యూటర్న్ తీసుకున్న విరాట్ కోహ్లీ.. అభిమానులకు పండగే మరి !
Virat Kohli : విరాట్ కోహ్లీ డిసెంబర్ 24 నుండి ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నారు. కోచ్ గౌతమ్ గంభీర్ షరతులు, జట్టులో ఆడాలని రోహిత్ శర్మ అంగీకరించడం, అలాగే అంతర్జాతీయ సిరీస్‌ల మధ్యలో తన ఫామ్ ను కొనసాగించడం వంటి కారణాలున్నాయి.

విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ
క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్... కాదు కాదు అదరిపోయే విషయం. క్రికెట్ వర్గాలలో సంచలనం సృష్టించిన విషయం ఇది. భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ తిరిగొస్తున్నాడు. దేశవాళీ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడటానికి సిద్ధమయ్యాడు. ఆయన ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి మొదట నిరాకరించారు. కానీ, అకస్మాత్తుగా తన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
డిసెంబర్ 24 నుండి ఈ మెగా వన్డే టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కోహ్లీ ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (DDCA)కి అధికారిక సమాచారాన్ని అందించాడు. జాతీయ జట్టుకు ఆడాలనుకునే ప్రతి ఆటగాడు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలనే షరతును బీసీసీఐ విధించిన సంగతి తెలిసిందే. కోహ్లీ కంటే ముందే, మరో స్టార్ రోహిత్ శర్మ కూడా ఈ టోర్నమెంట్‌లో ఆడనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్షన్ కమిటీకి తెలియజేశాడు. మొదట నో చెప్పి తర్వాత కోహ్లీ ఎందుకు ఓకే చెప్పాడనే వివరాలు గమనిస్తే..
సంచలన నిర్ణయాలతో విమర్శకులకు దీటైన జవాబు ఇచ్చిన కోహ్లీ
విరాట్ కోహ్లీ ఈ ఏడాది మే నెలలో టెస్టు క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత త్వరలోనే వన్డే క్రికెట్‌కు కూడా దూరం అవుతారు లేదా జాతీయ జట్టు నుండి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. కానీ, పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి రెండు మ్యాచ్‌లలో డకౌట్‌గా వెనుతిరిగారు.
ఆ తర్వాత సిడ్నీలో అద్భుతమైన ఫామ్‌తో హాఫ్ సెంచరీ సాధించి తిరిగి పుంజుకున్నారు. దక్షిణాఫ్రికాపై రాంచీలో జరిగిన మ్యాచ్‌లోనూ కోహ్లీ సూపర్ సెంచరీ బాదాడు. ఈ సెంచరీతో తనపై వచ్చిన అన్ని విమర్శలకు దీటైన జవాబు చెప్పారు. మైదానంలో తన ఫామ్ తిరుగులేనిదని నిరూపించాడు.
కోచ్ గంభీర్‌తో విభేదాలు.. బీసీసీఐకి తలనొప్పి
రాంచీ మ్యాచ్ ముగిసిన తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్‌తో విరాట్ కోహ్లీకి విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి. భారత క్రికెట్ అభిమానుల దృష్టిలో రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరూ అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లు. వారి భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత, ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో వారి సంబంధాలపై నిరంతర చర్చలు బీసీసీఐకి పెద్ద సమస్యగా మారాయి. గంభీర్ మొదట్లో రాహుల్ ద్రవిడ్ స్థానంలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు కోహ్లీ, రోహిత్‌లతో ఆయనకు ఉన్న సంబంధాలు ఇప్పుడు లేవని అనేక రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లకు, కోచ్‌కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే విధంగా కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే, కోహ్లీ, గంభీర్‌ల మధ్య సరిగా మాట్లాడుకునే విధంగా కూడా లేదని సమాచారం. ఈ పరిణామాలపై చర్చించడానికి బీసీసీఐ రాయ్‌పూర్‌లో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుందని సమాచారం. ఈ భేటీలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గంభీర్, రోహిత్, కోహ్లీతో పాటు బోర్డులోని ఇతర అధికారులు పాల్గొనే అవకాశం ఉంది.
విరాట్ కోహ్లీ యూటర్న్ వెనుక కారణాలు ఏంటి?
పలు రిపోర్టుల ప్రకారం.. కోహ్లీ మొదట్లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడటానికి ఆసక్తి చూపలేదు. కానీ, రోహిత్ శర్మ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అంగీకరించడంతో విరాట్‌పై ఒత్తిడి పెరిగింది. రోహిత్ ఆడుతున్నప్పుడు, ఒక ప్లేయర్‌కు మాత్రమే ఎందుకు మినహాయింపు ఇవ్వాలనే ప్రశ్న తలెత్తింది.
ఈ నేపథ్యంలో బోర్డు కోహ్లీతో మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలాగే, కోహ్లీ నిరాకరించినట్లయితే, అది ఇతర ఆటగాళ్లకు తప్పుడు సందేశాన్ని పంపుతుందని బోర్డు ఆందోళన చెందింది. విరాట్‌కు బోర్డు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుందనే విమర్శలకు తావిచ్చే అవకాశం ఉంది. అందుకే, బీసీసీఐ సెలెక్టర్లు కోహ్లీతో మాట్లాడి, ఆయనను ఒప్పించారని సమాచారం.
బోర్డు ఒప్పించిన తర్వాత, కోహ్లీ తన సొంత జట్టు డీడీసీఏతో మాట్లాడారు. ఆయన జట్టులో చేరడం వల్ల ఢిల్లీ జట్టు బలంగా తయారవుతుంది. కోహ్లీ ఎన్ని మ్యాచ్‌లు ఆడతారనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, జట్టు ఆడబోయే ఆరు మ్యాచ్‌లలో కనీసం రెండు మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉంటారని సమాచారం. విజయ్ హజారే ట్రోఫీలో ఆడటం కోహ్లీకి కూడా ప్రయోజనకరం.
దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత, భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది. జనవరి 11, 14, 18 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనికి ముందు కోహ్లీకి దాదాపు ఒక నెల విరామం లభిస్తుంది. విజయ్ హజారే ట్రోఫీలో ఆడటం ద్వారా ఆయన తన బ్యాటింగ్ ఫామ్ ను, మ్యాచ్ ఫిట్‌నెస్‌ను కొనసాగించవచ్చు.

