ఫ్రాంచైజీకి సర్వం దారపోశా.. రాయల్స్‌ను వీడటంపై సంజూ ఫస్ట్ రియాక్షన్
Sanju Samson: ఐపీఎల్ 2026 ట్రేడ్ డీల్స్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్‌కు మారిన సంజూ శాంసన్ భావోద్వేగ మెసేజ్‌ను పంచుకున్నాడు. ఫ్రాంచైజీకి తన సర్వస్వం దారపోశానని, జీవితానికి సరిపడా జ్ఞాపకాలున్నాయని..

ఆ డీల్ పెద్ద హాట్ టాపిక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించిన ఫ్రాంచైజీ ట్రేడ్ డీల్స్ హాట్ టాపిక్ గా అయ్యాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్) మధ్య జరిగిన ట్రేడ్ డీల్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ డీల్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. చెన్నై సూపర్ కింగ్స్‌కు మారగా, సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్‌కు వెళ్లాడు.
పక్కాగా డీల్ సెట్..
ముందుగా అంచనా వేసినట్లుగానే, సీఎస్కే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్థాన్‌కు వదిలిపెట్టి, ఆ జట్టు సారథి సంజూ శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకుంది. ఈ భారీ ఒప్పందంలో భాగంగా సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ రవీంద్ర జడేజాను రూ. 14 కోట్లకు తీసుకోగా.. మరో ఆటగాడు సామ్ కర్రన్‌ను రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది.
ఓ భావోద్వేగ పోస్ట్..
రాజస్థాన్ రాయల్స్‌ను వీడిన నేపథ్యంలో, సంజూ శాంసన్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. తన పోస్ట్‌లో, 'మనం ఇక్కడ కొన్నాళ్ల పాటే ఉంటాం. ఫ్రాంచైజీ కోసం నా సర్వస్వం దారపోశాను. క్రికెట్‌ను గొప్పగా ఆస్వాదించాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, బంధాలు పోగు చేసుకున్నాను. ఫ్రాంచైజీలోని ప్రతి ఒక్కరిని నా కుటుంబ సభ్యుడిగానే భావించాను. ఇప్పుడు సమయం వచ్చింది. అందుకే నేను ఈ జట్టును వీడి వెళుతున్నా. నాకిక్కడ లభించిన దానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను' అని సంజూ పేర్కొన్నాడు.
తొలినాళ్ల ఫోటో ట్యాగ్ చేసి..
తనతో రాయల్స్‌లో చేరిన తొలి నాళ్లల్లో దిగిన ఒక ఫోటోను కూడా ఈ సందర్భంగా పంచుకున్నాడు. సంజూ శాంసన్ ఐపీఎల్ కెరీర్ రాజస్థాన్ రాయల్స్‌తోనే ఎక్కువగా ముడిపడి ఉంది. అతడు 2013లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరాడు. కేరళకు చెందిన ఈ స్టార్ ఆటగాడు, 2016లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు. రెండేళ్ల పాటు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
రాజస్థాన్ రాయల్స్‌లో అప్పుడే..
అయితే, 2018లో తిరిగి రాజస్థాన్ రాయల్స్‌లోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్, 2025 వరకు ఆ జట్టుతోనే కొనసాగాడు. కెప్టెన్‌గా రాజస్థాన్‌ను ముందుండి నడిపించి, 2022 సీజన్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక తాజా ట్రేడ్ డీల్ తో రాజస్థాన్ జట్టును విడిచిపెట్టి.. చెన్నై సూపర్ కింగ్స్‌లో కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాడు.

