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమయానికి తలుపులు లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు తెరవకపోతే పరిస్థితి భయంకరంగా మారుతుంది.
ప్రయాణానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* స్లీపర్ బస్సుల్లో ఎక్కే ముందు ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి:
* బస్సులో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉందో లేదో పరిశీలించాలి.
* ఎమర్జెన్సీ ఎగ్జిట్ లొకేషన్ ఎక్కడుందో తెలుసుకోవాలి.
* డ్రైవర్ విశ్రాంతిగా ఉన్నాడో లేదో, అతని ప్రవర్తనను గమనించాలి.
* సాధ్యమైనంత వరకు నైట్ ట్రిప్‌లను తగ్గించడం, లేదా మధ్య రాత్రి తర్వాత ప్రారంభమయ్యే ప్రయాణాలను నివారించడం మంచిది.
* బస్సు కంపెనీకి RTO అనుమతులు ఉన్నాయో లేదో, బస్సు స్థితి సరిగా ఉందో కచ్చితంగా చూడాలి.
* వీలైతే మధ్య మధ్యలో డ్రైవర్‌ను మాట్లాడిస్తూ ఉండాలి.