Vaibhav Suryavanshi : తగ్గేదే లే.. సఫారీ గడ్డపై వైభవ్ పుష్పరాజ్.. రికార్డులన్నీ బద్దల్ !
Vaibhav Suryavanshi : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో యూత్ వన్డేలో భారత అండర్-19 కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ 63 బంతుల్లోనే సెంచరీతో చెలరేగాడు. ఆరోన్ జార్జ్‌తో కలిసి 227 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, విరాట్ కోహ్లీ రికార్డుకు చేరువయ్యాడు.

దక్షిణాఫ్రికాపై వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం... 63 బంతుల్లోనే రికార్డు సెంచరీ
భారత యువ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఫామ్‌ను 2026లోనూ కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్-19 వన్డే సిరీస్‌లో ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెనోనిలోని విలోమూర్ పార్క్ స్టేడియంలో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో బుధవారం (జనవరి 7) జరుగుతున్న మూడో వన్డేలో వైభవ్ అద్భుత సెంచరీ నమోదు చేశాడు.
కేవలం 63 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్, సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వైభవ్ సూర్యవంశీకి, నాయకుడిగా ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఈ ఇన్నింగ్స్ ఎంతో కీలకంగా మారింది.
గ్రౌండ్‌లో పూనకాలు లోడింగ్.. కెప్టెన్‌గా వచ్చి కషాయం తాగించాడు!
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీ, మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ కలిసి సఫారీ బౌలింగ్‌ను చెడుగుడు ఆడుకున్నారు. వైభవ్ కేవలం 74 బంతుల్లో 127 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 భారీ సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.
వైభవ్ 171.62 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. వైభవ్, ఆరోన్ జార్జ్‌తో కలిసి తొలి వికెట్‌కు 227 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కేవలం 25.4 ఓవర్లలోనే వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వైభవ్ ఔటైనప్పటికీ, ఆరోన్ జార్జ్ కూడా 106 బంతుల్లో 118 పరుగులు (16 ఫోర్లు) చేసి సెంచరీ సాధించాడు. వీరిద్దరి ధాటికి భారత్ 300 పరుగులు దాటి భారీ స్కోరు దిశగా పయనించింది. వైభవ్ సెంచరీ పూర్తి చేసుకోగానే అల్లు అర్జున్ సినిమా పుష్ప సిగ్నేచర్ స్టైల్‌లో సెలబ్రేషన్ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది.
Everyone tuned in for that 🇮🇳💯 pic.twitter.com/Eqi4KUWkaW
— Rajasthan Royals (@rajasthanroyals) January 7, 2026
విరాట్ రికార్డుకే ఎసరు.. ఈ 14 ఏళ్ల కుర్రాడు మామూలోడు కాదు సామీ!
అండర్-19 వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీకి అతి చేరువలో నిలిచాడు. వైభవ్ ఇప్పటివరకు 18 మ్యాచ్‌లలో 57.23 సగటుతో 973 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ అండర్-19 వన్డేల్లో 28 మ్యాచ్‌లలో 46.57 సగటుతో 978 పరుగులు చేశాడు.
అంటే కోహ్లీ రికార్డును అధిగమించడానికి వైభవ్‌కు ఇంకా కేవలం 5 పరుగులు మాత్రమే అవసరం. ప్రస్తుతం వైభవ్ సగటు (54.05) కోహ్లీ కంటే మెరుగ్గా ఉండటం విశేషం. ఈ జాబితాలో విజయ్ జోల్ (1404 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, యశస్వి జైస్వాల్ (1386), తన్మయ్ శ్రీవాస్తవ (1316) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఉన్ముక్త్ చంద్, సర్ఫరాజ్ ఖాన్, శుభ్‌మన్ గిల్ కూడా వైభవ్ కంటే ఈ జాబితాలో ముందున్నారు.
ఐదు దేశాల్లో సెంచరీల మోత మోగించిన వైభవ్ సూర్యవంశీ
అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టినప్పటి నుంచి వైభవ్ సూర్యవంశీ నిలకడగా రాణిస్తున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐదు వేర్వేరు దేశాల్లో సెంచరీలు చేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్, యూఏఈ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇప్పుడు దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీలు బాదాడు.
వివిధ ఫార్మాట్లలో చూస్తే.. యూత్ వన్డేల్లో మూడు, యూత్ టెస్టుల్లో రెండు, లిస్ట్-ఎ క్రికెట్‌లో ఒకటి, టీ20ల్లో మూడు సెంచరీలు (ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున చేసిన సెంచరీతో కలిపి) అతని ఖాతాలో ఉన్నాయి. యూత్ వన్డేల్లో వైభవ్ స్ట్రైక్ రేట్ 164.35గా ఉండటం అతని విధ్వంసక బ్యాటింగ్‌కు నిదర్శనం. జనవరి 15 నుంచి అండర్-19 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వైభవ్ ఫామ్ భారత్‌కు సానుకూల అంశంగా చెప్పవచ్చు.
భారత జట్టులో కీలక మార్పులు.. సిరీస్ ఆధిక్యం
ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తమ ప్లేయింగ్ 11లో రెండు మార్పులు చేసింది. దీపేస్ దేవేంద్రన్, ఖిలన్ పటేల్‌లకు విశ్రాంతినిచ్చి, వారి స్థానాల్లో ఉద్ధవ్ మోహన్, హెనిల్ పటేల్‌లను జట్టులోకి తీసుకున్నారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది.
మొదటి మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇదే సిరీస్‌లోని రెండో వన్డేలో వైభవ్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. అప్పుడు 24 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇప్పుడు మూడో వన్డేలోనూ అదే జోరు కొనసాగిస్తూ క్లీన్ స్వీప్‌పై కన్నేశాడు.
భారత్, సౌతాఫ్రికా ప్లేయింగ్ 11 ఇదే
భారత్: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), త్రివేది, అభిజ్ఞాన్ కుండు (వికెట్ కీపర్), హర్వంశ్ పంగాలియా, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, మొహమ్మద్ ఎనాన్, ఖిలన్ పటేల్, ఉద్ధవ్ మోహన్, హెనిల్ పటేల్.
దక్షిణాఫ్రికా: జోరిచ్ వాన్ షాల్క్‌విక్, అద్నాన్ లగాడియన్, ముహమ్మద్ బుల్బులియా (కెప్టెన్), జేసన్ రౌల్స్, డానియల్ బోస్‌మన్, పాల్ జేమ్స్, లెథాబో ఫహ్లామోహ్లాకా (వికెట్ కీపర్), కార్న్ బోథా, మైఖేల్ క్రూయిస్‌క్యాంప్, జేజే బాసన్, ఎంటాండో సోని.

