IPL 2026 వేలంలో బిగ్ ట్విస్ట్.. క్వింటన్ డి కాక్ సహా 35 మంది సర్‌ప్రైజ్ ఎంట్రీ !
IPL 2026 Mini Auction : ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న అబుదాబిలో జరిగే ఈ వేలంలో మొత్తం 350 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 77 ఖాళీలను భర్తీ చేయనున్నాయి.

IPL 2026 Mini Auction: 350 మంది ఆటగాళ్లతొ తుది జాబితా విడుదల
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వేలం ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను, షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్ల తుది జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఈ వేలంలో ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకోవడానికి సిద్ధమయ్యాయి.
IPL 2026 Mini Auction : తేదీ, సమయం, ప్లేస్
ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16 జరగనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోని అబుదాబి లో వేలం జరగనుంది. అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలో ఈ వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు, అంటే భారత కాలమానం ప్రకారం (IST) మధ్యాహ్నం 2:30 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని బీసీసీఐ ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చింది.
IPL 2026 Mini Auction షార్ట్‌లిస్ట్ అయిన ఆటగాళ్ల వివరాలు
ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం మొత్తం 1,390 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో మొదట 1,005 మందిని ఎంపిక చేశారు. చివరగా, ఫ్రాంచైజీలతో చర్చించిన తర్వాత, బీసీసీఐ ఈ జాబితాను 350 మంది ఆటగాళ్లకు కుదించింది. అంటే దాదాపు 75 శాతం మందిని తొలగించారు.
తుది జాబితాలో ఉన్న 350 మందిలో 240 మంది భారతీయ క్రికెటర్లు కాగా, 110 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 10 ఫ్రాంచైజీల వద్ద మొత్తం 77 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. వీటిలో గరిష్ఠంగా 31 మంది విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది.
IPL 2026 Mini Auction అత్యధిక బేస్ ప్రైస్.. భారతీయ స్టార్లు ఎవరు?
ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ రూ. 2 కోట్లుగా నిర్ణయించారు. ఈ బ్రాకెట్‌లో మొత్తం 40 మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే భారతీయ ఆటగాళ్లు ఉండటం గమనార్హం. కోల్‌కతా నైట్ రైడర్స్ విడుదల చేసిన ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్, లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసిన స్పిన్నర్ రవి బిష్ణోయ్ తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్నారు.
రూ. 2 కోట్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్స్ స్టీవ్ స్మిత్ (చివరిసారిగా 2021లో ఆడారు), కామెరాన్ గ్రీన్, డేవిడ్ వార్నర్, డేవిడ్ మిల్లర్ వంటి ప్రముఖ విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ముంబై బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ తమ బేస్ ప్రైస్‌ను రూ. 75 లక్షలుగా ఉంచారు.
క్వింటన్ డి కాక్ సర్‌ప్రైజ్ ఎంట్రీ
ఫ్రాంచైజీలకు మొదట పంపిన జాబితాలో లేని 35 మంది కొత్త ఆటగాళ్లను ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు తుది జాబితాలో చేర్చారు. ఇందులో అతిపెద్ద సర్‌ప్రైజ్ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ క్వింటన్ డి కాక్. ఇటీవల అంతర్జాతీయ రిటైర్మెంట్ నుండి తిరిగి వచ్చిన డి కాక్ పేరును ఒక ఫ్రాంచైజీ సూచించడంతో వికెట్ కీపర్ల జాబితాలో చేర్చారు.
అతని బేస్ ప్రైస్ రూ. 1 కోటి. శ్రీలంకకు చెందిన కుశాల్ పెరీరా, దునిత్ వెల్లలాగే, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన గుల్ వంటి కొత్త విదేశీ ముఖాలతో పాటు విష్ణు సోలంకి వంటి దేశీయ ఆటగాళ్లు కూడా ఈ కొత్త జాబితాలో ఉన్నారు.
IPL 2026 Mini Auction : ఫ్రాంచైజీల వద్ద ఉన్న పర్స్ వివరాలు
ఈ మినీ వేలంలో 10 ఫ్రాంచైజీల వద్ద కలిపి మొత్తం రూ. 237.55 కోట్ల పర్స్ అందుబాటులో ఉంది. మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అత్యధికంగా రూ. 64.30 కోట్ల పర్స్‌తో వేలంలోకి దిగుతోంది. వారి వద్ద 13 ఖాళీలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రూ. 43.4 కోట్ల పర్స్‌తో రెండో స్థానంలో ఉంది. 9 ఖాళీలు ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వద్ద రూ. 25.5 కోట్లు ఉన్నాయి.
IPL 2026 Mini Auction ప్రక్రియ ఎలా ఉంటుంది?
బీసీసీఐ వెల్లడించిన ఫార్మాట్ ప్రకారం, వేలం క్యాప్డ్ ఆటగాళ్లతో ప్రారంభమవుతుంది. వారిని బ్యాటర్లు, ఆల్ రౌండర్లు, వికెట్ కీపర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లుగా గ్రూపులు చేస్తారు. ఆ తర్వాత అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల వేలం అదే వరుస క్రమంలో జరుగుతుంది. మొదటి సెట్ (BA1)లో కామెరాన్ గ్రీన్, డేవన్ కాన్వే వంటి వారు ఉన్నారు. 70వ ఆటగాడి తర్వాత వేలం వేగవంతమైన దశ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

