Google 27 Birthday : గూగుల్ పేరుకు అర్థమేంటో తెలుసా? ప్రస్తుతం దీని ఓనర్ ఎవరు?
Google 27 Birthday : గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ ఇవాళ 27వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ భారతీయుడి సారథ్యం నడుస్తున్న ఈ కంపెనీ అసలు ఎలా ప్రారంభమయ్యింది? ఇంతకూ గూగుల్ అంటే అర్థమేంటి? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్ భర్త్ డే స్పెషల్
Google 27 Birthday : ఈ రోజు (శనివారం,సెప్టెంబర్ 27న) ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్, టెక్ దిగ్గజం గూగుల్ తన 27వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరిలో కంపెనీ తన వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది కేవలం ఒక తేదీ మాత్రమే కాదు… చిన్న గ్యారేజ్ నుంచి గ్లోబల్ టెక్ హౌస్‌గా మారిన గూగుల్ సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసే ఒక వేడుక. ఈ ప్రత్యేక సందర్భంలో గూగుల్ స్టోరీ ఏమిటి? దాన్ని ఎవరు స్థాపించారు? ఇప్పుడు యజమాని ఎవరు? సీఈవో ఎవరు? లాంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
గూగుల్ పేరు వెనక రహస్యం?
'Google' అనే పదం 'googol' నుంచి వచ్చింది, దీని అర్థం 1 తర్వాత 100 సున్నాలు. అంటే ప్రపంచంలోని అంతులేని సమాచారాన్ని ఒకచోట చేర్చి, సులభతరం చేయడమే ఈ పేరు ఉద్దేశం. ఇది కేవలం సెర్చ్ ఇంజిన్‌గా మొదలైనా నేడు గూగుల్ సేవలు చాలా విస్తరించాయి. వీటిలో జీమెయిల్ (Gmail), గూగుల్ మ్యాప్స్ (Google Maps), యూట్యూబ్ (YouTube), గూగుల్ క్లౌడ్ (Google Cloud), ఆండ్రాయిడ్ (Android), ఏఐ టూల్స్, పిక్సెల్ ఫోన్‌ల వంటి హార్డ్‌వేర్ ఉన్నాయి.
గూగుల్‌ను ఎవరు ప్రారంభించారు?
గూగుల్‌ను 1998లో లారీ పేజ్ (Larry Page), సెర్గీ బ్రిన్ (Sergey Brin) ప్రారంభించారు. ఈ కంపెనీని స్థాపించే సమయంలో వాళ్ళిద్దరూ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో (Stanford University) పీహెచ్‌డీ విద్యార్థులు. అధికారికంగా కంపెనీ 1998 సెప్టెంబర్ 4న రిజిస్టర్ అయింది… కానీ గూగుల్ తన పుట్టినరోజుగా సెప్టెంబర్ 27ను ఎంచుకుంది. ఈరోజే కంపెనీ రికార్డు స్థాయిలో వెబ్ పేజీలను ఇండెక్స్ చేసింది… ఈ మైలురాయికి గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నారు. గూగుల్ మొదటి ప్రాజెక్ట్ 1997 సెప్టెంబర్ 15న ప్రారంభమైంది, అంటే అప్పటి నుంచే పని మొదలైంది. ఒక చిన్న గ్యారేజ్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీగా మారింది.
గూగుల్ యజమాని ఎవరు?
ప్రస్తుతం గూగుల్, ఆల్ఫాబెట్ ఇంక్ (Alphabet Inc) అనుబంధ సంస్థ. గూగుల్ ప్రధాన కార్యకలాపాలు, ఇతర ప్రయోగాత్మక ప్రాజెక్టులను (వేమో, వెరిలీ, ఎక్స్ రీసెర్చ్ వంటివి) నిర్వహించడానికి 2015లో ఆల్ఫాబెట్‌ను ఏర్పాటు చేశారు. ఆల్ఫాబెట్ ఒక పబ్లిక్ కంపెనీ, అంటే దాని వాటాదారులే దీన్ని ఉమ్మడిగా నిర్వహిస్తారు. కానీ క్లాస్ బి షేర్ల ద్వారా లారీ పేజ్, సెర్గీ బ్రిన్, మరికొంతమంది అంతర్గత వ్యక్తులు ఈ కంపెనీపై నియంత్రణను కలిగి ఉన్నారు.
గూగుల్ సీఈఓ ఎవరు?
లారీ పేజ్, సెర్గీ బ్రిన్ ఇప్పుడు గూగుల్ రోజువారీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు, కానీ ఇద్దరూ ఇప్పటికీ బోర్డు సభ్యులుగా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ (Sundar Pichai) గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓగా ఉన్నారు. ఏఐ, క్లౌడ్, హార్డ్‌వేర్, కొత్త టెక్నాలజీ రంగాలలో కంపెనీ నాయకత్వం ఇప్పుడు చేతుల్లోనే ఉంది… మొత్తంగా గూగుల్ సారథి ఆయనే.
గూగుల్ డూడుల్ కథ ఏమిటి?
గూగుల్ ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రత్యేక సందర్భాలను డూడుల్ ద్వారా గుర్తు చేసుకుంటుంది. ఇవి ప్రత్యేకంగా డిజైన్ చేసిన లోగోలు… వీటిలో రంగురంగుల డ్రాయింగ్‌లు, యానిమేషన్‌లు, కొన్నిసార్లు గేమ్‌లు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా గూగుల్ తన 1998 నాటి మొదటి లోగోను చూపించింది, ఇది 90ల నాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది.