గిల్ OUT? టీమిండియా కెప్టెన్ ఎవరు? రోహిత్ రీఎంట్రీ !
India vs South Africa Squad Updates : భారత్, దక్షిణాఫ్రికా వన్డే, టీ20 జట్ల ఎంపికపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా గిల్ లేకపోతే రాహుల్ లేదా పంత్‌లో ఎవరు నాయకత్వం చేపడతారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే సమయంలో రోహిత్ శర్మ రీఎంట్రీ అనే చర్చ కూడా సాగుతోంది.

భారత్, దక్షిణాఫ్రికా వన్డే, టీ20 సిరీస్ జట్టు ఎంపికపై ఉత్కంఠ
భారత్ vs దక్షిణాఫ్రికా వన్డే, టీ20 సిరీస్‌ల కోసం టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) త్వరలోనే ప్రకటించనుంది. ఈసారి జట్టు జాబితాలు, కొత్త పేర్లు, గాయం కారణంగా బయటకు వెళ్లే ఆటగాళ్లు, అలాగే నిపుణుల అభిప్రాయాలు అన్నీ ఎంతో ఆసక్తికరంగా మారాయి.
మూడు వన్డే, ఐదు టీ20లు కలిగిన ఈ వైట్ బాల్ సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. రంగంలోకి దిగబోయే భారత జట్టులో మార్పులు ఏవీ ఉంటాయన్నదానిపై అభిమానుల్లో పెద్ద స్థాయిలో చర్చ నడుస్తోంది.
వన్డే సిరీస్ రాంచీలో నవంబర్ 30న ప్రారంభమవుతుంది. తర్వాత డిసెంబర్ 3న రాయ్‌పూర్, డిసెంబర్ 6న విశాఖపట్నం మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం డిసెంబర్ 9 నుంచి టి20 సిరీస్ మొదలవుతుంది. కటక్, ముల్లాన్పూర్ (న్యూ చండీగఢ్), ధర్మశాలా, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా ఉన్నాయి.
ఫోకస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా పర్యటనలో తిరిగి రంగప్రవేశం చేసిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే సిరీస్‌కు ముఖ్య ఆకర్షణగా నిలవనున్నారు. రోహిత్ ఒక హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ సాధించగా, కోహ్లీ చివరి మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరికి ఈ సిరీస్ వరల్డ్ కప్ 2027 ఎంపికలలో కీలకంగా మారనుంది.
హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియా టూర్‌ను మిస్ చేశారు. అతని ఫిట్‌నెస్ పై కూడా ప్రత్యేక దృష్టి ఉంది. బుమ్రా టెస్ట్‌ల్లో ఆడిన తర్వాత వన్డేలకు వచ్చే అవకాశంపై కూడా ఆసక్తి నెలకొంది.
టీ20లకు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ నే.. గిల్ అవుట్
టీ20లకు సూర్యకుమార్ యాదవ్ మరోసారి కెప్టెన్‌గా కొనసాగనున్నారు. ఈ ఫార్మాట్‌లో శుభ్‌మన్ గిల్ ప్రదర్శనపై ప్రశ్నలు ఉన్నాయి. అతనికి మరో అవకాశం ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సంజూ శాంసన్ స్థానంపై కూడా సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పర్యటనలో అతని ప్రదర్శన ఆశించినంతగా లేకపోవటం ప్రభావం చూపవచ్చు. టీ20 వరల్డ్ కప్ దగ్గరపడుతుండటంతో పెద్ద మార్పులు చేసే అవకాశం తక్కువే అనే చర్చ కూడా సాగుతోంది.
శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోతే కెప్టెన్సీ ఎవరికీ?
భారత్, దక్షిణాఫ్రికా టెస్టుల్లో తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ మెడ గాయంతో ఇబ్బందులు పడ్డాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆడలేకపోయాడు. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టుకు నాయకత్వం వహించాడు.
ఇప్పటికీ గిల్ గౌహతి టెస్టుకు దూరం కావడం ఖాయమనే నివేదికలు ఉన్నాయి. అదే నిజమైతే నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు గిల్ అందుబాటులో ఉండకపోవచ్చు. గిల్ వన్డే కెప్టెన్‌గా ఉన్నాడు. అతని లేకపోవడంతో జట్టు ముందు పెద్ద ప్రశ్నలే ఉన్నాయి.
శ్రేయస్ అయ్యర్ కూడా గాయం కారణంగా అందుబాటులో లేడు. కాబట్టి కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్‌లో ఎవరో ఒకరు నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. రాహుల్ సీనియారిటీ కారణంగా అతడే ప్రధాన ఎంపికగా కనిపిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో తిరిగి రోహిత్ శర్మ కెప్టెన్ గా మారవచ్చనే చర్చ కూడా సాగుతోంది. ఇది క్రికెట్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.
జట్టులోకి వచ్చేది ఎవరు? జైస్వాల్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా పరిస్థితి ఏంటి?
యశస్వీ జైస్వాల్ టీ20 జట్టులో ఉన్నప్పటికీ ఎక్కువ ఆడే అవకాశాలు దక్కలేదు. వచ్చే సంవత్సరం వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని అతన్ని పరీక్షించే అవకాశం ఉంది. కానీ సిరీస్ గెలిచిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సంజూ శాంసన్ మూడు సెంచరీలు చేసినా, గిల్ తిరిగి రావడంతో అతను కిందికి వెళ్లాల్సి వచ్చింది. అతని ప్రదర్శన ప్రభావితం కావడంతో బయటకు వచ్చాడు. ప్రస్తుతం గిల్ కూడా మంచి ఫామ్ లో లేడు. అందుకే టీ20 జట్టులో అతన్ని కొనసాగించాలా అన్న చర్చ జరుగుతోంది. హార్దిక్ పాండ్యా తిరిగి వన్డే సిరీస్‌తో రంగప్రవేశం చేయనున్నాడు. అతని రాకతో జట్టు బ్యాలెన్స్ బలపడనుంది.

