- Home
- Sports
- 5 wickets for 1 run : ఒక్క పరుగుకే 5 వికెట్లు.. 55 పరుగులకే కుప్పకూలిన జట్టు.. సంచలనం రేపిన బౌలర్ !
5 wickets for 1 run : ఒక్క పరుగుకే 5 వికెట్లు.. 55 పరుగులకే కుప్పకూలిన జట్టు.. సంచలనం రేపిన బౌలర్ !
5 wickets for 1 run : వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ కర్ట్నీ వాల్ష్ 1986లో శ్రీలంకపై కేవలం 1 పరుగు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. షార్జాలో జరిగిన ఈ మ్యాచ్‌లో లంక జట్టు 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ రికార్డు వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

షార్జాలో రేగిన బౌలింగ్ తుపాను
క్రికెట్ గ్రౌండ్ లో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కానీ ఒక దిగ్గజ ఫాస్ట్ బౌలర్ సృష్టించిన విధ్వంసం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. వెస్టిండీస్ జట్టు ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించేది. ఆ జట్టులోని బౌలర్లను చూస్తే బ్యాటర్లకు వణుకుపుట్టేది. అలాంటి ఒక సంచలన సంఘటన 1986లో జరిగింది. వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ కర్ట్నీ వాల్ష్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. గ్రౌండ్ లో అతని బౌలింగ్ దెబ్బకు ప్రత్యర్థి బ్యాటర్లు మోకరిల్లక తప్పలేదు. ఒక వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో అసాధ్యం అనిపించే రికార్డును వాల్ష్ సుసాధ్యం చేశారు. 1986 డిసెంబర్ 3న షార్జాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (1986-87) మ్యాచ్‌లో శ్రీలంకపై వాల్ష్ తన బౌలింగ్ ప్రతాపం చూపించారు.
ఒక్క పరుగుకే 5 వికెట్లు
సాధారణంగా బౌలర్లు 5 వికెట్లు తీయాలంటే కనీసం 20 లేదా 30 పరుగులు ఇస్తుంటారు. కానీ కర్ట్నీ వాల్ష్ మాత్రం శ్రీలంకతో జరిగిన ఈ వన్డేలో ఊహించని గణాంకాలు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో ఆయన వేసింది కేవలం 4.3 ఓవర్లు మాత్రమే. ఈ కొద్దిపాటి స్పెల్‌లో ఆయన కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చారు. ఆ ఒక్క పరుగు ఇచ్చి ఏకంగా 5 కీలక వికెట్లు పడగొట్టారు. ఇది క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుతమైన స్పెల్.
వాల్ష్ తన బౌలింగ్ దాడిలో శ్రీలంక టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. అప్పటి శ్రీలంక కెప్టెన్ దిలీప్ మెండిస్ (2), అశాంత డి మెల్ (0), రవి రత్నాయకే (0), రుమేష్ రత్నాయకే (0), గ్రేమ్ లాబ్రోయ్ (1) లను పెవిలియన్ బాట పట్టించాడు. ఇందులో ముగ్గురు బ్యాటర్లు పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరగడం గమనార్హం. ఈ ఇన్నింగ్స్‌లో వాల్ష్ ఎకానమీ రేటు కేవలం 0.22 గా నమోదైంది. ఆయన వేసిన 4.3 ఓవర్లలో 3 ఓవర్లు మెడిన్ కావడం విశేషం. చివరికి ఆయన బౌలింగ్ గణాంకాలు 4.3-3-1-5గా నమోదయ్యాయి.
55 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో వెస్టిండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 45 ఓవర్లలో వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 249 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. కర్ట్నీ వాల్ష్ బౌలింగ్ దాడికి లంక బ్యాటర్లు నిలవలేకపోయారు.
శ్రీలంక ఇన్నింగ్స్ కేవలం 28.3 ఓవర్లలోనే ముగిసింది. ఆ జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. శ్రీలంకను ఇంత తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో వాల్ష్‌దే ప్రధాన పాత్ర. ఆయన తీసిన 5 వికెట్లు మ్యాచ్ గమనాన్ని మార్చేశాయి. ఫలితంగా వెస్టిండీస్ జట్టు ఏకంగా 193 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
కర్ట్నీ వాల్ష్ అద్భుతమైన కెరీర్
వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలో కర్ట్నీ వాల్ష్ పేరు ఎప్పటికీ నిలిచివుంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన మొత్తం 746 వికెట్లు పడగొట్టారు. టెస్టు క్రికెట్‌లో ఆయన రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. 132 టెస్టు మ్యాచ్‌లు ఆడిన వాల్ష్ 519 వికెట్లు తీశారు. అంతేకాకుండా బ్యాటింగ్‌లో 936 పరుగులు చేశారు.
ఇక వన్డేల విషయానికి వస్తే, వాల్ష్ 205 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 227 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో ఆయన బ్యాట్ నుంచి 321 పరుగులు కూడా వచ్చాయి. షార్జాలో శ్రీలంకపై ఆయన నమోదు చేసిన ఈ 1 పరుగుకు 5 వికెట్ల ప్రదర్శన మాత్రం ఆయన కెరీర్‌లోనే ఒక గొప్ప స్పెల్ గా నిలిచిపోయింది.

