BCCI Central Contracts 2026 : రోహిత్, విరాట్‌లకు బిగ్ షాక్.. గిల్‌కు బంపర్ ఆఫర్ !
BCCI Central Contracts 2026: టీమిండియా 2026 సెంట్రల్ కాంట్రాక్ట్‌లలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లీల గ్రేడ్ తగ్గనుండగా, శుభ్‌మన్ గిల్‌కు ప్రమోషన్ లభించవచ్చని సమాచారం. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

రూ. 7 కోట్ల క్లబ్ నుంచి రోహిత్, కోహ్లీ అవుట్? గిల్‌కు జాక్‌పాట్!
మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కానుంది. ఈ కొత్త సంవత్సరంలో టీమిండియా జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. అయితే, ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు ఆశ్చర్యం కలిగించే వార్త ఒకటి బయటకు వచ్చింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025-26 సీజన్‌కు సంబంధించి టీమిండియా ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టును త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. సాధారణంగా బోర్డు ఈ జాబితాను ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో విడుదల చేస్తుంది. కానీ, ఈసారి కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఈ ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొత్త కాంట్రాక్ట్‌లలో అనేక భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
రోహిత్-విరాట్‌లకు గ్రేడ్ తగ్గే అవకాశం
పలు మీడియా రిపోర్టులు, క్రికెట్ సర్కిల్ లో నడుస్తున్న టాక్ ప్రకారం.. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఈసారి బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఊహించని షాక్ తగిలే అవకాశం ఉంది. ఈ ఇద్దరు దిగ్గజాలను ప్రస్తుతం ఉన్న A+ గ్రేడ్ నుంచి దిగువ గ్రేడ్‌కు మార్చే అవకాశం ఉంది.
వీరు టెస్టు, టీ20 ఫార్మాట్‌ల నుంచి వైదొలగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. A+ గ్రేడ్ అనేది సాధారణంగా మూడు ఫార్మాట్‌లు (టెస్టు, వన్డే, టీ20) ఆడే ఆటగాళ్లకు కేటాయిస్తారు. ప్రస్తుతం కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం కావడం వల్ల వీరి గ్రేడ్‌లో మార్పులు ఉండవచ్చని సమాచారం.
అలాగే జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాల కేటగిరీల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉందని రిపోర్టులు సూచిస్తున్నాయి. A+ గ్రేడ్ ఆటగాళ్లకు బీసీసీఐ ఏటా రూ. 7 కోట్లు చెల్లిస్తుంది. 2018లో ఈ గ్రేడ్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఇందులో కొనసాగుతున్నారు.
శుభ్‌మన్ గిల్‌కు భారీ ప్రమోషన్
ఈ కొత్త కాంట్రాక్ట్ లిస్టులో అతిపెద్ద అప్‌డేట్ యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌కు సంబంధించింది. ప్రస్తుతం గ్రేడ్ Aలో ఉన్న గిల్, నేరుగా టాప్ గ్రేడ్ అయిన A+కు ప్రమోట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండటం, అలాగే మూడు ఫార్మాట్‌లలోనూ జట్టులో కీలక సభ్యుడిగా ఉండటంతో అతనికి ఈ ప్రమోషన్ దక్కనుంది. ఇప్పటివరకు రోహిత్, విరాట్, బుమ్రా, జడేజా మాత్రమే ఉన్న ఈ ఎలైట్ గ్రూప్‌లో గిల్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆ ఇద్దరు స్టార్ బౌలర్లకు షాక్ ?
కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో కొంతమంది ఆటగాళ్లకు నిరాశ తప్పకపోవచ్చు. ముఖ్యంగా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్‌ల పేర్లు ఈ జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది.
మహమ్మద్ షమీ గాయం కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉండగా, ముఖేష్ కుమార్ కూడా గత కొంతకాలంగా సెలెక్టర్లకు కనిపించడం లేదు. ఈ కారణంగా వీరిద్దరినీ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించే యోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది.
యువ ఆటగాళ్లకు పండగే !
ఈసారి కాంట్రాక్ట్ లిస్టులో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయనున్నారు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాలో చోటు దక్కించుకున్న పలువురు యువకులకు ప్రమోషన్ లభించనుంది.
ప్రమోషన్ పొందే వారి జాబితాలో తిలక్ వర్మ, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో చాలామంది ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టెస్టు జట్టులోనూ భాగంగా మారారు. వీరి ప్రదర్శన ఆధారంగా బోర్డు వీరికి మెరుగైన గ్రేడ్ కేటాయించనుంది.
ఇషాన్ కిషన్‌కు మళ్లీ ఛాన్స్
గతంలో కాంట్రాక్ట్ కోల్పోయిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పేరును ఈసారి కొత్త జాబితాలో చేర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేయడం, 2027 టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో అతనికి చోటు దక్కడం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
కొత్త కాంట్రాక్ట్‌లతో పాటు, దేశవాళీ క్రికెట్ వ్యవస్థలో ఉన్న సమస్యలు, అంపైర్లు, మ్యాచ్ రిఫరీల పెండింగ్ ప్రతిపాదనలపైనా బోర్డు దృష్టి సారించనుందని సమాచారం.
2024-25 సీజన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా ఇదే
• గ్రేడ్ A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.
• గ్రేడ్ A: ఆర్. అశ్విన్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కేఎల్. రాహుల్, శుభ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా.
• గ్రేడ్ B: సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.
• గ్రేడ్ C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటీదార్.

