SRH Captain IPL 2026 : ప్యాట్ కమిన్స్ దూరం.. సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?
SRH Captain IPL 2026 : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వరల్డ్ కప్ హీరో ఇషాన్ కిషన్ వచ్చాడు. గాయం కారణంగా ప్యాట్ కమిన్స్ దూరం కావడంతో మేనేజ్మెంట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్ 2026 ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత సీజన్‌లో జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లిన ఆస్ట్రేలియా దిగ్గజం ప్యాట్ కమిన్స్ ఈసారి అందుబాటులో ఉండటం లేదు. వెన్నునొప్పి కారణంగా ఆయన దూరం కావడంతో, జట్టు పగ్గాలను ఎవరికి అప్పగించాలనే దానిపై గత కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లలో సన్‌రైజర్స్‌ను నడిపించనున్నారు.
ప్యాట్ కమిన్స్‌కు తీవ్ర గాయం.. ఐపీఎల్‌కు దూరం!
సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. 2025-26 యాషెస్ సిరీస్ సమయంలో ఈ గాయం తీవ్రమైంది. దీని కారణంగానే ఆయన ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యారు. ఐపీఎల్ 19వ ఎడిషన్ మార్చి 28న ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో ఎస్ఆర్‌హెచ్ తన తొలి మ్యాచ్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. అయితే కమిన్స్ కోలుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. దీంతో ఆయన రాక ఆలస్యమవుతుందని స్పష్టమైంది.
అభిషేక్ శర్మను కాదని ఇషాన్ కిషన్‌కే ఎందుకు?
ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోతే, జట్టులోని యువ సంచలనం అభిషేక్ శర్మ కెప్టెన్ అవుతారని అభిమానులు ఆశించారు. గత రెండు సీజన్లుగా అభిషేక్ ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ వెన్నెముకగా నిలిచారు. అయితే, కావ్యా మారన్ నేతృత్వంలోని మేనేజ్మెంట్ మాత్రం అనుభవానికే ప్రాధాన్యం ఇచ్చింది. పలు రిపోర్టుల ప్రకారం.. మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్‌తో చర్చలు జరిపిందని, ఆయన నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు మొగ్గు చూపారని తెలుస్తోంది. ఇషాన్ కిషన్‌ను ఎంచుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రపంచకప్ ఫామ్.. అనుభవానికి పట్టం
ఇషాన్ కిషన్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నీలో ఇషాన్ 193 స్ట్రైక్ రేట్‌తో 317 పరుగులు చేసి, భారత్ తరపున రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచారు. అంతేకాకుండా, ఇషాన్‌కు కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది. 2016 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చడమే కాకుండా, 2025 చివరలో జార్ఖండ్ జట్టుకు తొలిసారిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించి తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు.
ఇషాన్ తో వికెట్ కీపర్ అడ్వాంటేజ్
ఒక వికెట్ కీపర్ కెప్టెన్‌గా ఉంటే మైదానంలో ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్ మార్పులను గమనించడం సులభమవుతుంది. ఎంఎస్ ధోనీ తరహాలో ఇషాన్ కూడా వికెట్ల వెనుక నుండి మ్యాచ్‌ను నియంత్రించగలరని మేనేజ్మెంట్ భావిస్తోంది. అభిషేక్ శర్మ గొప్ప ఆటగాడైనప్పటికీ, ఇంత పెద్ద టోర్నీలో జట్టును నడిపించడం అతనికి ఒత్తిడిని కలిగించవచ్చు. అందుకే ఇషాన్‌ను కెప్టెన్‌గా నియమించడం ద్వారా జట్టును స్థిరంగా ఉంచవచ్చని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం యోచిస్తోంది.
అభిషేక్ శర్మకు డిప్యూటీ బాధ్యతలు
కెప్టెన్సీ రేసులో ఉన్న అభిషేక్ శర్మను మేనేజ్మెంట్ పూర్తిగా పక్కన పెట్టలేదు. ఆయనను వైస్ కెప్టెన్ గా నియమించాలని నిర్ణయించారు. దీనివల్ల భవిష్యత్తులో అభిషేక్ పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇషాన్ కిషన్ మార్గదర్శకత్వంలో అభిషేక్ తన నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకోవచ్చు. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోయే పోరులో ఇషాన్ కిషన్ సారథ్యంలో ఆరెంజ్ ఆర్మీ ఎలా రాణిస్తుందో చూడాలి.

