Double Super Over : డబుల్ సూపర్ ఓవర్ అంటే ఏమిటి? ఐసీసీ కొత్త రూల్స్ ఏంటి?
Double Super Over : క్రికెట్ మ్యాచ్ టై అయితే విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ ఉంటుంది. మొదటి సూపర్ ఓవర్ కూడా టై అయితే డబుల్ సూపర్ ఓవర్ ఉంటుంది. అసలు సూపర్ ఓవర్ అంటే ఏమిటి? డబుల్ సూపర్ ఓవర్ రూల్స్ ఏమిటి?

క్రికెట్ అభిమానులకు మతిపోయే రూల్.. డబుల్ సూపర్ ఓవర్ వెనుక ఇన్ని ట్విస్టులా
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 లో సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా సాగింది. ప్రధాన మ్యాచ్ టై అవ్వడం, ఆ తర్వాత జరిగిన మొదటి సూపర్ ఓవర్ కూడా టై అవ్వడం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. చివరకు డబుల్ సూపర్ ఓవర్ ద్వారా దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అసలు ఈ డబుల్ సూపర్ ఓవర్ అంటే ఏమిటి? దీని వెనుక ఉన్న నిబంధనలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
సూపర్ ఓవర్ అంటే ఏమిటి?
సాధారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లో రెండు జట్లు సమాన పరుగులు చేసి మ్యాచ్ టై అయినప్పుడు, విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఇందులో ఒక్కో జట్టుకు ఒక ఓవర్ (6 బంతులు) కేటాయిస్తారు.
- బ్యాటర్ల సంఖ్య: ఒక్కో జట్టు గరిష్ఠంగా ముగ్గురు బ్యాటర్లను మాత్రమే ఉపయోగించుకోవచ్చు.
- వికెట్ల నిబంధన: కేవలం రెండు వికెట్లు పడిపోతే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసినట్లే. అంటే ఆలౌట్ అయినట్టు.
- విజేత నిర్ణయం: ఏ జట్టు ఎక్కువ పరుగులు చేస్తే ఆ జట్టు విజేతగా నిలుస్తుంది.
- బ్యాటింగ్ ఆర్డర్: సాధారణంగా మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ (ఛేజింగ్) చేసిన జట్టు సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేస్తుంది.
డబుల్ సూపర్ ఓవర్ అంటే ఏమిటి?
మొదటి సూపర్ ఓవర్‌లో కూడా రెండు జట్లు సమానమైన స్కోరు చేస్తే, అప్పుడు విజేత ఎవరో తేలే వరకు మరొక సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. దీనినే డబుల్ సూపర్ ఓవర్ అంటారు. ఒకవేళ రెండో సూపర్ ఓవర్ కూడా టై అయితే, మూడో సూపర్ ఓవర్ ఆడిస్తారు. విజేత స్పష్టంగా తేలే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. నాకౌట్ మ్యాచ్‌లలో ఫలితం రావడం అత్యవసరం కాబట్టి ఈ నిబంధనను ఐసీసీ అమలు చేస్తోంది.
ఐసీసీ సూపర్ ఓవర్ నిబంధనలు ఏమిటి?
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) రూపొందించిన నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహణలో కొన్ని కీలక నిబంధనలు ఉన్నాయి..
1. టాస్ ఉండదు: సూపర్ ఓవర్ కోసం ప్రత్యేకంగా టాస్ వేయరు.
2. బౌలర్ల మార్పు: మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేసిన బౌలర్ సూపర్ ఓవర్ వేయడానికి అనుమతి ఉండదు. అలాగే, మొదటి సూపర్ ఓవర్ వేసిన బౌలర్, రెండో సూపర్ ఓవర్ వేయకూడదు.
3. బ్యాటర్ల అనర్హత: ఒక సూపర్ ఓవర్‌లో అవుట్ అయిన బ్యాటర్లు, ఆ తర్వాత వచ్చే సూపర్ ఓవర్లలో తిరిగి బ్యాటింగ్‌కు రారు.
4. DRS, NRR: సూపర్ ఓవర్‌లో కూడా డిసిషన్ రివ్యూ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, సూపర్ ఓవర్‌లో చేసే పరుగులు నెట్ రన్ రేట్ లెక్కింపులో కూడా కలుస్తాయి.
సౌతాఫ్రికా vs అఫ్గానిస్తాన్: డబుల్ సూపర్ ఓవర్ కు ఒక లైవ్ ఉదాహరణ
2026 టీ20 ప్రపంచకప్‌లో జరిగిన ఈ మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్ ఉత్కంఠకు నిదర్శనం. ప్రధాన మ్యాచ్‌లో రెండు జట్లు 187 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. మొదటి సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. చివరకు రెండో సూపర్ ఓవర్‌లో దక్షిణాఫ్రికా జట్టు 23 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. ఇది వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటిగా రికార్డు సృష్టించింది.
టీ20 సూపర్ ఓవర్ ఎందుకు అవసరం?
టోటూర్నమెంట్‌లో స్పష్టమైన విజేతను ప్రకటించడానికి డబుల్ సూపర్ ఓవర్ ఎంతో అవసరం. ముఖ్యంగా సెమీ ఫైనల్స్, ఫైనల్స్ వంటి కీలక మ్యాచ్‌లలో టై అనేది అంగీకరించరు. క్రీడలో పారదర్శకత కోసం ఐసీసీ పాత బౌండరీ కౌంట్ రూల్‌ను తొలగించి, ఈ సూపర్ ఓవర్ పద్ధతిని తీసుకొచ్చింది. ఇది ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని అందించడమే కాకుండా, ఆటగాళ్ల మానసిక దృఢత్వానికి పెద్ద పరీక్షగా నిలుస్తుంది.

