ఏం ఫీల్ ఉంది మావ.. గంభీర్‌కే పొగపెట్టేస్తున్నారుగా.. కోచ్ పోస్టు ఇక ఊస్టే..!
Team India: టీమిండియా టెస్టుల్లో గౌతమ్ గంభీర్ కోచింగ్ దారుణంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా చేతుల్లో వరుస ఓటములతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా దారుణ ప్రదర్శనలు
టీమిండియా టెస్టుల్లో ఇటీవల దారుణ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కోచింగ్ పద్ధతులపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన భారత జట్టు, తాజాగా సౌత్ ఆఫ్రికా చేతిలో 15 ఏళ్ల తర్వాత తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఓడింది.
టెస్టులకు సరిపోవడం లేదు..
గంభీర్ కోచింగ్‌లో దూకుడుగా ఆడాలనే వ్యూహం టెస్టులకు సరిపోవడం లేదని, దీని వల్ల ప్లేయర్లు వికెట్లను త్వరగా పారేసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ దారిలోనే గంభీర్ వెళ్తున్నారని, అయితే ఇది భారత జట్టుకు వర్కౌట్ కావడం లేదని తెలుస్తోంది.
టెస్ట్ కోచ్ పదవి నుంచి తప్పించి.?
ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్‌ను టెస్ట్ కోచ్ పదవి నుంచి తప్పించి, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేయాలనే డిమాండ్ బలపడుతోంది. ఇంగ్లాండ్‌లో ఉన్న విధంగా భారత జట్టుకు కూడా ఇద్దరు కోచ్‌లను నియమించాలని, టెస్టుల కోసం ఒకరిని, పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం మరొకరిని నియమించాలని అభిమానులు సూచిస్తున్నారు.
మరో కోచ్ ఎంపిక.?
టెస్ట్ క్రికెట్ స్పెషలిస్ట్ అయిన వీవీఎస్ లక్ష్మణ్‌ను టీమిండియా టెస్ట్ కోచ్‌గా నియమించాలని ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్, తన టెస్ట్ కెరీర్‌లో టీమిండియాకు అద్భుత విజయాలను అందించారు. ఆయనకు టెస్టులను ఎలా ఆడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
గంభీర్ ఇక టెస్టులకే..
కేవలం టీ20లు మినహా గంభీర్ టెస్టులు, వన్డేల్లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. కాబట్టి.. ఒకవేళ లక్ష్మణ్‌ను కోచ్ చేస్తే.. కచ్చితంగా వన్డేలు, టెస్టులు కోచ్ చేయాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. గతంలోనూ పలు సిరీస్‌లకు ఇండియా-బీ జట్టుకు కోచ్ గా వ్యవహరించిన లక్ష్మణ్.. ఆ సమయంలో మంచి పనితీరు కనబరిచాడని గుర్తు చేసుకుంటున్నారు.

