IND vs NZ సిరీస్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు? కోహ్లీ, రోహిత్ రీఎంట్రీతో రచ్చ మామూలుగా ఉండదు !
India vs New Zealand ODI Series 2026: భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 11 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ ఇస్తుండగా, శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

భారత్ vs న్యూజిలాండ్ వన్డే సిరీస్: పూర్తి వివరాలు ఇవే
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ క్రికెట్ పండగ వాతావరణం మొదలుకానుంది. కొత్త సంవత్సరం 2026 ఆరంభంలోనే టీమిండియా సొంతగడ్డపై మరో ఆసక్తికరమైన పోరుకు సిద్ధమైంది. న్యూజిలాండ్ జట్టుతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇది భారత్ కు అత్యంత కీలకమైన సిరీస్.
ముఖ్యంగా, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండటంతో ఈ సిరీస్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగుతుండగా, అనుభవజ్ఞులైన ఆటగాళ్ల రాక జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చనుంది.
ఇండియా vs న్యూజిలాండ్ వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్ జనవరి 11న ప్రారంభమై జనవరి 18తో ముగుస్తుంది. ఈ మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు (IST) ప్రారంభమవుతాయి. టాస్ మధ్యాహ్నం 1:00 గంటలకు వేస్తారు.
మ్యాచ్‌ల పూర్తి వివరాలు ఇవే
- మొదటి వన్డే: జనవరి 11 (శనివారం) - బీసీఏ స్టేడియం, వడోదర.
- రెండవ వన్డే: జనవరి 14 (మంగళవారం) - సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (నిరంజన్ షా స్టేడియం), రాజ్‌కోట్.
- మూడవ వన్డే: జనవరి 18 (ఆదివారం) - హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్.
వడోదరలోని బీసీఏ స్టేడియంలో జనవరి 11న జరగబోయే మ్యాచ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ నగరంలో జరుగుతున్న మొట్టమొదటి పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. దీంతో సిరీస్ ఆరంభం మరింత చరిత్రాత్మకంగా మారింది.
న్యూజిలాండ్ వన్డే సిరీస్: భారత జట్టు వివరాలు ఇవే
ఈ సిరీస్‌లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించనున్నారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీలతో అదరగొట్టి, ఫామ్‌లో ఉండి జట్టులోకి తిరిగి వస్తున్నారు. అయితే, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అందుబాటుపై సందిగ్ధత కొనసాగుతోంది.
సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన అయ్యర్ ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ, కొన్ని రిపోర్టుల ప్రకారం అతను తుది జట్టులో చేరడం పై సందేహాలు ఉన్నాయి.
భారత జట్టు : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్.
న్యూజిలాండ్ జట్టు: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, మిచ్ హే (వికెట్ కీపర్), కైల్ జేమీసన్, జోష్ క్లార్క్సన్, జాక్ ఫౌల్క్స్, ఆది అశోక్, క్రిస్టియన్ క్లార్క్, నిక్ కెల్లీ, మైఖేల్ రే, జేడెన్ లెనాక్స్.
IND vs NZ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
క్రికెట్ అభిమానులు ఈ ఉత్కంఠభరితమైన సిరీస్ ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star Sports Network) అందిస్తుంది. టీవీలో వివిధ భాషల్లో కామెంట్రీ అందుబాటులో ఉంటుంది.
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల విషయానికి వస్తే, జియో హాట్‌స్టార్ (JioHotstar) యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భౌగోళిక లభ్యతను బట్టి జియో సినిమా (JioCinema)లో కూడా మ్యాచ్‌లు ప్రసారమయ్యే అవకాశం ఉంది.
IND vs NZ టీ20 సిరీస్, ప్రపంచకప్ సన్నాహాలు
ఈ వన్డే సిరీస్ ముగిసిన వెంటనే, జనవరి 21 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 7 నుంచి జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు ఇదే చివరి రిహార్సల్ కాబట్టి, ఈ సిరీస్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
వన్డేల తర్వాత జరిగే టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. నాగ్ పూర్, రాయ్‌పూర్, గువహటి, వైజాగ్, తిరువనంతపురంలలో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్ల ఫామ్‌ను పరీక్షించుకోవడానికి మేనేజ్‌మెంట్‌కు ఇదొక చక్కటి అవకాశం.

