- Home
- Sports
- Bumrah Top 5 Innings : ఇంటర్నేషనల్ క్రికెట్లో దశాబ్దం పూర్తి.. ఈ పదేళ్లలో బుమ్రా టాప్ 5 ఇన్నింగ్స్ ఇవే
Bumrah Top 5 Innings : ఇంటర్నేషనల్ క్రికెట్లో దశాబ్దం పూర్తి.. ఈ పదేళ్లలో బుమ్రా టాప్ 5 ఇన్నింగ్స్ ఇవే
సరిగ్గా పదేళ్లక్రితం ఓ కుర్రాడు టీమిండియాలో అడుగుపెట్టాడు. బక్కపల్చని అతడిని చూసి అందరు బౌలర్లలాగే ఏదో వచ్చామా, ఆడామా, వెళ్లామా అన్నట్లు ఉంటాడనుకున్నారు. కానీ అతడు క్రికెట్లో అద్భుతాలు చేశాడు.. ప్రపంచస్థాయి బౌలర్ గా మారాడు. అతడే జస్ప్రిత్ బుమ్రా.

ఇంటర్నేషనల్ క్రికెట్లో బుమ్రాకు పదేళ్లు పూర్తి..
Jasprit Bumrah : జస్ప్రీత్ బుమ్రా... టీమిండియా క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం బెస్ట్ బౌలర్ ఎవరంటే బుమ్రా పేరు వినిపిస్తుంది. ఇప్పటికే తన ఫేస్ బౌలింగ్ తో టీమిండియాకు అనేక విజయాలు అందించాడు... అందిస్తూనే ఉన్నాడు. వన్డే, టెస్ట్, టీ20 అన్ని ఫార్మాట్స్ లో సెంచరీ వికెట్లు సాధించిన భారత బౌలర్ గా బుమ్రా రికార్డు సాధించాడు... ఇలా అతడిఖాతాలో మొత్తం 486 వికెట్లు చేరాయి. త్వరలోనే 500 వికెట్ల మార్కును చేరుకుని మరో రికార్డు సాధించనున్నాడు.
అయితే సరిగ్గా పదేళ్ల క్రితం బుమ్రా ఇంటర్నేషనల్ కెరీర్ ప్రారంభమయ్యింది. 2016 జనవరిలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సీరిస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు బుమ్రా... ఆ మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక అప్పటినుండి బుమ్రా వెనుదిరిగి చూసిందిలేదు... సాధారణ బౌలర్ గా కెరీర్ ప్రారంభించి అత్యుత్తమ ప్రదర్శనలతో వరల్డ్ లెవెల్ స్టార్ బౌలర్ గా ఎదిగాడు. ఇలా ఈ పదేళ్లలో బుమ్రా టాప్ 5 స్పెల్స్‌ను ఏవో చూద్దాం.
1. 2017 బెంగళూరు టీ20లో ఇంగ్లండ్‌పై 3/14
కెరీర్ తొలినాళ్లలో బుమ్రాకు మంచి గుర్తింపు ఇచ్చింది ఈ బెంగళూరు టీ20 మ్యాచ్. 2017లో ఇంగ్లండ్ తో జరిగిన టీ20 లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు... కీలక సమయంలో జోస్ బట్లర్‌ను ఔట్ చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్ లో కేవలం 2.3 ఓవర్లు మాత్రమే వేసిన అతడు 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా అత్యుత్తమ ప్రదర్శనతో టీమిండియా 75 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా బుమ్రా బౌలింగ్ లో పదును బైటపడింది... అతడికి జట్టులో స్థానం సుస్థిరం అయ్యింది.
2. 2018 MCG టెస్టులో ఆస్ట్రేలియాపై 6/33
2018 లో ఆస్ట్రేలియా తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత బౌలర్ బుమ్రా అద్భుతం చేశాడు. ఆస్ట్రేలియాను 151 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతడు కేవలం 15.5 ఓవర్లలో కేవలం 33 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం సాధించింది.
3. 2022 ఓవల్ వన్డేలో ఇంగ్లండ్‌పై 6/19
2022లో ఓవల్‌లో జరిగిన మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లాండ్ కు పీడకలే అని చెప్పాలి. అప్పటికే భారత స్టార్ బౌలర్ గా ఎదిగిన బుమ్రా ఈ వన్డేలో మరింత చెలరేగాడు. తన అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను పేకమేడలా కుప్పకూల్చాడు. 7.2 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీశాడు... దీంతో విదేశీ గడ్డపై భారత్ మరో సూపర్ విక్టరీని అందుకుంది. ఇదే బుమ్రా వన్డే కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలు.
4. 2024 కేప్ టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికాపై 6/61
2024లో కేప్ టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో బుమ్రా సూపర్ ప్రదర్శన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 13.4 ఓవర్లు మాత్రమే వేసి 6 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఓటమి అంచుల్లో ఉన్న భారత్ ను గట్టెక్కించి సిరీస్ డ్రా అవడంలో సాయపడ్డాడు. అంటే ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పి టీమిండియాను ఓటమినుండి తప్పించాడు.. పరువు కాపాడాడు.
5. 2024 విశాఖపట్నం టెస్టులో ఇంగ్లండ్‌పై 6/45
తెలుగు గడ్డపై కూడా బుమ్రాకు మంచి రికార్డే ఉంది. 2024 విశాఖపట్నం టెస్టులో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇంగ్లండ్ తో జరిగిన ఈ టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లలో 45 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. దీంతో భారత్ 106 పరుగుల తేడాతో విజయం సాధించగలిగింది. దీంతో సీరిస్ సమం అయ్యింది... లేదంటే స్వదేశంలో టెస్ట్ సీరిస్ కోల్పోవాల్సి వచ్చేది.

