- Home
- Sports
- IND vs NZ : వరుస సెంచరీలతో కోహ్లీ రికార్డు బ్రేక్.. అయినా రుతురాజ్ గైక్వాడ్‌కు ఎందుకు చోటుదక్కలేదు?
IND vs NZ : వరుస సెంచరీలతో కోహ్లీ రికార్డు బ్రేక్.. అయినా రుతురాజ్ గైక్వాడ్‌కు ఎందుకు చోటుదక్కలేదు?
Ruturaj Gaikwad : న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కలేదు. గత మ్యాచ్‌లో సెంచరీ సాధించి, లిస్ట్ ఏ క్రికెట్‌లో కోహ్లీ రికార్డును అధిగమించినా అతడిని ఎందుకు పక్కన పెట్టారు?

సెంచరీ కొట్టినా టీమిండియాలో చోటు లేదు.. అశ్విన్, పఠాన్ రియాక్షన్ ఇదే
న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టు ఎంపికలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టడం. దేశవాళీ క్రికెట్‌లోనూ, అంతర్జాతీయంగా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ గైక్వాడ్‌కు మొండిచేయి ఎదురుకావడం అభిమానులను, మాజీ క్రికెటర్లను షాక్‌కు గురిచేసింది.
గైక్వాడ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ, దేశవాళీ టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీలోనూ పరుగుల వరద పారించాడు. అయినప్పటికీ, కివీస్ సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జాబితాలో అతనికి చోటు దక్కలేదు.
రుతురాజ్ గైక్వాడ్ కు నో ఛాన్స్.. ఆశ్చర్యపరిచిన సెలెక్టర్ల నిర్ణయం
రుతురాజ్ గైక్వాడ్ టీమిండియా తరఫున ఆడిన చివరి వన్డేలో అద్భుత సెంచరీతో మెరిశాడు. దక్షిణాఫ్రికాపై రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో 105 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి ఆటగాడిని తర్వాతి సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం అన్యాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కేవలం రెండు ఇన్నింగ్స్‌లలోనే 113 పరుగులు సాధించి, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ తన సత్తా చాటాడు.
అంతేకాకుండా, విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరాఖండ్‌పై 124 పరుగులు, ముంబైపై 66 పరుగులు చేసి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. ఇంతటి ప్రతిభ కనబరిచినప్పటికీ సెలెక్టర్లు అతడిని విస్మరించడం చర్చనీయాంశమైంది.
జట్టులోకి గిల్, అయ్యర్ రాకతో..
గైక్వాడ్‌ను పక్కన పెట్టడానికి ప్రధాన కారణం జట్టులో సీనియర్ ఆటగాళ్ళ పునరాగమనమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో పోటీ పెరిగింది.
ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్ సాధించి జట్టులో చేరితే, తుది జట్టులో గైక్వాడ్‌కు స్థానం కల్పించడం కష్టంగా మారుతుంది. ఈ తీవ్రమైన పోటీ కారణంగానే, ఫామ్‌లో ఉన్నప్పటికీ గైక్వాడ్‌కు చోటు దక్కలేదని తెలుస్తోంది. భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి వన్డే జనవరి 11న ప్రారంభం కానుంది.
అశ్విన్, పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
గైక్వాడ్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇది నమ్మశక్యం కాని విషయమని పఠాన్ వ్యాఖ్యానించారు.
"సెంచరీ చేసిన తర్వాత కూడా రుతురాజ్ గైక్వాడ్‌కు జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యంగా ఉంది. భారత క్రికెట్‌లో పోటీ ఏ స్థాయికి వెళ్లిందో ఇది తెలియజేస్తోంది. లిస్ట్ ఏ క్రికెట్‌లో 83 సగటు ఉన్న దేవదత్ పడిక్కల్ కూడా వన్డే జట్టుకు దరిదాపుల్లో లేకపోవడం గమనించాల్సిన విషయం" అని పఠాన్ ఎక్స్ లో పేర్కొన్నారు.
మరోవైపు అశ్విన్ స్పందిస్తూ, "నువ్వు ఎలా ఫీలవుతున్నావన్నది ముఖ్యం కాదు. లే, రెడీ అవ్వు, ప్యాడ్ కట్టుకో, గ్రౌండ్ లోకి దిగు, ఎప్పుడూ ఛాన్స్ వదులుకోవద్దు. ఇలాంటివి మిస్ అవ్వడం చాలా బాధగా ఉంటుంది, కానీ భారత జట్టులో స్థానం కోసం పోటీ అలాగే ఉంది" అని గైక్వాడ్‌కు ధైర్యం చెప్పారు.
కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన గైక్వాడ్
జట్టు ఎంపికలో నిరాశ ఎదురైనప్పటికీ, గైక్వాడ్ లిస్ట్ ఏ క్రికెట్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో 66 పరుగులు చేసిన గైక్వాడ్, విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక బ్యాటింగ్ సగటు రికార్డును అధిగమించాడు.
కనీసం 50 ఇన్నింగ్స్‌లు ఆడిన భారత ఆటగాళ్లలో గైక్వాడ్ సగటు ఇప్పుడు 57.69కి చేరుకోగా, కోహ్లీ సగటు 57.67గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మైఖేల్ బెవన్ (57.86), సామ్ హైన్ (57.76) తర్వాత గైక్వాడ్ మూడో స్థానంలో నిలిచాడు. కోహ్లీ జనవరి 6న ఢిల్లీ తరఫున మ్యాచ్ ఆడితే ఈ రికార్డును తిరిగి సొంతం చేసుకునే అవకాశం ఉంది.
న్యూజిలాండ్‌తో తలపడే భారత వన్డే జట్టు ఇదే
ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో రిషబ్ పంత్ వికెట్ కీపర్‌గా చోటు దక్కించుకోగా, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని సెలెక్టర్లు మరోసారి పక్కన పెట్టారు. సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్.

