గంభీర్ కోటాలో టీమిండియాకు మరో ఢిల్లీ ప్లేయర్.. జట్టులో అనామకుడికి చోటు.!
Ayush Badoni: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆల్‌రౌండర్ ఆయుష్ బదోని జట్టులోకి వచ్చాడు. ఈ పరిణామం గంభీర్ కోటా వివాదానికి, సీనియర్లతో అతని వ్యవహారశైలిపై చర్చకు దారితీసింది.

అనూహ్య పరిణామం..
భారత్ - న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన వన్డే మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆల్‌రౌండర్ ఆయుష్ బదోనిని భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.
26 ఏళ్ల బదోని..
26 ఏళ్ల బదోని భారత జట్టుకు ఎంపిక కావడం అతని కెరీర్‌లో ఇదే తొలిసారి. బుధవారం రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డే మ్యాచ్‌కు అతను అందుబాటులోకి రానున్నాడు. బదోని కేవలం బ్యాటర్ మాత్రమే కాకుండా, ఆఫ్ స్పిన్నర్ కూడా.
సుందర్‌కు గాయం..
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో సుందర్‌కు గాయమైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో వాషింగ్టన్ సుందర్‌కు ఎడమ వైపు దిగువ రిబ్‌లో గాయం ఏర్పడింది. దీంతో ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు ఇచ్చిన అనంతరం అతను మైదానం వీడాడు.
ఆయుష్ బదోనికి భారత జట్టులో అవకాశం
ఈ నేపథ్యంలో యువ ఆల్‌రౌండర్ ఆయుష్ బదోనికి భారత జట్టులో అవకాశం లభించింది. దేశవాళీ క్రికెట్‌లో, ఐపీఎల్ లో తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న బదోని, ఇప్పుడు భారత జట్టులో తన స్థానాన్ని నిరూపించుకునే అవకాశాన్ని అందుకున్నాడు. అయితే, ఇక్కడే అభిమానులు మరొక పాయింట్‌ను లేవనెత్తుతున్నారు. గౌతమ్ గంభీర్ కావాలనే ఢిల్లీ ప్లేయర్‌లను జట్టులోకి తీసుకొస్తున్నాడని క్రికెట్ విశ్లేషకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హర్షిత్ రాణా.. ఆ తర్వాత..
ఇప్పటికే హర్షిత్ రాణాను మూడు ఫార్మాట్‌లలో ఆడిస్తున్నాడని, దీంతో హర్షిత్ గంభీర్ కోటా అని ఇప్పటికే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. హర్షిత్ ఆడకపోయినా టీమ్‌లో ఉంటాడని, అలాగే మూడు ఫార్మాట్‌లలో స్క్వాడ్‌లో ఉంటాడని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అలాగే ఆయుష్ బదోనిని కూడా జట్టులోకి తీసుకువస్తున్నాడని అంటున్నారు. గంభీర్‌తో పాటు హర్షిత్, బదోని కూడా ఢిల్లీ వాళ్లే కావడం ఇక్కడ గమనార్హం. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ వైరల్‌గా మారింది.

