- Home
- Sports
- IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
SRH IPL 2026 Full Squad : ఐపీఎల్ 2026 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13 కోట్లతో లియామ్ లివింగ్‌స్టోన్‌ను సొంతం చేసుకుంది. వేలం తర్వాత ఎస్ఆర్హెచ్ పూర్తి జట్టు, కొనుగోలు చేసిన ఆటగాళ్ల వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఐపీఎల్ 2026 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పక్కా వ్యూహం
ఐపీఎల్ 2026 మినీ వేలానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రూ. 25.50 కోట్ల పర్సుతో బరిలోకి దిగింది. 2025 సీజన్‌లో అదరగొట్టిన ప్యాట్ కమిన్స్ సేన, ఈ వేలంలో తమ జట్టులోని 10 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత సీజన్ తర్వాత రాహుల్ చాహర్, అభినవ్ మనోహర్, ఆడమ్ జంపా, సిమర్‌జీత్ సింగ్, వియాన్ ముల్డర్, అథర్వ తైడే, సచిన్ బేబీ వంటి ఆటగాళ్లను SRH విడుదల చేసింది. అంతేకాకుండా, స్టార్ బౌలర్ మహ్మద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు ఆల్-క్యాష్ డీల్ ద్వారా ట్రేడ్ చేసింది. ఈ నేపథ్యంలో జట్టును బలోపేతం చేయడానికి ఫ్రాంచైజీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
రికార్డు ధరకు లియామ్ లివింగ్‌స్టోన్ కొనుగోలు చేసిన హైదరాబాద్ టీమ్
ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన అతిపెద్ద కొనుగోలు ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్. ఇతని కోసం ఫ్రాంచైజీ ఏకంగా రూ. 13 కోట్లు వెచ్చించింది. టి20 క్రికెట్‌లో ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న లివింగ్‌స్టోన్, ఐపీఎల్‌లో కూడా తనదైన ముద్ర వేశాడు. గత సీజన్‌లో (IPL 2025) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నప్పటికీ, అతని ప్రదర్శన అంత గొప్పగా లేదు.
8 ఇన్నింగ్స్‌లలో కేవలం 112 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆ జట్టు అతన్ని విడుదల చేసింది. అయితే, అతని ఓవరాల్ రికార్డును దృష్టిలో ఉంచుకుని ఎస్ఆర్హెచ్ భారీ ధర చెల్లించింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 49 మ్యాచ్‌లు ఆడిన లివింగ్‌స్టోన్ 158.76 స్ట్రైక్ రేట్‌తో 1,051 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో కూడా లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ రెండూ వేయగల సత్తా ఉన్న ఇతను 13 వికెట్లు పడగొట్టాడు.
ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసిన ఇతర ఆటగాళ్లు ఎవరు?
లివింగ్‌స్టోన్‌తో పాటు ఇతర కీలక ఆటగాళ్లను కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. జాక్ ఎడ్వర్డ్స్‌ను రూ. 3 కోట్లకు సొంతం చేసుకోగా, సలిల్ అరోరాను రూ. 1.50 కోట్లకు దక్కించుకుంది. భారత పేసర్ శివమ్ మావిని రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. వీరితో పాటు పలువురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను కూడా తీసుకుంది.
శివాంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ టెర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, క్రైన్స్ ఫులేత్రా వంటి యువ ఆటగాళ్లను ఒక్కొక్కరికి రూ. 30 లక్షల చొప్పున వెచ్చించి జట్టులోకి తీసుకుంది. మొత్తంమీద, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు, యంగ్ ప్లేయర్ల కలయికతో జట్టును పూర్తి చేసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ : విడుదలైన, ట్రేడ్ అయిన ఆటగాళ్లు వీరే
వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా, రూ. 10 కోట్లకు కొనుగోలు చేసిన మహ్మద్ షమీని కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు ఆశించినప్పటికీ, లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. స్పిన్ విభాగంలో ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ వంటి వారిని విడుదల చేయడంతో స్పిన్ డిపార్ట్‌మెంట్ ఖాళీ అయింది.
అయితే, శ్రీలంక స్టార్ వనిందు హసరంగ, మహీష్ తీక్షణ వంటి వారి కోసం ప్రయత్నించకపోయినా, జేదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్ వంటి బౌలర్లను అట్టిపెట్టుకుంది. బ్యాటింగ్ విభాగంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర ఓపెనర్లను రీటైన్ చేసుకోవడం ద్వారా తన కోర్ టీమ్‌ను పటిష్టంగా ఉంచుకుంది.
ఐపీఎల్ 2026 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
వేలం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పూర్తి వివరాలు గమనిస్తే.. ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా కొనసాగనున్నారు.
హైదరాబాద్ టీమ్ కొనుగోలు చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే
1. లియామ్ లివింగ్‌స్టోన్ (రూ. 13 కోట్లు)
2. జాక్ ఎడ్వర్డ్స్ (రూ. 3 కోట్లు)
3. సలిల్ అరోరా (రూ. 1.50 కోట్లు)
4. శివమ్ మావి (రూ. 75 లక్షలు)
5. శివాంగ్ కుమార్ (రూ. 30 లక్షలు)
6. సాకిబ్ హుస్సేన్ (రూ. 30 లక్షలు)
7. ఓంకార్ టెర్మలే (రూ. 30 లక్షలు)
8. అమిత్ కుమార్ (రూ. 30 లక్షలు)
9. ప్రఫుల్ హింగే (రూ. 30 లక్షలు)
10. క్రైన్స్ ఫులేత్రా (రూ. 30 లక్షలు)
సన్ రైజర్స్ హైదరాబాద్ : ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్స్, కమిందు మెండిస్, హర్ష్ దూబే, రవిచంద్రన్ స్మరన్, అనికేత్ వర్మ, ఈషన్ మలింగ, జీషన్ అన్సారీ, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, శివమ్ మావి, సలిల్ అరోరా, శివాంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ టెర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, క్రైన్స్ ఫులేత్రా.

