Meta: స్మార్ట్ గ్లాసుల్లో రికార్డ్ అయ్యే పర్సనల్ వీడియోలను ఎవరైనా చూస్తున్నారా.?
Meta: టెక్ దిగ్గజం మెటా తీసుకొచ్చిన AI స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. ఈ గ్లాసెస్ ద్వారా రికార్డ్ అయ్యే వీడియోలు, ఫోటోలను AI మోడళ్లను ట్రైనింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నారని వచ్చిన రిపోర్టులు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి

ఏంటీ ఏఐ స్మార్ట్ గ్లాసెస్.?
మెటా కంపెనీ ప్రముఖ కళ్లజోడు బ్రాండ్ రేబాన్‌తో కలిసి AI సాంకేతికతతో కూడిన స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేసింది. ఈ గ్లాసెస్‌లో ముఖ్యంగా రెండు సాంకేతిక భాగాలు ఉంటాయి. ఇందులో ఒకటి చిన్న కెమెరా, మైక్రోఫోన్. వీటితో యూజర్లు నడుస్తూ ఉండగానే వీడియోలు, ఫోటోలు రికార్డ్ చేయవచ్చు. అలాగే AI సహాయంతో కొన్ని పనులు కూడా చేయవచ్చు. కానీ ఈ ఫీచర్లే ఇప్పుడు పెద్ద చర్చకు కారణమయ్యాయి.
యూజర్ల వీడియోలను AI ట్రైనింగ్‌కు ఉపయోగిస్తున్నారా?
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ గ్లాసెస్‌తో తీసిన కొన్ని వీడియోలు AI మోడళ్లను ట్రైనింగ్ చేయడానికి ఉపయోగిస్తారని సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలను “డేటా అనోటేటర్లు” అని పిలిచే సిబ్బంది పరిశీలిస్తారు. వారు వీడియోలను చూసి వాటికి ట్యాగ్‌లు లేదా లేబుల్స్ జోడిస్తారు. ఇది సాధారణంగా AI మోడళ్లను మెరుగుపరచడానికి ఉపయోగించే విధానం. అయితే ఇందులో ఒక పెద్ద సమస్య ఉంది. ఆ వీడియోల్లో కొన్ని వ్యక్తుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఉండే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు.
వ్యక్తిగత క్షణాలు, బ్యాంక్ వివరాలు కూడా కనిపించే అవకాశం
ఈ వీడియోలను పరిశీలించే కొందరు ఉద్యోగుల ప్రకారం, కొన్నిసార్లు చాలా వ్యక్తిగత దృశ్యాలు కూడా రికార్డ్ అవుతాయి. ఉదాహరణకు ఇంటి లోపలి దృశ్యాలు, కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు, వ్యక్తిగత సంభాషణలు. కొన్ని సందర్భాల్లో వినియోగదారులు తాము రికార్డ్ అవుతున్నామనే విషయం కూడా తెలియకపోవచ్చు. అంతేకాదు, కొన్నిసార్లు వీడియోల్లో బ్యాంక్ కార్డు వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారం కూడా కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయమే ప్రస్తుతం పెద్ద గోప్యతా సమస్యగా మారింది.
నైరోబిలో ఉద్యోగులు వీడియోలను పరిశీలిస్తున్నారా?
రిపోర్టుల ప్రకారం, ఈ వీడియోలను పరిశీలించే పనిలో నైరోబి నగరంలోని టెక్నాలజీ సిబ్బంది పాల్గొంటున్నారు. వారు ఈ వీడియోలను చూసి AI సిస్టమ్‌కు అవసరమైన సమాచారాన్ని గుర్తించి ట్యాగ్ చేస్తారు. కొంతమంది ఉద్యోగులు చెప్పిన వివరాల ప్రకారం.. ఉద్యోగం కోల్పోతామనే భయం ఉందని, వ్యక్తిగత వీడియోలు చూడాల్సి వస్తోందని తెలిపారు. అలాగే గోప్యతపై ప్రశ్నలు అడిగితే సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెటా కంపెనీ ఏమంటోంది?
ఈ వివాదంపై మెటా స్పందించింది. యూజర్లు AIతో చేసే కొన్ని చర్యలను కొన్నిసార్లు మనుషులు కూడా సమీక్షించవచ్చని కంపెనీ తన పాలసీల్లో పేర్కొంది. అందుకే యూజర్లు చాలా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం తప్పుకోవాలని సూచించింది. ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను మెటా సంస్థ, ఫ్రెంచ్ కంపెనీ EssilorLuxottica తో కలిసి తయారు చేస్తోంది. 2025 నాటికి ఈ AI గ్లాసెస్ దాదాపు 7 మిలియన్ యూనిట్లు అమ్ముడైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

