T20 World Cup 2026: ఐసీసీకి అంబానీ జియో హాట్‌స్టార్ షాక్
T20 World Cup 2026: ఐసీసీకి ముఖేష్ అంబానీ షాక్.. జియో హాట్‌స్టార్ భారీ ఆర్థిక నష్టాలతో ఐసీసీ ప్రసార హక్కుల ఒప్పందం నుంచి వైదొలగనుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే, టీ20 ప్రపంచకప్ ముందే ఐసీసీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి.

టీ20 వరల్డ్‌కప్ ముందు ఐసీసీకి ఊహించని షాక్
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండగా, ఐసీసీకి భారీ దెబ్బ తగిలింది. ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని జియో హాట్‌స్టార్, భారత్‌లో ఐసీసీ మీడియా హక్కుల ప్రసార ఒప్పందం నుంచి అధికారికంగా వైదొలగుతున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం టోర్నమెంట్‌కు ముందే ఐసీసీ ఏర్పాట్లపై పెద్ద ప్రభావం చూపనుంది.
మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం… రెండు సంవత్సరాల్లోనే వెనక్కి
గత సంవత్సరం రిలయన్స్-డిజ్నీ జాయింట్ వెంచర్ అయిన జియో హాట్‌స్టార్, 2024–27 మధ్యకాలానికి ఐసీసీతో 3 బిలియన్ డాలర్ల విలువైన నాలుగేళ్ల ప్రసార హక్కుల ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో, ఇంకా రెండేళ్లు మిగిలుండగానే ఈ భారీ కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఐసీసీకి పంపిన రిపోర్టుల ప్రకారం, ఈ నిర్ణయం పూర్తిగా ఆర్థిక ఒత్తిడుల నేపథ్యంలో తీసుకున్న వ్యూహాత్మక అడుగుగా తెలుస్తోంది.
ఎక్కడి నుంచి మొదలైంది ఆర్థిక సంక్షోభం?
హాట్‌స్టార్ ఆర్థిక ఇబ్బందులు ఒక్కసారిగా మొదలుకాలేదు. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో వ్యూవర్‌షిప్ రాకపోవడం, ప్రకటన ఆదాయం పడిపోవడం, డాలర్ రేట్ పెరగడం ఇవన్నీ సంస్థపై తీవ్రమైన ఒత్తిడి పెంచాయి.
రిపోర్టుల ప్రకారం.. గత సంవత్సరం ₹12,319 కోట్ల నష్టం వచ్చింది. ఈ ఏడాది అది ₹25,760 కోట్లకు పెరిగింది. స్పోర్ట్స్ కాంట్రాక్టుల పైనే $840 మిలియన్ లోటు వుండగా, అదనంగా, కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ మనీ గేమింగ్ యాప్‌లపై నిషేధం విధించడం వల్ల ప్రకటన ఆదాయం భారీగా తగ్గిపోయింది.
కొత్త ప్రసార భాగస్వామి కోసం ఐసీసీ వేట
జియో హాట్‌స్టార్ వైదొలిగితే ఐసీసీకి ఇప్పుడు కొత్త స్ట్రీమింగ్ భాగస్వామిని త్వరితగతిన కనుగొనాల్సిన అవసరం ఏర్పడుతుంది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి సంస్థలతో ఐసీసీ సంప్రదింపులు కొనసాగిస్తోందని కూడా పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే భారీ ధర కారణంగా ఇప్పటివరకు ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
ఇక 2026–29 మాధ్యమ హక్కుల కోసం ఐసీసీ ఇప్పటికే 2.4 బిలియన్ డాలర్ల విలువైన బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది.
భారత క్రికెట్ అభిమానులకు ఖర్చులు పెరిగే అవకాశముందా?
హాట్‌స్టార్ వైదొలగడం భారత క్రికెట్ అభిమానులకు నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. హాట్‌స్టార్ ఉచిత ప్రసారాలు తగ్గినట్లే, కొత్త ఓటీటీ సేవలు మ్యాచ్‌ల స్ట్రీమింగ్ కోసం ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.
2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలలో టీ20 ప్రపంచకప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రసార హక్కులు ఎవరి చేతికి వెళతాయన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

