SMAT 2025: పరుగుల సునామీ.. 472 రన్స్, 74 బౌండరీలు ! యశస్వి, సర్ఫరాజ్ విధ్యంసం
SMAT 2025: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై, హర్యానా మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. యశస్వి జైస్వాల్ సెంచరీ, సర్ఫరాజ్ ఖాన్ మెరుపులతో ముంబై 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డుల మోత మోగించింది.

బౌలర్లకు చుక్కలు.. ఒకే మ్యాచ్‌లో 472 పరుగులు, 74 బౌండరీలు! హైలైట్స్ ఇవే
భారతదేశ ప్రతిష్ఠాత్మక దేశవాళీ టి20 టోర్నమెంట్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో పరుగుల సునామీ సృష్టించిన మ్యాచ్ ఆదివారం జరిగింది. పూణేలోని డి.వై. పాటిల్ అకాడమీ స్టేడియంలో ముంబై, హర్యానా జట్ల మధ్య జరిగిన ఈ పోరులో బ్యాటర్ల ముందు బౌలర్లు నిస్సహాయంగా మారిపోయారు.
ముందుగా హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్, నిశాంత్ సింధు ముంబై బౌలర్లపై విరుచుకుపడగా, ఆ తర్వాత ముంబై స్టార్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ హర్యానా బౌలర్లను ఊచకోత కోశారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ సాధించిన యశస్వి, టీ20 ఫార్మాట్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ అద్భుత సెంచరీ కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో మొత్తం 472 పరుగులు నమోదు కావడం, 74 ఫోర్లు, సిక్సర్లు వెలువడటం విశేషం.
హర్యానా భారీ స్కోరు.. అంకిత్, నిశాంత్ జోరు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన హర్యానా జట్టుకు ఓపెనర్, కెప్టెన్ అంకిత్ కుమార్ శుభారంభం అందించారు. అంకిత్ కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు. 211.90 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అంకిత్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.
అంకిత్ తర్వాత నిశాంత్ సింధు బాధ్యత తీసుకుని స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. సింధు 38 బంతుల్లో 63 పరుగులు చేశారు. వీరిద్దరి విధ్వంసంతో హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ముంబై ముందు 235 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.
యశస్వి, సర్ఫరాజ్ విధ్యంసం.. ముంబై విక్టరీ
235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం ముంబైకి అంత సులభం కాదనిపించింది. కానీ యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి రాగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీరిద్దరూ హర్యానా బౌలర్లపై ఎదురుదాడికి దిగి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు.
ఓపెనర్‌గా వచ్చిన యశస్వి జైస్వాల్ 50 బంతుల్లో 101 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. ఈ యువ ఎడమచేతి వాటం బ్యాటర్ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాదారు. ఇక నంబర్-3లో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ డ్రెస్సింగ్ రూమ్ నుండే సెట్ అయి వచ్చినట్లుగా చెలరేగిపోయారు. కేవలం 25 బంతుల్లోనే 64 పరుగులు సాధించారు. సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. యశస్వి, సర్ఫరాజ్ మధ్య 37 బంతుల్లోనే 88 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.
బౌండరీల వర్షం.. 472 పరుగుల మ్యాచ్
హర్యానా, ముంబై మధ్య జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో మొత్తం 472 పరుగులు నమోదయ్యాయి. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 55 ఫోర్లు, 19 సిక్సర్లు నమోదయ్యాయి. అంటే మొత్తం 74 సార్లు బంతి బౌండరీ లైన్ దాటింది.
పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు అద్భుత విజయం సాధించింది. యశస్వి, సర్ఫరాజ్ మెరుపులతో ముంబై 235 పరుగుల లక్ష్యాన్ని మరో 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, 4 వికెట్ల తేడాతో గెలిచింది. అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
టీ20 జట్టులో చోటు కోసం యశస్వి గట్టి పోటీ
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ ఇన్నింగ్స్‌తో సెలెక్టర్లకు గట్టి సంకేతాలు పంపారు. 48 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న యశస్వి, మొత్తం 50 బంతుల్లో 101 పరుగులు చేశారు. ఆయన స్ట్రైక్ రేట్ 202గా నమోదైంది. కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి ఆ తర్వాత 48 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు.
ఈ తుపాను ఇన్నింగ్స్‌తో భారత టీ20 జట్టులో తన స్థానం కోసం యశస్వి మరోసారి బలమైన వాదన వినిపించారు. గతంలో టి20 జట్టులో ఓపెనర్‌గా సేవలు అందించిన యశస్వి, మంచి రికార్డు ఉన్నప్పటికీ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నారు.
గిల్, శాంసన్‌లకు యశస్వి సవాల్
యశస్వి జైస్వాల్ ప్రస్తుత ఫామ్ భారత టి20 కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఆందోళన కలిగించే అంశం. గత 15 టీ20 మ్యాచ్‌లలో గిల్ ఒక్క హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. గిల్ ఫామ్ లేక ఇబ్బంది పడుతుండగా, యశస్వి వరుసగా రాణిస్తుండటం గిల్ స్థానానికి ముప్పుగా మారవచ్చు.
మరోవైపు, ఓపెనర్‌గా మూడు సెంచరీలు సాధించినా సంజూ శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవడానికి కష్టపడుతున్నారు. గిల్ పేలవ ఫామ్ కొనసాగితే, యశస్వి లేదా శాంసన్‌లకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌తో యశస్వి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుని, జాతీయ జట్టులో పునరాగమనానికి మార్గం సుగమం చేసుకున్నాడు.

