IND vs SA: గిల్ అవుట్.. శాంసన్ ఇన్.. వచ్చీ రాగానే రికార్డుల మోత, కానీ అంతలోనే..
IND vs SA: ఐదో టీ20లో సంజూ శాంసన్ కొట్టిన షాట్ తగిలి అంపైర్ రోహన్ పండిట్ గాయపడ్డారు. గిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన శాంసన్ ఈ మ్యాచ్‌లో 1000 పరుగుల మైలురాయిని దాటారు. భారత్ కు అద్బుతమైన ఆరంభం అందించాడు.

IND vs SA: సంజూ శాంసన్ షాట్‌కు అంపైర్ విలవిల ! అహ్మదాబాద్ మ్యాచ్‌లో హైడ్రామా!
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న ఈ సిరీస్ నిర్ణయాత్మక పోరులో టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు జరిగాయి. గాయం కారణంగా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టుకు దూరమవ్వగా, ఆయన స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు అవకాశం దక్కింది. క్రీజులోకి వచ్చిన వెంటనే శాంసన్ తన బ్యాటింగ్‌తో సునామీ సృష్టించాడు. అయితే, సంజూ బ్యాట్ నుండి వచ్చిన ఒక షాట్ కారణంగా మైదానంలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. శాంసన్ కొట్టిన బంతి బలంగా తగిలి అంపైర్ రోహన్ పండిట్ గాయపడ్డారు.
అంపైర్‌ను గాయపరిచిన సంజూ శాంసన్ బులెట్ షాట్
సంజూ అంపైర్‌ను గాయపరిచిన సంఘటన భారత ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో జరిగింది. ఆ సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్ డెవోన్ ఫెరీరా బౌలింగ్ చేస్తున్నాడు. ఓవర్ నాలుగో బంతిని ఎదుర్కొన్న సంజూ శాంసన్, బంతిని బలంగా స్ట్రెయిట్ డ్రైవ్ ఆడారు. ఆ షాట్ ఎంత బలంగా ఆడాడు అంటే.. బంతి తొలుత బౌలర్ చేతికి తగిలి, ఆ వేగంతో నేరుగా వెళ్లి అంపైర్ రోహన్ పండిట్ మోకాలికి తాకింది.
బంతి బలంగా తగలడంతో అంపైర్ రోహన్ పండిట్ నొప్పితో గట్టిగా అరుస్తూ మైదానంలోనే కింద పడిపోయాడు. వెంటనే సంజూ శాంసన్ కూడా ఆందోళనతో అంపైర్ వైపు చూశారు. ఈ ఘటన జరిగిన వెంటనే దక్షిణాఫ్రికా ఫిజియో మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు, ఆయన వెనుకే భారత ఫిజియో కూడా వచ్చారు. ఇద్దరూ అంపైర్‌ను పరీక్షించి, నొప్పి తగ్గడానికి స్ప్రే చేశారు. ఈ సమయంలో జట్టు సభ్యుడు హర్షిత్ కూడా కొన్ని డ్రింక్స్ తో అక్కడికి చేరుకున్నారు. వైద్య సహాయం అనంతరం, అంపైర్ రోహన్ పండిట్ కోలుకుని తిరిగి అంపైరింగ్ చేశారు.
Lol, the Umpire is injured 🤣🤣#INDvSApic.twitter.com/pfjvOy6HNz
— DAVIL (@abhaysingh147) December 19, 2025
శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. రికార్డుల మోత సామీ !
ఐదో టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లుగా వచ్చిన అభిషేక్ శర్మ, సంజు శాంసన్ జట్టుకు శుభారంభాన్ని అందించారు. పవర్ ప్లేలోనే భారత జట్టు పరుగుల వరద పారించింది. అయితే, వీరిద్దరూ అర్థ సెంచరీలు చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు.
అభిషేక్ శర్మ 21 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 పరుగులు చేసి అవుట్ కాగా, సంజూ శాంసన్ 37 పరుగుల వద్ద తన వికెట్ కోల్పోయారు. శాంసన్ తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు. ఇదే మ్యాచ్‌లో శాంసన్ ఒక అరుదైన ఘనతను సాధించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ల జాబితాలో చేరాడు. వీరిద్దరు అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ సిక్సర్లు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
మళ్లీ టాస్ ఓడిన భారత్.. సౌతాఫ్రికా ముందు భారీ స్కోర్
అహ్మదాబాద్‌లోని స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీనిపై స్పందించిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, "మేము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. మంచు ప్రభావం (Dew) ఉండకపోవచ్చు. స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. సిరీస్ ఫలితం తేలే మ్యాచ్ అయినప్పటికీ, మా ఆటను ఆస్వాదించడమే మా లక్ష్యం" అని పేర్కొన్నాడు. హార్దిక్ (63 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్, తిలక్ వర్మ (73 పరుగులు) సూపర్ నాక్ తో భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది.
భారత తుది జట్టులో కీలక మార్పులు
లక్నోలో జరిగిన గత మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ గాయపడినట్లు వార్తలు వచ్చాయి. దీనిని ధృవీకరిస్తూ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో గిల్ గాయం కారణంగా దూరమైనట్లు తెలిపారు. "గిల్ లక్నోలో స్వల్పంగా గాయపడ్డాడు, అందుకే అతడి స్థానంలో సంజూ శాంసన్ వచ్చాడు" అని సూర్య వివరించారు. ఈ ఏడాది టీ20లలో గిల్ ఫామ్ అంత గొప్పగా లేదు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌లలోనూ భారీ స్కోరు సాధించలేకపోయాడు.
బ్యాటింగ్‌లో మాత్రమే కాకుండా బౌలింగ్‌లోనూ టీమిండియా మార్పులు చేసింది. హర్షిత్ రాణా స్థానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి రాగా, వాషింగ్టన్ సుందర్‌కు చోటు దక్కింది. పాత ఓపెనింగ్ కాంబినేషన్, కొత్త బౌలింగ్ వ్యూహాలతో టీమిండియా ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో బరిలోకి దిగింది.

