చూడాల్సింది ఏజ్ కాదు.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌పై నాయర్, రహానే ఫైర్
Karun Nair and Ajinkya Rahane : కరుణ్ నాయర్, అజింక్య రహానేలు తమను టెస్ట్ జట్టు నుంచి తొలగించడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. బలమైన దేశవాళీ ప్రదర్శనలు ఉన్నప్పటికీ ఎంపిక చేయకపోవడంతో సెలక్షన్ కమిటీ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు.

నేను దానికి అర్హుడిని : కరుణ్ నాయర్
టీమిండియా సెలక్షన్ కమిటీ నిర్ణయాలపై కరుణ్ నాయర్, అజింక్య రహానేలు ప్రశ్నలు లేవనెత్తారు. అద్భుతంగా రాణిస్తున్నా వీరిని ఎందుకు ఎంపిక చేయడం లేదనే చర్చ కూడా రచ్చ లేపుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన హోం టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఎంపికలో కరుణ్ నాయర్ పేరు లేకపోవడం అతనికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఇంగ్లాండ్ పర్యటనలో 205 పరుగులు చేసిన అతనిపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ “మేము కొంచెం ఎక్కువనే ఆశించాం” అని వ్యాఖ్యానించారు.
తరువాత దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుతో జరిగే రెండు మ్యాచ్‌ల రెడ్‌బాల్ సిరీస్‌కు కూడా నాయర్ ఎంపిక కాకపోవడం అతని నిరాశను మరింత పెంచింది.
గత రెండు సీజన్లలో విధర్భ తరఫున రంజీ ట్రోఫీలో 1,553 పరుగులు చేయడంతో మళ్లీ జట్టులోకి వచ్చిన కరుణ్ ప్రస్తుతం 33 ఏళ్ల వయస్సులో తిరిగి తమ అవకాశాలను వెతుకుతున్నాడు. ఈ సీజన్‌లో సౌరాష్ట్రపై 73, 8 పరుగుల తర్వాత గోవాపై 174 నాటౌట్ చేసి తన బ్యాట్ పవర్ ను చూపించాడు. “గత రెండేళ్లలో చేసిన ప్రదర్శనను బట్టి నాకు ఇంకా మంచి అవకాశం రావాలి. నేను జట్టులో ఉండటానికి అర్హుడిని” అని కరుణ్ నాయర్ పేర్కొన్నాడు.
సెలక్షన్ కమిటీ పై నాయర్ తీవ్ర వ్యాఖ్యలు
“జాతీయ జట్టులో అవకాశాలు రాకపోవడం నిరాశ కలిగిస్తోంది. గత రెండు సీజన్లలో నేను నిరంతరం శ్రమపడ్డాను. కనీసం ఒక సిరీస్‌కన్నా ఎక్కువ అవకాశాలు రావాలి. ఆపై కూడా నాపై నమ్మకం ఉంచాలి అని భావిస్తున్నాను. జట్టులో కొందరు ఆటగాళ్లు నా గురించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ఆ సంభాషణలు అక్కడితోనే ఆగిపోయాయి. నా వంతు పని పరుగులు చేయడం. అదే కొనసాగిస్తాను. వ్యక్తిగతంగా నాకు ఉన్న ఏకైక లక్ష్యం దేశం తరఫున మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడటం. ఆ అవకాశం రాకపోయినా, ప్రస్తుతం ఆడుతున్న జట్టుకు విజయం అందించడానికి నా శక్తిమేర ప్రయత్నిస్తాను” అంటూ నాయర్ పేర్కొన్నాడు.
రహానే: ఆస్ట్రేలియాలో నా అవసరం ఉంది
మరోవైపు, ముంబై బ్యాటర్ అజింక్య రహానే కూడా సెలక్షన్ కమిటీ తీరుపై ప్రశ్నలు లేవనెత్తాడు. చత్తీస్‌గఢ్‌పై రంజీలో 159 పరుగులు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “నా అనుభవం ఆస్ట్రేలియాలో భారత జట్టుకు అవసరం. వయసు సంఖ్య మాత్రమే. నిబద్ధత, అభిరుచి ముఖ్యమైనవి” అని రహానే అన్నాడు.
2024–25 బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో 1–3తో ఓటమి చెందిన భారత జట్టులో తన అనుభవం లోపించిందని అతను పేర్కొన్నాడు.
కమ్యూనికేషన్ లోపంపై రహానే అసంతృప్తి
రహానే ఇంకా మాట్లాడుతూ, “హోం, దేశీయ క్రికెట్‌లో బాగా ఆడుతున్నప్పటికీ ఎంపికపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇంత క్రికెట్ ఆడి ఇలాంటి పరిస్థితి ఎదురవడం విచారకరం” అని అన్నాడు. టెస్టుల్లో 5077 పరుగులు చేసిన రహానే 12 సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాలో 2020–21లో గబ్బా విజయంలో జట్టుకు నాయకత్వం వహించాడు.
సెలక్టర్ల నిర్ణయాలపై ఇద్దరి ప్రశ్నలు
రంజీ ట్రోఫీలో సత్తా చాటుతున్న రహానే, కరుణ్ నాయర్ ఇద్దరూ యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్న సెలక్షన్ కమిటీ నిర్ణయాలను ప్రశ్నించారు. వయస్సును కాదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకోవాలని రహానే ఘాటుగానే కామెంట్ చేశాడు. కాగా, కరుణ్ నాయర్ టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు 579 పరుగులు, ట్రిపుల్ సెంచరీ సహా ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నారు. మళ్లీ భారత జట్టులో నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

