భారత మహిళలా మజాకా.. వరల్డ్ కప్ కొట్టేవరకు వదిలేలా లేరుగా..!
India Women vs New Zealand Women : భారత మహిళా క్రికెట్ టీం సరైన సమయంలో సత్తా చాటింది. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ మెగాటోర్నీలో విజేతగా నిలిచే ఆశలను సజీవంగా ఉంచుకుంది.

మన అమ్మాయిలు అదరగొట్టారుగా..
ICC Womens World Cup 2025 : కీలక సమయంలో అద్భుత విజయం సాధించింది ఇండియన్ మహిళా క్రికెట్ టీం. స్వదేశంలో జరుగుతున్న ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 మెగాటోర్నీలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ను చిత్తుచేసి సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ స్కోరు సాధించడమే కాదు తర్వాత అద్భుత బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడిచేశారు టీమిండియా అమ్మాయిలు. మ్యాచ్ కు వర్షం పలుమార్లు ఆటంకాలు సృష్టించినా భారత విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది.
భారత్ విసిరిన 340 పరుగుల లక్ష్యం వర్షం కారణంగా 325 కు తగ్గినా న్యూజిలాండ్ చేధించలేకపోయింది. నిర్ణీత 44 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 271 మాత్రమే చేసింది కివీస్... దీంతో టీమిండియా 53 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ మెగాటోర్నీలో విజేతగా నిలిచే అవకాశాలు సజీవంగా ఉన్నాయి... సెమీస్ కు క్వాలిఫై అయ్యింది టీమిండియా మహిళా టీం.
సెమీస్ కు టీమిండియా
ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదు విజయాలతో పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచిన ఆస్ట్రేలియా మొదట సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక సౌతాఫ్రికా మహిళా టీం కూడా ఆరు మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించి సేమిస్ కు చేరింది. ఇంగ్లాండ్ ఆరింట నాలుగు మ్యాచులు గెలిచి సేమీస్ కు చేరింది. మిగతా ఒక్క బెర్త్ కోసం ఇండియాతో పాటు న్యూజిలాండ్, శ్రీలంక పోటీపడ్డాయి... కానీ తాజాగా కివీస్ ను ఓడించి ఆరు మ్యాచుల్లో మూడు విజయాలు నమోదుచేసి సెమీస్ కు చేరింది భారత్.
అదరగొట్టిన టీమిండియా ఓపెనర్లు
కీలక మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కు ఆరంభంలోనే చుక్కలు చూపించింది టీమిండియా ఓపెనింగ్ జోడి స్మృతి మందాన, ప్రతీక రావల్. ఈ ఇద్దరు మొదటి వికెట్ కే డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు... దీంతో భారీ స్కోరు సాధ్యమయ్యింది. కేవలం 95 బంతుల్లోనే మందానా 109 పరుగులు చేయగా ప్రతీక 134 బంతుల్లో 122 పరుగులు చేశారు. చివర్లో జేమీమా రోడ్రిగ్స్ 55 బంతుల్లో 76 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ పరాజయం
భారీ లక్ష్యచేధనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 1 పరుగు వద్ద మొదటి వికెట్ పడింది. అయితే క్రమం తప్పకుండా వికెట్లు పడినా మధ్యలో బ్రోక్ హల్లిడే (81 పరుగులు), ఇసాబెల్లా గేజ్ (65 పరుగుల) లు కాస్సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ వీరు భారత విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా స్మృతి మందానా
వర్షం కారణంగా న్యూజిలాండ్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 గా నిర్ణయించారు. కానీ ఈ టార్గెట్ ను చేధించడంలోనూ ఆ జట్టు విఫలమయ్యింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 2, క్రాంతి గౌడ్ 2, స్నేహా రానా 1, శ్రీ చరణి 1, దీప్తి శర్మ 2, ప్రతీక రావల్ 1 వికెట్ పడగొట్టారు. ధనాధన్ ఇన్నింగ్స్ తో భారత్ విజయంలో కీలకంగా వ్యవహరించిన స్మృతి మందానా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు.