IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?
IPL 2026 CSK : ఐపీఎల్ 2026 వేలంలో కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లను రూ. 14.20 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. వీరు అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా చరిత్ర సృష్టించారు. అసలు సీఎస్కే ప్లానేంటి?

ఐపీఎల్ వేలంలో సీఎస్‌కే సంచలనం.. రూ. 14.20 కోట్లతో ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు సొంతం!
ఐపీఎల్ 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అనూహ్య నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు, ఇద్దరు అన్‌క్యాప్డ్ భారతీయ యువ ఆటగాళ్ల కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఖర్చు చేసింది.
కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ అనే ఇద్దరు యువ ఆటగాళ్లను ఒక్కొక్కరిని రూ. 14.20 కోట్లకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. ఈ భారీ ధరకు అమ్ముడుపోవడంతో వీరిద్దరూ ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా రికార్డు సృష్టించారు.
ఐపీఎల్ రికార్డులు బద్దలు కొట్టిన ప్రశాంత్ వీర్
ఐపీఎల్ 2026 వేలంలో ప్రశాంత్ వీర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఈ యంగ్ స్టార్ కోసం వేలంలో తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఇతనిని రూ. 14.20 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. దీంతో టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కార్తీక్ శర్మతో కలిసి సంయుక్తంగా నిలిచాడు.
ఐపీఎల్ 2026 వేలంలో అత్యధిక ధర పలికిన మూడవ ఆటగాడిగా కూడా ప్రశాంత్ వీర్ నిలవడం విశేషం. జాతీయ జట్టుకు ఇంకా ఎంపిక కాకముందే ఇంతటి భారీ మొత్తాన్ని దక్కించుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎవరీ ప్రశాంత్ వీర్?
ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్ (UPT20)లో ప్రశాంత్ వీర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు 64 సగటుతో ఏకంగా 320 పరుగులు సాధించాడు. ఈ గణాంకాలు అతని ప్రతిభకు అద్దం పడుతున్నాయి. వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ట్రయల్స్‌కు కూడా ప్రశాంత్ హాజరయ్యాడు.
అక్కడ అతని ప్రదర్శన నచ్చడంతోనే, వేలంలో అతని కోసం సీఎస్‌కే ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడింది. కేవలం 20 ఏళ్ల వయసున్న ప్రశాంత్ వీర్ ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ కావడం గమనార్హం. రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేయడానికి ఇతను సరైన ఎంపికగా భావిస్తున్నారు.
టీ20 కెరీర్ విషయానికొస్తే, ఇప్పటివరకు 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన వీర్ 112 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 40 పరుగులు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో, అండర్-23 విభాగంలో అతను చూపించిన దూకుడు సీఎస్‌కే యాజమాన్యాన్ని ఆకర్షించింది.
ధోని నుంచి నేర్చుకోవడమే లక్ష్యం
చెన్నై జట్టుకు ఎంపికైన తర్వాత ప్రశాంత్ వీర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. "చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అక్కడ ఎంఎస్ ధోని ఉన్నారు. ఆయన లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే విధానం, ఆయన ఆలోచనా తీరు, మాట్లాడే పద్ధతి, ఒత్తిడిలో కూడా శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకునే తీరు.. ఇలా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది" అని ప్రశాంత్ అన్నాడు.
"లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. కానీ ధోని సాధించిన విజయాలు చాలా ప్రత్యేకం. ఆయన నుంచి నేను కనీసం నాలుగు లేదా ఐదు శాతం నేర్చుకున్నా, అది నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది" అని వేలం తర్వాత ప్రశాంత్ వ్యాఖ్యానించాడు.
ఎవరీ కార్తీక్ శర్మ?
రాజస్థాన్ తరఫున ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మ కూడా సీఎస్‌కే దృష్టిని ఆకర్షించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో 5 ఇన్నింగ్స్‌లలో 133 పరుగులు చేసిన కార్తీక్, ఏకంగా 160.24 స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. ఒక ఫినిషర్‌గా అతని సామర్థ్యం అద్భుతం.
మాజీ క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ చోప్రా కూడా ఇటీవల కార్తీక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్‌ను ముగించే సత్తా ఉండటంతో ఐపీఎల్ 2026 కోసం సీఎస్‌కే ఇతనిని హాట్ ప్రాపర్టీగా భావించింది. ఓవరాల్‌గా కార్తీక్ శర్మ 12 టీ20 మ్యాచ్‌లు ఆడి 30.36 సగటుతో 334 పరుగులు సాధించాడు. ఇప్పుడు కార్తీక్ శర్మ కూడా ప్రశాంత్ వీర్‌తో సమానంగా ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు.
ఐపీఎల్ 2026 వేలంలో సీఎస్‌కే కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత, సీఎస్‌కే జట్టులో భారీ మార్పులు చేసింది. వేలానికి ముందు పలువురు స్టార్ ఆటగాళ్లను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో రూ. 43.40 కోట్ల భారీ పర్సుతో (వేలంలో రెండవ అత్యధికం) సీఎస్‌కే వేలంలోకి అడుగుపెట్టింది. జట్టులో మొత్తం 9 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.
• అకీల్ హొసీన్ (వెస్టిండీస్, బౌలర్) - రూ. 2 కోట్లు
• ప్రశాంత్ వీర్ (ఇండియా, ఆల్ రౌండర్) - రూ. 14.20 కోట్లు
• కార్తీక్ శర్మ (ఇండియా, వికెట్ కీపర్) - రూ. 14.20 కోట్లు
• మాథ్యూ షార్ట్ (ఆస్ట్రేలియా, ఆల్ రౌండర్) - రూ. 1.50 కోట్లు
• అమన్ ఖాన్ (ఇండియా, ఆల్ రౌండర్) - రూ. 40 లక్షలు
ఐపీఎల్ 2026 సీఎస్‌కే పూర్తి జట్టు ఇదే
ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, జామీ ఓవర్టన్, గుర్జప్‌నీత్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అకీల్ హొసీన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్.

