Hong Kong vs India: ఆఖరి నిమిషంలో పెనాల్టీ గోల్.. భారత్ పై హాంకాంగ్ గెలుపు
AFC Asian Cup 2027 Qualifier: ఏఎఫ్సీ ఏషియన్ కప్ 2027 క్వాలిఫయర్స్‌లో భారత్ కు మరో పరాజయం ఎదురైంది. ఆఖరి నిమిషంలో పెనాల్టీ గోల్‌తో భారత్ పై హాంకాంగ్ విజయం సాధించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఏఎఫ్సీ ఏషియన్ కప్ 2027 క్వాలిఫయర్: హాంకాంగ్ vs ఇండియా
Hong Kong vs India: ఏఎఫ్సీ ఏషియన్ కప్ 2027 క్వాలిఫయర్ మ్యాచ్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. హాంకాంగ్ కై టాక్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు 1-0 తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ చివరి నిమిషాల్లో ప్రత్యర్థి స్టెఫన్ పెనాల్టీ గోల్ కొట్టి హాంకాంగ్‌కు విజయాన్ని అందించాడు.
హాంకాంగ్ vs ఇండియా.. ఇరు జట్ల మధ్య గట్టి పోటీ
మ్యాచ్ ప్రారంభం నుంచే రెండు జట్లు గట్టిగా పోటీ పడ్డాయి. తొలి అర్ధభాగంలో భారత జట్టు కొద్ది అవకాశాలను సృష్టించినా, గోల్ గా మార్చడంలో విఫలమైంది. 35వ నిమిషంలో లిస్టన్ కొలాకో అద్భుతమైన రన్ తర్వాత ఆశిక్ కురునియన్‌కు బంతిని అందించాడు. అయితే ఆశిక్ దగ్గర నుంచి వచ్చిన షాట్ గోల్ పోస్ట్‌ను అందలేకపోయింది.
ఇటు భారత్ గోల్ కీపర్ విశాల్ కైత్ కూడా మొదటి అర్ధభాగంలో జునిన్యో తీసిన డేంజరస్ లాంగ్ రేంజ్ షాట్‌ను అద్భుతంగా సేవ్ చేశాడు. అయితే రెండో అర్ధభాగంలో గోల్స్ లేకుండా మ్యాచ్ ముందుకు సాగింది.
మ్యాచ్ చివరి దశలో భారత కోచ్ మనోలో మార్కెజ్ కోపంగా కనిపించారు. సునీల్ ఛెత్రిని చివరి 20 నిమిషాల్లో మైదానంలోకి పంపినప్పటికీ, భారత్ గోల్ చేసే అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది. 81వ నిమిషంలో లలన్‌జౌలా ఛాంగ్టే ఇచ్చిన కట్‌బ్యాక్‌ను ఛెత్రి కవర్ చేయలేకపోయాడు.
విశాల్ కైత్ హాంకాంగ్ ఆటగాడిని ఢీకొట్టడంతో రిఫరీ పెనాల్టీ
కీలకమైన క్షణం మ్యాచ్ స్టాపేజ్ టైంలో (90+4 నిమిషం) చోటు చేసుకుంది. భారత గోల్‌కీపర్ విశాల్ కైత్ హాంకాంగ్ ఆటగాడు మైకేల్ ఉదెబులుజోర్‌ను బాక్స్‌లో ఢీకొట్టడంతో రిఫరీ పెనాల్టీ ఇచ్చాడు. ఈ ఘటనకు విశాల్‌కు యెల్లో కార్డు కూడా చూపించారు. స్టెఫన్ పెనాల్టీ గోల్‌ను కొట్టి హాంకాంగ్‌కు విలువైన పాయింట్లు అందించాడు.
భారత్ క్వాలిఫై ఆశలపై నీళ్లు
ఈ పరాజయం భారత్‌కు క్వాలిఫై ఆశలపై పెద్ద దెబ్బలా మారింది. మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ డ్రా అయిన తర్వాత భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇది రెండో నిరాశాజనక ఫలితం. ప్రస్తుతం భారత్ గ్రూప్‌లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది.
భారత జట్టు ఇదే
విశాల్ కైత్, గుర్మీత్ సింగ్, అమ్రిందర్ సింగ్, రోషన్ సింగ్, రాహుల్ భేకే, చింగ్లెంసనా సింగ్, అన్వర్ అలీ, బోరిస్ సింగ్, సందేశ్ జింగ్‌గన్, ఆశిష్ రాయ్, అభిషేక్ సింగ్, సురేష్ వాంగ్‌జం, మహేష్ సింగ్, ఆయుష్ ఛెత్రి, ఉదాంత సింగ్, లలెన్‌గ్మావియా, లిస్టన్ కొలాకో, ఆశిక్ కురునియన్, బ్రాండన్ ఫెర్నాండస్, నిఖిల్ ప్రభు, సునీల్ ఛెత్రి, ఎడ్మండ్ లాల్‌రిందికా, మన్వీర్ సింగ్, సుహైల్ భట్, లలన్‌జౌలా ఛాంగ్టే.
ఈ విజయం తర్వాత హాంకాంగ్ గ్రూప్ లో అగ్రస్థానానికి చేరింది. భారత్ మిగతా మ్యాచ్‌లలో విజయం సాధించకపోతే ఏఎఫ్సీ కప్ 2027 కోసం అర్హత సాధించడం కష్టమే అవుతుంది.