- Home
- Sports
- IPL 2026 : ఒకటి రెండు కాదు వందల మ్యాచ్‌లు ఆడారు.. అయినా ఒక్క ఐపిఎల్ ట్రోపీ గెలవని దిగ్గజ క్రికెటర్లు వీళ్లే
IPL 2026 : ఒకటి రెండు కాదు వందల మ్యాచ్‌లు ఆడారు.. అయినా ఒక్క ఐపిఎల్ ట్రోపీ గెలవని దిగ్గజ క్రికెటర్లు వీళ్లే
Indian Premier League 2026 : వరల్డ్ క్రికెట్లో వాళ్లంతా దిగ్గజ క్రికెటర్లు… ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా వందల మ్యాచ్ లు ఆడారు. అయినా ఒక్క ఐపిఎల్ ట్రోపీని కూడా ముద్దాడలేకపోయారు. అలాంటి టాప్ క్రికెటర్లు ఎవరో తెలుసా?

ఐపిఎల్ లో అదృష్టం కలిసిరాని ఆటగాళ్లు..
IPL 2026 : ''గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి".. ఈ మాటలు కొందరు క్రికెటర్లకు సరిగ్గా సరిపోతాయి. వీరంతా అద్భుతమైన ఆటతీరు కలిగినవారే, ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పగల సామర్థ్యమున్నవారే.. కానీ అదృష్టం కలిసిరాక ఇప్పటివరకు కనీసం ఒక్క ఐపిఎల్ ట్రోపీని కూడా గెలుచుకోలేదు. ఇలా 18 సీజన్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) హిస్టరీలో వందలాది మ్యాచులు ఆడి ఇప్పటివరకు ఐపిఎల్ ట్రోపీని ముద్దాడని ఆరుగురు స్టార్ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
1. ఎబి డివిలియర్స్ : 184 మ్యాచ్‌లు
దక్షిణాఫ్రికాకు చెందిన దిగ్గజ క్రికెటర్ ఎబి డివిలియర్స్ ఐపిఎల్ ప్రస్థానం దశాబ్దకాలం సాగింది... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీంలో కీలక బ్యాటర్ గా కొనసాగాడు. కానీ జట్టును ఒక్కసారైనా ఐపిఎల్ విజేతగా నిలపాలన్న అతడి కల కలగానే మిగిలిపోయింది. ఆర్సీబీ కష్టాల్లో ఉన్నప్పుడు తన 360 డిగ్రీస్ ఆటతీరుతో ఆపద్బాంధవుడిలా ఆదుకున్న సందర్భాలెన్నో.... కానీ డివిలియర్స్ పాలిట ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షే.
డిల్లీ డేర్‌డెవిల్స్, ఆర్సీబీ తరఫున మొత్తం 184 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ.. కప్ గెలవకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే డివిలియర్స్ ఎన్నో ఏళ్ల కల గత ఐపిఎల్ లో నెరవేరింది... ఆర్సిబి ఐపిఎల్ విజేతగా నిలిచింది. జట్టులో లేకపోయినా ఆర్సిబి విజయాన్ని కళ్లారా చూసేందుకు ఐపిఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ కు ఏబిడి హాజరయ్యాడు.
2. సంజూ శాంసన్ : 177 మ్యాచ్‌లు
తాజా టీ20 వరల్డ్ కప్ లో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ కూడా ఇప్పటివరకు ఒక్క ఐపిఎల్ ట్రోపీని కూడా టచ్ చేయలేదు. కేరళకు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు 177 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు... కానీ ఒక్క ట్రోపీని కూడా గెలవలేకపోయాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు సంజూ ప్రాతినిధ్యం వహించాడు.
రాజస్థాన్ రాయల్స్ (RR) సంజూ శాంసన్ కెప్టెన్సీలో 2022 ఐపిఎల్ ఫైనల్ కు చేరింది... కానీ చివరి మ్యాచులో ఓడిపోయి ట్రోపీని మిస్ చేసుకుంది. అయితే ఇప్పుడు 19వ సీజన్‌లో రాజస్థాన్ తరపున కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగేందుకు సంజూ సిద్ధమయ్యాడు. మరి సీఎస్‌కేతోనైనా అతని కప్ కరవు తీరుతుందో లేదో చూడాలి.
3. అమిత్ మిశ్రా : 162 మ్యాచ్‌లు
భారత దిగ్గజ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్‌లో మొత్తం 162 మ్యాచ్‌లు ఆడి 174 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అత్యంత విజయవంతమైన స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు. అయినా అతడు ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయాడు.
2008 నుండి 2024 వరకు సుదీర్ఘకాలం మిశ్రా ఐపిఎల్ ఆడాడు... ఢిల్లీ క్యాపిటల్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడిగా కొనసాగాడు. కానీ ఒక్కసారి కూడా కప్ గెలవకుండానే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు.
4. అక్షర్ పటేల్ : 162 మ్యాచ్‌లు
ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అక్షర్ పటేల్, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటివరకు 162 మ్యాచ్‌లు ఆడిన అక్షర్.. ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందించిన సందర్భాలెన్నో. ఆల్ రౌండ్ షో తో అదగొట్టే అక్షర్ ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీని కూడా గెలవలేకపోయాడు. మరి డిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఈ సీజన్లో అయినా అక్షర్ ట్రోపీ సాధిస్తాడేమో చూడాలి.
5. కేఎల్ రాహుల్ : 145 మ్యాచ్‌లు
కర్ణాటకకు చెందిన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అయినా ఐపీఎల్ ట్రోఫీ అతనికి అందని ద్రాక్షగానే మిగిలింది. రాహుల్ 145 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినా ఇప్పటివరకు కప్ గెలవలేదు.
6. క్రిస్ గేల్ : 142 మ్యాచ్‌లు
యూనివర్సల్ బాస్‌గా పేరుగాంచిన క్రిస్ గేల్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ టీం కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) ద్వారా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఆర్సీబీ జట్టులో విధ్వంసకర ఆటగాడిగా ఎదిగాడు. చివర్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 142 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, గేల్‌కు ఐపీఎల్ ట్రోఫీ గెలిచే అవకాశం ఒక్కసారి కూడా రాలేదు.

