2026 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు?
U19 World Cup Schedule : 2026 అండర్ 19 ప్రపంచకప్ షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. జనవరి 15న భారత్, యూఎస్ఏ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. భారత్, పాకిస్తాన్ జట్లు వేర్వేరు గ్రూప్ లలో ఉన్నాయి.

ప్రపంచకప్ 2026 షెడ్యూల్ అధికారికంగా విడుదల
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2026 అండర్ 19 పురుషుల ప్రపంచకప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. మూడు వారాలకు పైగా సాగనున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జనవరి 15న టోర్నమెంట్ ప్రారంభమై, ఫిబ్రవరి 6న హరారేలో జరిగే గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది. మొత్తం 16 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్‌లో 41 కీలక మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి.
యూఎస్ఏతో భారత్ తొలి మ్యాచ్
భారత యువజట్టుకు ఈసారి గ్రూప్-ఏలో స్థానం లభించింది. బంగ్లాదేశ్, యూఎస్ఏ, న్యూజిలాండ్‌తో కలిసి టీమిండియా ఈ గ్రూప్‌లో పోటీపడనుంది.
భారత్ షెడ్యూల్ ఇలా ఉంది:
• జనవరి 15 – యూఎస్ఏతో, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
• జనవరి 17 – బంగ్లాదేశ్‌తో, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
• జనవరి 24 – న్యూజిలాండ్‌తో, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
ఈ మూడు మ్యాచ్‌లూ ఒకే వేదికలో జరగడం టీమిండియాకు అదనపు ప్రయోజనం కల్పించవచ్చు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ కీలకం కానుందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
కొత్త జట్ల అరంగేట్రం.. టాంజానియాకు చారిత్రాత్మక ఛాన్స్
ఈ ప్రపంచకప్‌లో అత్యంత ప్రత్యేకత కలిగిన అంశం టాంజానియా జట్టు తొలిసారిగా అండర్-19 ప్రపంచకప్‌లో అడుగుపెడుతుండటం.. గ్రూప్-డి లో వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లతో టాంజానియా తలపడనుంది.
మరోవైపు జపాన్ 2020 తర్వాత మళ్లీ టోర్నీలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.
గ్రూప్‌ల వివరాలు ఇలా :
• గ్రూప్-ఏ: భారత్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, న్యూజిలాండ్
• గ్రూప్-బి: జింబాబ్వే, పాకిస్థాన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్
• గ్రూప్-సి: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక
• గ్రూప్-డి: టాంజానియా, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా
సూపర్ సిక్స్, సెమీస్ ఫార్మాట్.. భారత్–పాక్ పోరు సూపర్ దశలోనే
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లీగ్ దశలో ఉండకపోవడం మరోసారి అభిమానులను నిరాశపరుస్తున్నా, సూపర్ సిక్స్ దశలో ఆ జట్లు టాప్-3లో నిలిస్తే పోరు జరిగే అవకాశం ఉంటుంది.
2026 అండర్ 19 ప్రపంచకప్ ఫార్మాట్ ఎలా ఉంటుంది?
• ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత
• రెండు సూపర్ సిక్స్ గ్రూపుల నుంచి టాప్-2 టీమ్స్ సెమీస్‌కు చేరుతాయి
• ఫిబ్రవరి 3, 4 తేదీల్లో రెండు సెమీఫైనల్స్
• ఫిబ్రవరి 6న హరారేలో ఫైనల్ జరుగుతుంది
డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌ను జనవరి 16న ఐర్లాండ్‌తో ఆడనుంది. భారత్ ఐదు సార్లు టైటిల్స్ సాధించింది.
ఐసీసీ ఛైర్మన్ జై షా ఏమన్నారంటే?
2026 అండర్ 19 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకటించిన సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ జై షా మాట్లాడుతూ, "అండర్-19 ప్రపంచకప్ అనేకమంది భవిష్యత్ సూపర్ స్టార్లకు పునాది వేసిన వేదిక. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, విలియమ్సన్‌ల వంటి ఆటగాళ్లు ఈ స్థాయి నుంచే ఎదిగారు. జింబాబ్వే, నమీబియా వేదికగా ఈసారి కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుందని ఆశిస్తున్నాం" అని అన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌లో అత్యంత ఆసక్తికరమైన యువ టోర్నమెంట్‌గా పేరొందిన అండర్-19 ప్రపంచకప్, ఈసారి కూడా మరింత మంది భవిష్యత్తు స్టార్లను వెలుగులోకి తీసుకురానుంది.

