- Home
- Sports
- IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IND vs SA 3rd T20I : భారత్, దక్షిణాఫ్రికా మధ్య ధర్మశాలలో జరగనున్న మూడో టీ20కి రంగం సిద్ధమైంది. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ స్థానంలో స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

IND vs SA 3rd T20: మూడో టీ20లో భారీ మార్పులు
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచులలో చెరో విజయంతో ఇరు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి. సిరీస్‌లో ఆధిపత్యం చెలాయించేందుకు ధర్మశాల లో జరగనున్న మూడో టీ20 మ్యాచ్ అత్యంత కీలకం కానుంది.
ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో ఓటమి తర్వాత టీమిండియా మేనేజ్‌మెంట్ తుది జట్టులో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓపెనింగ్ విభాగంలో ఈ మార్పు చోటుచేసుకోనుంది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గిల్ పేలవ ప్రదర్శన.. ప్రపంచ కప్ సన్నాహాలు
ఆసియా కప్ 2025 తర్వాత నుంచి శుభ్‌మన్ గిల్ టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే, అతడి ప్రదర్శన మాత్రం అంచనాలకు తగ్గట్టుగా లేదు. ముఖ్యంగా 2025 సంవత్సరంలో గిల్ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన 14 ఇన్నింగ్స్‌లలో గిల్ కేవలం 263 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో గిల్ మొదటి బంతికే ఔట్ అయి నిరాశపరిచాడు. తొలి వన్డేలో రెండు బంతులు ఆడి అవుట్ అయ్యాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో, టీమిండియా ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ మెగా ఈవెంట్ సన్నాహాల్లో భాగంగా ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే గిల్‌ను పక్కన పెట్టి బెంచ్ బలాన్ని పరీక్షించాలని యోచిస్తున్నారు.
సంజూ శాంసన్ ఎంట్రీకి రంగం సిద్ధం
గిల్ స్థానంలో బెంచ్‌కే పరిమితమైన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు అవకాశం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తన టీ20 కెరీర్‌లో ఇప్పటికే 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డు సంజూ సొంతం. మొదటి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించడంలో సంజూ దిట్ట. 2024-25 సీజన్‌లో ఓపెనర్‌గా సంజూ అద్భుత ప్రదర్శన కనబరిచారు. కొద్ది మ్యాచుల్లోనే మూడు సెంచరీలు బాది టీ20 ఫార్మాట్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.
గతంలో గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించిన తర్వాత, సంజూను మిడిల్ ఆర్డర్‌లో ఆడించడం లేదా జట్టు నుంచి తప్పించడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గిల్ వైఫల్యాల నడుమ, అభిమానులు, క్రికెట్ నిపుణులు సంజూను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వచ్చే మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో కలిసి సంజూ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
ధర్మశాల పిచ్ ఎలా ఉంటుంది? సంజూ దుమ్మురేపుతాడా?
మూడో టీ20 జరగనున్న ధర్మశాలలోని హెచ్‌పిసిఎ (HPCA) స్టేడియం తన అందమైన పరిసరాలతో పాటు బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌కు ప్రసిద్ధి. ఇక్కడ పిచ్‌పై మంచి బౌన్స్ లభిస్తుంది. అంతేకాకుండా, బౌండరీలు చిన్నవిగా ఉండటంతో బౌలర్లకు ఇబ్బందులు తప్పవు.
ఇలాంటి పరిస్థితుల్లో పవర్‌ప్లేలో వేగంగా పరుగులు రాబట్టగల బ్యాటర్ జట్టుకు అవసరం. బౌన్సీ పిచ్‌లపై ఆడేందుకు ఇష్టపడే సంజూ శాంసన్ ఇక్కడ కచ్చితంగా ప్రభావం చూపగలడని విశ్లేషకులు భావిస్తున్నారు.
గిల్ vs సంజూ: గణాంకాలు ఎలా ఉన్నాయి?
గణాంకాలను పరిశీలిస్తే సంజూ శాంసన్ స్పష్టంగా గిల్ కంటే ముందంజలో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ 2024 జూలై 1 నుంచి ఓపెనర్‌గా 21 టీ20 మ్యాచ్‌లు ఆడి 29.76 సగటుతో 506 పరుగులు చేశారు. ఇందులో కేవలం 2 అర్ధశతకాలు మాత్రమే ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 136.02గా ఉంది.
ఇక సంజూ శాంసన్ ఇదే సమయంలో సంజూ 13 టీ20 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 3 సెంచరీల సహాయంతో 417 పరుగులు సాధించారు. సంజూ సగటు 34.75గా ఉండగా, స్ట్రైక్ రేట్ గిల్ కంటే చాలా మెరుగ్గా 182.89గా ఉంది. ఈ గణాంకాలే సంజూ ఎంపికను సమర్థిస్తున్నాయి.
మూడో టీ20 కోసం భారత తుది జట్టు అంచనా ఇదే
ముల్లన్‌పూర్ ఓటమి తర్వాత గిల్ స్థానంలో సంజూ రాకతో పాటు మిగిలిన జట్టు కూర్పులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. మూడో టీ20 కోసం అంచనా వేసిన ప్లేయింగ్ 11 గమనిస్తే..
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
బెంచ్: శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్

