Hardik Pandya : చౌకబారు సెన్సేషన్ కోసం.. మీకేంట్రా ఇదంతా? హార్దిక్ పాండ్యా ఫైర్
Hardik Pandya : మహిళలను గౌరవించడం తెలియదా అంటూ హార్దిక్ పాండ్యా ఫైర్ అయ్యాడు. తన ప్రియురాలు మహీకా శర్మను అసభ్యంగా చిత్రీకరించిన ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాకు వార్నింగ్ ఇచ్చాడు.

రెస్టారెంట్ బయట అసభ్య వీడియో… పాండ్యా ఫైర్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి పాపరాజీల నిర్లక్ష్య ప్రవర్తనపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి మహీకా శర్మ బయటికి వస్తుండగా కొందరు ఫోటోగ్రాఫర్లు ఆమెను అసభ్యకర కోణాల్లో వీడియోలు, ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో వైరల్ చేశారు. వీటిని చూసిన పాండ్యా తీవ్ర ఆగ్రహంతో సోషల్ మీడియాలో స్పందించాడు.
తాను సెలబ్రిటీ అయినందువల్ల కెమెరాలు తనను ఎప్పుడూ ఫాలో అవుతాయని అంగీకరించినా, మహిళల గౌరవాన్ని దెబ్బతీయడం మాత్రం అస్సలు సమర్థించలేనని ఆయన స్పష్టం చేశాడు. “ఇది వార్త కాదు… మానవత్వం లేదా.. ఎక్కడ?” అంటూ ప్రశ్నించారు హార్దిక్.
“హద్దులు దాటకండి!” మీడియాకు పాండ్యా గట్టి హెచ్చరిక
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హార్దిక్ పాండ్యా పాపరాజీల ప్రవర్తనపై నేరుగా వార్నింగ్ ఇచ్చాడు. మహీకా మెట్లు దిగుతున్న సమయంలో తీసిన కోణం అసభ్యంగా ఉందని, ఇలాంటి చిత్రీకరణ ఏ మహిళా తట్టుకోలేనిదని పేర్కొన్నారు.
“మీరు వార్తలు చూపించడమే పని కానీ, మహిళల వ్యక్తిగత గౌరవాన్ని పణంగా పెట్టడం కాదు. హద్దులు ఉండాలి. ప్రతిదీ క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నాడు. ఇది తన పట్ల కాదు, ప్రతి మహిళ పట్ల గౌరవం గురించి చేసిన వ్యాఖ్య అని ఆయన స్పష్టం చేశారు.
హార్దిక్–మహీకా రిలేషన్ పై అభిమానుల ఆసక్తి
నటాషా స్టాంకోవిచ్‌తో విడాకుల తర్వాత హార్దిక్ వ్యక్తిగత జీవితం పట్ల ఇప్పటికే ప్రజల్లో ఆసక్తి పెరిగింది. గత కొన్ని నెలలుగా మోడల్, యోగా ట్రైనర్ మహీకా శర్మతో ఆయన కనిపించడం, ట్రావెల్ ఫోటోలు పంచుకోవడంతో ప్రేమలో ఉన్నారని ఊహాగానాలు చెలరేగాయి.
అక్టోబర్‌లో హార్దిక్ పుట్టినరోజు సందర్భంగా పంచుకున్న ఫొటోలతో వారి రిలేషన్ పై క్లారిటీ వచ్చింది. కానీ, మహీకా చేతికి పెద్ద రింగ్ కనిపించడంతో నిశ్చితార్థం అంటూ వచ్చిన రూమర్లను ఆమె నవ్వుతూ కొట్టిపారేసింది. అయితే, తర్వరలోనే ఒకటి కానున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
క్రికెట్ రీఎంట్రీలో దుమ్మురేపిన హార్దిక్ పాండ్యా
2025 ఆసియా కప్‌లో గాయపడి కొన్ని నెలలు మ్యాచ్‌లకు దూరమైన పాండ్యా రీఎంట్రీలో దుమ్మురేపాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తిరిగి జట్టులో చేరాడు. కటక్ లో జరిగిన తొలి టీ20లో అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు. సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. 28 బంతుల్లో 59 పరుగుల నాక్ ఆడాడు. పాండ్యా తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.

