IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
IPL 2026 : ఐపీఎల్ 2026 వేలంలో క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ వంటి స్టార్లను ఫ్రాంచైజీలు అతి తక్కువ ధరకు సొంతం చేసుకున్నాయి. రూ. 1 కోటి నుండి రూ. 2 కోట్ల ధరకు అమ్ముడైన టాప్-6 స్టీల్ డీల్స్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

అందరూ చూస్తుండగానే జాక్‌పాట్ కొట్టిన టీమ్స్.. రూ. 2 కోట్ల లోపే స్టార్స్!
ఐపీఎల్ 2026 వేలంలో కేవలం భారీ ధరలకు అమ్ముడైన ఆటగాళ్ల గురించి మాత్రమే కాదు, తక్కువ ఖర్చుతో అత్యధిక విలువను పొందేలా జట్లు చేసిన తెలివైన కొనుగోళ్ల గురించి కూడా చర్చనీయాంశమైంది. ఐపీఎల్ వేలం చరిత్రలో కొన్నిసార్లు ఊహించని విధంగా స్టార్ ఆటగాళ్లు కూడా ప్రాథమిక ధరకే లభిస్తుంటారు. ఈసారి వేలంలో కూడా అదే జరిగింది.
పలు ఫ్రాంచైజీలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన స్టార్ ఆటగాళ్లను వారి కనీస ధరకే లేదా దానికి దగ్గరి ధరకే సొంతం చేసుకొని తమ పక్కాప్లాన్ ను అమలు చేశాయి. కోట్లు వెచ్చించి ఆటగాళ్లను కొనడమే కాదు, తక్కువ ధరకు సరైన ఆటగాళ్లను ఎంచుకోవడం కూడా విజయానికి కీలకమని ఈ జట్లు నిరూపించాయి. ఐపీఎల్ 2026 వేలంలో ముంబై ఇండియన్స్, లక్నో, ఢిల్లీ, ఆర్సీబీ, చెన్నై జట్లు దక్కించుకున్న టాప్ 6 స్టీల్ డీల్స్ వివరాలు గమనిస్తే..
ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్
ఐపీఎల్ 2026 వేలంలో జరిగిన అతిపెద్ద వేలంలో క్వింటన్ డికాక్ డీల్ ఒకటి. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు. అది కూడా కేవలం రూ. 1 కోటి ధరకే కావడం విశేషం.
డికాక్ గతంలో ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ మ్యాచ్ విన్నర్ అయిన డికాక్, జట్టుకు ఎంతో అనుభవాన్ని తీసుకువస్తాడు. ముంబై ఇండియన్స్ పర్స్ పై పెద్దగా ప్రభావం చూపకుండానే, టాప్ ఆర్డర్‌లో విధ్వంసకర బ్యాటర్ ను తీసుకోవడంలో ముంబై యాజమాన్యం సఫలమైంది. ఇంత తక్కువ ధరకు డికాక్ వంటి ఆటగాడు దొరకడం ముంబైకి నిజంగా కలిసొచ్చే అంశం.
లక్నో సూపర్ జెయింట్స్ స్మార్ట్ బై
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ టీ20 ఆల్ రౌండర్ స్పిన్నర్లలో ఒకరైన వనిందు హసరంగను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీలంకకు చెందిన ఈ స్టార్ స్పిన్నర్ కేవలం రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌కే లక్నో జట్టు సొంతం అయ్యాడు.
హసరంగ బౌలింగ్‌లో వికెట్లు తీయడమే కాకుండా, పరుగులను నియంత్రించడంలోనూ దిట్ట. అంతేకాకుండా, లోయర్ ఆర్డర్‌లో వచ్చి వేగంగా పరుగులు సాధించే సామర్థ్యం అతనికి ఉంది. ఇంతటి విలువైన ఆటగాడు బేస్ ప్రైస్ కే లభించడం లక్నో సూపర్ జెయింట్స్ చేసుకున్న గొప్ప ఒప్పందంగా చెప్పవచ్చు.
ఢిల్లీ క్యాపిటల్స్ జాక్‌పాట్
కిల్లర్ మిల్లర్ గా పిలవబడే డేవిడ్ మిల్లర్ కేవలం రూ. 2 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దక్కించుకుంది. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటూ మ్యాచ్‌లను ఫినిష్ చేయడం మిల్లర్ ప్రత్యేకత. ఇతని అనుభవం ఢిల్లీ మిడిల్ ఆర్డర్‌కు ఎంతో బలాన్ని అందిస్తుంది.
క్లిష్ట సమయాల్లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడే మిల్లర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు దొరికిన ఒక ముఖ్యమైన ఆస్తి అని చెప్పడంలో సందేహం లేదు. అంతర్జాతీయ టీ20లలో ఎంతో పేరున్న మిల్లర్ ఇంత తక్కువ ధరకు రావడం ఢిల్లీకి నిజంగా ఒక స్టీల్ డీల్.
ఆర్సీబీ పేస్ అస్త్రం.. జాకబ్ డఫీ జాక్ పాట్ డీల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకునే క్రమంలో జాకబ్ డఫీని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతను ఆర్సీబీ పేస్ అటాక్‌కు మరింత బలం అందిస్తాడు.
కొత్త బంతితో స్వింగ్ రాబట్టగలగడం, అలాగే డెత్ ఓవర్లలో క్రమశిక్షణతో బౌలింగ్ చేయడం డఫీ ప్రత్యేకత. పెద్దగా హడావిడి లేకుండానే, ఆర్సీబీ బౌలింగ్ దళంలో డఫీ ఒక కీలక అస్త్రంగా మారే అవకాశం ఉంది. రూ. 2 కోట్ల ధరలో ఇతని ఎంపిక ఆర్సీబీకి మంచి డీల్.
ఢిల్లీ ఖాతాలో మరో ఆణిముత్యం
ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన మరో తెలివైన కొనుగోలు బెన్ డకెట్. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ దూకుడు బ్యాటర్ కూడా బేస్ ప్రైస్ వద్దే దొరికాడు. స్పిన్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కోగలగడం డకెట్ ప్రత్యేకత.
మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయగలగడం, అన్ని ఫార్మాట్లలోనూ రాణించగల సత్తా ఉండటం వల్ల డకెట్ ఢిల్లీ జట్టుకు ఒక మంచి డీల్. అతని దూకుడు స్వభావం జట్టు స్కోరు బోర్డును వేగంగా ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది.
చెన్నై క్లాసిక్ స్ట్రాటజీ
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఎప్పుడూ తమదైన శైలిలో ఆటగాళ్లను ఎంచుకుంటుంది. వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హొసీన్‌ను రూ. 2 కోట్లకు తీసుకోవడం సీఎస్కే క్లాసిక్ స్ట్రాటజీకి నిదర్శనం.
శాంతంగా ఉంటూ బౌలింగ్ చేసే ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, చెన్నై పిచ్‌లకు, ధోని సేన వ్యూహాలకు సరిగ్గా సరిపోతాడు. అనుభవానికి పెద్దపీట వేసే సీఎస్కే సెటప్‌లో అకీల్ హొసీన్ ఒక నమ్మదగ్గ బౌలర్‌గా రాణించే అవకాశం ఉంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఇతను కీలక పాత్ర పోషించే అవకాశముంది.

