తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు సవాల్ విసిరారు. హైదరాబాద్ లోక్ సభ నుండి పోటీచేసి అసదుద్దీన్ ఓవైసిపై గెలిచి చూపించాలన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అమిత్ షాకు ధైర్యం ఉంటే హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఓడించాలని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని ఉద్దేశించి కూడా తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ఎవరికీ చెప్పకుండా పాకిస్థాన్ వెళ్లి బిర్యానీ తిని వచ్చినప్పుడు లేని అభ్యంతరం.. తాను ప్రధానిని కలిస్తే ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య 100వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం తెలంగాణ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమిత్ షాకు సీఎం రేవంత్ సవాల్
హైదరాబాద్ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. దమ్ముంటే హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అసదుద్దీన్ ఒవైసీని ఓడించాలని అన్నారు. తెలంగాణలో బీజేపీకి పెద్దగా రాజకీయ పాత్ర లేదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే బీజేపీకి ఈ పరిస్థితి ఎదురైందంటూ విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీని అంతగా పోటీగా భావించడం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్‌పై కూడా సీఎం విమర్శలు చేశారు. ఆయనను రాజకీయంగా పెద్దగా పట్టించుకోనని, తండ్రి కేసీఆర్ అండతో నాయకుడిగా ఎదిగారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను మాత్రం ప్రత్యర్థి నాయకుడిగా పరిగణిస్తానని చెప్పారు.
ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో భయాన్ని సృష్టిస్తోందని... ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ వంటి సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఆరోపించారు. కులం, మతం, భాష పేరుతో ప్రజల మధ్య విభేదాలు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
మోదీ విదేశీ పర్యటనలపైనా సీఎం విమర్శలు చేశారు. ప్రధాని ఎన్ని సార్లు విదేశాలకు వెళ్లారో లెక్కే లేదని, ఆయన విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా మారిపోయారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, బీజేపీ అధికారాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు.
ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది
దేశంలో ఓటు హక్కుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలపై రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న ఓటు హక్కును తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. పేద ప్రజల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన 'ఓట్ చోర్.. గద్దీ చోర్' నినాదానికి ప్రజల నుంచి సపోర్ట్ లభిస్తోందని సీఎం అన్నారు. ఓటు హక్కుకు భంగం కలిగితే దేశంలో ఎవరైనా దానిపై స్పందించవచ్చని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్రను ప్రస్తావిస్తూ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆ పార్టీ కీలక పాత్ర పోషించిందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ అని, ప్రజలు ఉన్నంతకాలం పార్టీ కూడా కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. మరో వెయ్యేళ్లు కాంగ్రెస్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏబివిపిలో పనిచేసింది నిజమే..
తాను గతంలో ఏబీవీపీలో పనిచేశానని, ఆ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు. అయితే దేశానికి రాహుల్ గాంధీ అవసరం అని భావించి కాంగ్రెస్ వైపు వచ్చానని చెప్పారు. ప్రభుత్వ అవసరాల కోసం రాజకీయ నాయకులను కలవడంలో తప్పేమీ లేదని, అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు వెళ్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడేళ్లలో చేపట్టిన కార్యక్రమాల్లో 65 శాతం అమలు చేశామని, మిగిలిన వాటిని వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047 విధానంతో దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, యువతకు ఉపాధి కల్పించడం తమ ప్రాధాన్యం అని తెలిపారు. పెట్టుబడిదారులకు తెలంగాణలో అనుకూల వాతావరణం కల్పిస్తామని, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. అదానీ సంస్థల నుంచి కూడా పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగిస్తున్నామని వ్యాఖ్యానించారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ఆందోళన
దేశంలో భవిష్యత్తులో లోక్‌సభ సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లను పెంచితే దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు ఎక్కువగా పెరిగితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం అవసరం తగ్గిపోతుందని అన్నారు.
రాష్ట్రాల జీడీపీ, జనాభా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని 50 శాతం ఫార్ములాతో సీట్ల పెంపు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. జనాభా నియంత్రణ, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరగకూడదన్నది తమ వాదనగా వివరించారు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోదీకి ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలా వద్దా అన్నది ప్రధాని నిర్ణయమని పేర్కొన్నారు. తాము ఆహ్వానించడం ద్వారా తమ మర్యాదను చూపించామని, ఆయన స్పందన ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా రాష్ట్రంలో క్రీడలకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని తెలిపారు. ఖేలో ఇండియా కార్యక్రమంలో సుమారు 8 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డోను తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇప్పటికే మెస్సీని తీసుకొచ్చామని వెల్లడించారు.















