- Home
- Telangana
- Turmeric Board: నిజామాబాద్‌లో పసుపుబోర్డును ప్రారంభించిన అమిత్ షా.. రైతులకు కలిగే లాభాలు ఏంటి?
Turmeric Board: నిజామాబాద్‌లో పసుపుబోర్డును ప్రారంభించిన అమిత్ షా.. రైతులకు కలిగే లాభాలు ఏంటి?
Turmeric Board : నిజామాబాద్‌లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఇది పసుపు రైతుల నాలుగు దశాబ్దాల కలగా ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?

నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన అమిత్ షా
తెలంగాణ పసుపు రైతుల ఎన్నో ఏళ్ల కల నిజమైంది. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నిజామాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టంగా ప్రకటించారు.
తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అమిత్ షా అన్నారు. ‘‘40 ఏళ్ల కలను నేడు సాకారం చేశాం. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈ బోర్డు కోసం ఎన్నో సార్లు పోరాటం చేశారు. చివరికి ఈ కార్యాలయం ఏర్పాటు కావడం గొప్ప విజయమని భావిస్తున్నాం’’ అని చెప్పారు.
పసుపు పంటకు నిజామాబాద్ రాజధాని
పసుపు పంటకు నిజామాబాద్ రాజధాని లాంటిదని అమిత్ షా అన్నారు. ఇది ప్రపంచ మార్కెట్‌లో భారత్ ప్రతిష్టను మరింత పెంచుతుందని తెలిపారు. 2030 నాటికి ఒక బిలియన్ డాలర్ల విలువగల పసుపును ఎగుమతి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రయోజనాన్ని రైతుల వరంగా మార్చేందుకు, జియో ట్యాగింగ్, ప్యాకింగ్, బ్రాండింగ్, ఎగుమతులకు ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్టు తెలిపారు.
పసుపు బోర్డు ద్వారా రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ అందించనున్నామని అమిత్ షా వెల్లడించారు. భారత్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రైతుల మార్కెటింగ్, ఎగుమతులపై నూతన విధానాలు అమలు చేస్తామని తెలిపారు. పసుపు కొనుగోలు, రవాణా, ఎగుమతులను బోర్డు నిర్వహిస్తుందని చెప్పారు.
పసుపులో అనేక ఔషధ గుణాలు
పసుపు యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ లక్షణాలతో ఔషధంగా పేరు పొందిందని అమిత్ షా గుర్తుచేశారు. ‘‘నాన్నమ్మ రోజూ వంటల్లో పసుపును తప్పనిసరిగా వాడేది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సంపదను ప్రపంచ దేశాలకు అందించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.
పసుపు బోర్డు ఛైర్మన్‌గా తెలంగాణకే చెందిన గంగారెడ్డి నియమితులయ్యారని, ఇది రాష్ట్రానికి గౌరవంగా భావించవచ్చని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మెట్‌పల్లి ప్రాంతాల్లో పసుపు విస్తృతంగా సాగవుతుందని వివరించారు.
కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం అమిత్ షా పసుపు ఉత్పత్తులను పరిశీలించి, రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. వారి సమస్యలు, సూచనలు వినిపించి, కేంద్రం వారి అభివృద్ధికి సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
జాతీయ పసుపు బోర్డుతో తెలంగాణ రైతులకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి?
నిజాబాబాద్ లో పూర్తి స్థాయి జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా పసుపు పంటకు గిట్టుబాటు ధర లభించి, అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
పసుపు పంటపై ప్రత్యేకంగా దృష్టిసారించే ఈ బోర్డు పసుపు పరిశోధన, మార్కెట్ అభివృద్ధి, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, ప్రాసెసింగ్, ఎగుమతులపై దృష్టి పెడుతుంది. ఈ బోర్డులో ఆయుష్, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల శాఖలతో పాటు పసుపు రైతుల ప్రతినిధులు, ఎగుమతిదారులు పాల్గొంటారు.
ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలోని కమ్మరపల్లిలో పసుపు పరిశోధన కేంద్రం పని చేస్తున్నా, దీనిని బోర్డు అనుబంధంగా అభివృద్ధి చేస్తే మరింత లాభాలుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు ఉత్పత్తి చేసే దేశంగా టాప్ లో ఉంది. ప్రపంచ పసుపు వ్యాపారంలో దాదాపు 62 శాతానికి పైగా వాటా భారత్‌కు ఉంది. తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో పసుపు సాగు విస్తృతంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్లకు పైగా పసుపు సాగు జరుగుతోంది.
నిజామాబాద్ పసుపు బోర్డు ద్వారా తెలంగాణ రైతులకు కలిగే ప్రయోజనాలు
- పసుపు మార్కెట్ అభివృద్ధికి తోడ్పాటు
- పసుపు ఎగుమతుల పెంపు
- పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు
- పసుపు రైతులకు గిట్టుబాటు ధర
- పసుపు నూతన వంగడాల ఆవిష్కరణ
- యాంత్రీకరణ, సాంకేతిక సలహాలు
- పసుపు ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి
పసుపు కేవలం సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. ఇది ఆహారంలో, ఔషధాలలో, సౌందర్య సాధనాలలో, మతపరమైన కార్యక్రమాల్లో కీలకమైనదిగా ఉంది. దీనికి వ్యాధినిరోధకత, యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి. అందుకే పసుపునకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.