ఆ రోజే నా జీవితం మారింది.. : సచిన్ టెండూల్కర్
Sachin Tendulkar : పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శతజయంతి వేడుకల్లో సచిన్ టెండూల్కర్ బాబాతో తన అనుబంధం, 2011 వరల్డ్ కప్‌కు దొరికిన ఆధ్యాత్మిక స్ఫూర్తిని స్మరించుకున్నారు.

పుట్టపర్తి శత జయంతి ఉత్సవాలలో సచిన్
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాలకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు పోటెత్తగా, ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ వేడుకలకు హాజరైన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ప్రసంగంలో బాబాతో ఉన్న అనుబంధం, ఆయన ఇచ్చిన మార్గదర్శకత, తన జీవితంలో సత్యసాయి బోధనల ప్రభావం గురించి ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. చిన్నప్పటి నుంచి బాబా పట్ల తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని సచిన్ తెలిపారు.
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న లిటిల్ మాస్టర్
తాను ఐదో తరగతిలో ఉన్నప్పటి సంఘటనలను ప్రస్తావిస్తూ సచిన్ చిలిపిగా నవ్వుకున్నారు. "ఆ రోజుల్లో నా జుట్టు కూడా సాయిబాబా జుట్టు లాగే ఉందని నా ఫ్రెండ్స్ ఆటపట్టించేవారు. అందుకే హెయిర్ కట్ చేయించుకోవడానికి ఇష్టం ఉండేది కాదు.. " అని సచిన్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తనకు తెలియకుండానే బాబాతో అనుబంధం మొదలైందని చెప్పారు. 1990ల ప్రారంభంలో సత్యసాయి బాబాను మొదటిసారి వైట్ ఫీల్డ్‌లో కలిసిన అనుభవాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
‘ప్రజలను జడ్జ్ చేయొద్దు.. అర్థం చేసుకోండి’ బాబా ఇచ్చిన సందేశం
బాబాతో జరిగిన భేటీల్లో తాను అనేక విషయాలు నేర్చుకున్నానని సచిన్ తెలిపారు. "నా మనసులో ఉన్న ప్రశ్నలు అడగకుండానే బాబా సమాధానమిచ్చేవారు. ప్రజలను జడ్జ్ చేయొద్దు, వారిని అర్థం చేసుకోవాలినీ ఆయన నాకు చెప్పారు. ఆ ఒక్క బోధనే మనసులోని అనేక సందేహాలను తొలగిస్తుంది" అని సచిన్ అన్నారు. సత్యసాయి బాబా జీవితమంతా సేవకు అంకితం చేశారని, ముఖ్యంగా బలహీన వర్గాల కోసం చేయూతనిచ్చే విధానమే నిజమైన గెలుపుగా ఆయన భావించారని చెప్పారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా బాబా ఇచ్చిన ప్రాముఖ్యతను సచిన్ గుర్తు చేశారు.
2011 వరల్డ్ కప్ సమయంలో వచ్చిన బాబా ఫోన్ కాల్..జీవితాన్ని మార్చిన క్షణం
2011 ప్రపంచ కప్ సందర్భంగా తన మదిలో ఏకకాలంలో ఆనందం, ఒత్తిడి, భావోద్వేగాలు నిండిపోయి ఉండేవని సచిన్ చెప్పారు. "ఆ సమయంలో నేను బెంగళూరులో ఉన్నా. అప్పుడు సత్యసాయి బాబా నాకు ఫోన్ చేశారు. అనంతరం ఒక పుస్తకం పంపించారు. ఆ పుస్తకం నాలో అపారమైన ధైర్యాన్ని నింపింది. ప్రాక్టీస్ నుంచి మైదానం వరకు అది నా వెంటనే ఉండేది" అని సచిన్ తెలిపారు.
ఆ ఏడాదే భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకున్న విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. “అదే నాకు గోల్డెన్ మూమెంట్. ఆ సాధనలో బాబా ఆశీస్సుల పాత్ర ఎంతో ఉంది” అని సచిన్ అన్నారు.
సాయిబాబా ప్రేమ భారతానికి మార్గదర్శకం: ప్రధానమంత్రి మోడీ
శత జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రత్యేక అతిథిగా హాజరై, సచిన్, ఐశ్వర్య రాయ్, సీఎం చంద్రబాబుతో ఆత్మీయంగా పలకరించారు. సాయిబాబా ప్రేమ, సేవ, మానవతా సందేశాలు భారతదేశాన్ని ప్రభావితం చేశాయని మోడీ తెలిపారు. "పుట్టపర్తి సాయిబాబా బోధనలు కోట్ల మందిని మార్గనిర్దేశనం చేశాయి. ఆయన ప్రేమ ఎప్పటికీ మనతో ఉంటుంది" అని ప్రధాని అన్నారు.
ఈ సందర్భంగా పుట్టపర్తి సాయిబాబా స్మారకంగా రూ.100 నాణెం, నాలుగు తపాలా బిళ్లలను మోడీ ఆవిష్కరించారు.

