- Home
- Sports
- T20 World Cup : 384 వికెట్లు తీసినా తీరని ప్రపంచకప్ కల.. ఈ స్టార్ ప్లేయర్ కు అన్యాయం జరిగిందా?
T20 World Cup : 384 వికెట్లు తీసినా తీరని ప్రపంచకప్ కల.. ఈ స్టార్ ప్లేయర్ కు అన్యాయం జరిగిందా?
T20 World Cup 2026 : టీ20ల్లో 384 వికెట్లు తీసినా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ప్రపంచకప్ ఆడే అవకాశం దక్కలేదు. అతనికి అన్యాయం జరిగిందా? 2026 టీ20 వరల్డ్ కప్‌పై స్టార్ స్పిన్నర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ప్రపంచకప్ సమరం: చరిత్ర సృష్టిస్తారా?
టీ20 వరల్డ్ కప్ 2026 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో ఏడు రోజుల్లో భారత్, శ్రీలంకలలో టీ20 క్రికెట్ పండుగ మొదలుకానుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుత ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమ్ ఇండియా మళ్లీ టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది. అయితే, గణాంకాలు మాత్రం భారత్‌కు సవాల్ విసురుతున్నాయి.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా రెండుసార్లు ట్రోఫీని గెలవలేదు. అలాగే, ఆతిథ్య జట్టు కూడా కప్పును ముద్దాడలేదు. మరి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఈ ప్రతికూల రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర తిరగరాస్తుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
అత్యధిక వికెట్లు తీసినా ఆవేదన తప్పలేదు ఈ స్టార్ కు..
భారత జట్టులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ భరోసా ఇస్తున్నారు. కానీ, ఒక స్టార్ ఆటగాడికి మాత్రం టీ20 వరల్డ్ కప్ ఆడే అదృష్టం ఇంకా కలగలేదు. అతనే స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.
టీ20 క్రికెట్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ చాహల్ కావడం విశేషం. చాహల్ ఇప్పటివరకు 329 టీ20 మ్యాచులు ఆడి 23.60 సగటుతో ఏకంగా 384 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లోనూ 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీశాడు. ఇంతటి అద్భుత రికార్డు ఉన్నా, 35 ఏళ్ల చాహల్‌కు ఇప్పటివరకు ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడం గమనార్హం.
శుభ్‌మన్ గిల్ సైతం అన్ లక్కీ
చాహల్ మాత్రమే కాదు, టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ విషయంలో దురదృష్టవంతుడిగా నిలిచాడు. రెండు ఫార్మాట్లలో భారత్‌కు కెప్టెన్‌గా ఉన్న గిల్, ఇప్పటివరకు ఒక్క టీ20 ప్రపంచకప్ కూడా ఆడలేదు. ఈసారి కూడా సెలక్టర్లు గిల్ కంటే సంజూ శాంసన్‌కే మొగ్గు చూపారు.
ఇక చాహల్ విషయానికి వస్తే, అతను 2023 ఆగస్టులో వెస్టిండీస్‌తో తన చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన అతను, ప్రస్తుతం భారత్-న్యూజిలాండ్ సిరీస్‌లో హిందీ కామెంటేటర్‌గా కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. విధి ఎంత విచిత్రంగా ఉందంటే, మైదానంలో ఉండాల్సిన ఆటగాడు మైక్ పట్టుకుని విశ్లేషణలు ఇస్తున్నాడు.
వరల్డ్ కప్ విజేతపై చాహల్ జోస్యం
వరల్డ్ కప్‌లో చోటు దక్కకపోయినా, ఈ టోర్నీపై చాహల్ ఆసక్తికర అంచనాలు వేశాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన అతను, ఈసారి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును జస్ప్రీత్ బుమ్రా గెలుచుకుంటాడని జోస్యం చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ లేదా అభిషేక్ శర్మ వంటి బ్యాటర్లను కాదని, బౌలర్‌ను ఎంచుకోవడం చర్చనీయాంశమైంది.
ఇక టోర్నీలో బెస్ట్ బ్యాటర్ గా అభిషేక్ శర్మ నిలుస్తాడని, అతనే అత్యధిక సిక్సర్లు కూడా బాదుతాడని చాహల్ అన్నారు. ఈ మెగా టోర్నీలో అత్యధిక స్కోరు సాధించే ఆటగాడు కూడా అభిషేక్ అయ్యే అవకాశం ఉందని చాహల్ అభిప్రాయపడ్డాడు.
సత్తా చాటడానికి సిద్ధంగా టీమిండియా
ఫిబ్రవరి 7వ తేదీన అమెరికాతో జరిగే మ్యాచ్‌తో భారత్ తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అనంతరం ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో తలపడుతుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ హైవోల్టేజ్ పోరు ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది.

