Suryakumar Yadav : స్కై ఈజ్ ది లిమిట్.. బట్లర్, కోహ్లీ రికార్డులు ఖతం.. సూర్య నయా హిస్టరీ
Suryakumar Yadav : న్యూజిలాండ్‌పై టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించారు. అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా జోస్ బట్లర్ రికార్డును అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నారు.

రికార్డుల వేటలో సూర్యభాయ్.. రోహిత్, విరాట్ కోహ్లీ కూడా సాధ్యం కాని రీతిలో వరల్డ్ రికార్డ్!
భారత టీ20 స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారు. ఫామ్‌లోకి రావడమే కాదు, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సంచలన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో సూర్య అద్భుత ప్రదర్శన చేశారు.
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 30 బంతుల్లోనే 63 పరుగులు సాధించారు. ఈ క్రమంలో ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాళ్ల పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టాడు.
బంతుల పరంగా ప్రపంచ రికార్డు సాధించిన సూర్య
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 3000 పరుగుల మైలురాయిని చేరుకున్న బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు సృష్టించారు. సూర్య కేవలం 1822 బంతుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. దీనికి ముందు ఈ రికార్డు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేరిట ఉండేది. బట్లర్ 2068 బంతుల్లో 3000 పరుగులు పూర్తి చేశారు.
ఇప్పుడు సూర్య ఆ రికార్డును భారీ తేడాతో అధిగమించి ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. సూర్య విధ్వంసానికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (2078 బంతులు) మూడో స్థానానికి పడిపోయారు.
రోహిత్, కోహ్లీల రికార్డులు కనుమరుగు
భారత జట్టు మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రికార్డులను కూడా సూర్య అధిగమించారు. భారతీయుల్లో ఇంతకుముందు రోహిత్ శర్మ 2149 బంతుల్లో 3000 పరుగులు పూర్తి చేసి మొదటి స్థానంలో ఉండేవారు. విరాట్ కోహ్లీ 2169 బంతుల్లో ఈ మార్కును అందుకున్నారు. తాజా మ్యాచ్‌తో సూర్య వీరిద్దరినీ వెనక్కి నెట్టి భారత టాప్ బ్యాటర్‌గా నిలిచారు. బంతుల ఆడటం విషయంలో సూర్యకుమార్ యాదవ్ సగటు మిగతా ఆటగాళ్ల కంటే ఎంతో మెరుగ్గా ఉండటం గమనార్హం.
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన సూర్య
సూర్యకుమార్ యాదవ్ కేవలం పరుగుల వేగంలోనే కాదు, ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా కూడా కొత్త చరిత్ర లిఖించారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ టీ20 సిరీస్‌లో సూర్య మొత్తం 242 పరుగులు చేశారు. గతంలో 2021లో ఇంగ్లాండ్‌పై జరిగిన సిరీస్‌లో విరాట్ కోహ్లీ 231 పరుగులు చేశారు. ఇప్పటి వరకు అదే రికార్డుగా ఉండగా, ఇప్పుడు సూర్య ఆ రికార్డును తన వశం చేసుకున్నారు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తూనే వ్యక్తిగత మైలురాళ్లను అధిగమిస్తూ సూర్య దూసుకుపోతున్నారు.
టీ20ల్లో 3000 పరుగులకు తక్కువ బంతులు తీసుకున్న వారు
1. సూర్యకుమార్ యాదవ్ (భారత్) - 1822 బంతులు
2. జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) - 2068 బంతులు
3. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) - 2078 బంతులు
4. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) - 2113 బంతులు
5. రోహిత్ శర్మ (భారత్) - 2149 బంతులు
6. విరాట్ కోహ్లీ (భారత్) - 2169 బంతులు
ఇషాన్ కిషన్ సెంచరీతో భారత్ భారీ స్కోరు
ఈ మ్యాచ్‌లో సూర్యతో పాటు యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా చెలరేగి ఆడారు. ఇషాన్ కిషన్ తన టీ20 కెరీర్‌లో మొదటి సెంచరీని నమోదు చేశారు. కేవలం 49 బంతుల్లోనే 103 పరుగులతో ఇషాన్ విరుచుకుపడ్డారు. మూడో స్థానంలో వచ్చి న్యూజిలాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్ల మెరుపు బ్యాటింగ్‌తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 271 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. ఈ ఇద్దరి బ్యాటింగ్ ధాటికి గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం హోరెత్తిపోయింది.

