- Home
- Sports
- రాసిపెట్టుకోండి.! చిన్నస్వామి స్టేడియానికి ఇక కోహ్లీ రానట్లే.? కొత్త గ్రౌండ్ కోసం వెతుకులాట..
రాసిపెట్టుకోండి.! చిన్నస్వామి స్టేడియానికి ఇక కోహ్లీ రానట్లే.? కొత్త గ్రౌండ్ కోసం వెతుకులాట..
RCB: ఐపీఎల్ 2025 విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట ఘటన అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తీవ్ర భద్రతా సమస్యలు తలెత్తాయి. ఐపీఎల్ 2026 సీజన్‌కు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరగడం అనుమానమేనని బలమైన సంకేతాలు వినిపిస్తున్నాయి.

ఓ బ్యాడ్ న్యూస్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఇది ఒక చేదు వార్త అని చెప్పొచ్చు. ఐపీఎల్ 2025 ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీకి, ఆ విజయానంతరం జరిగిన పరిణామాలు తీవ్ర తలనొప్పులను తెచ్చిపెట్టాయి. బెంగళూరులో జరిగిన విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత వచ్చిన భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ఐపీఎల్ 2026లో సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు ఆడలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
ఆర్సీబీ మ్యాచ్‌లు ఇక..
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. 11 మంది మృతి చెందడం, పలువురు గాయపడటం ఆర్సీబీకి ప్రతికూల అంశంగా మారాయి. భద్రతా అంశాలపై కూడా తీవ్ర ప్రశ్నలను లేవనెత్తాయి. కర్ణాటక స్టేట్ క్రికెట్ ప్రెసిడెంట్‌గా వెంకటేశ్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్సీబీ మ్యాచ్‌లు బెంగళూరులోనే జరుగుతాయని ఆశించినప్పటికీ, తాజా పరిణామాలు నిరాశపరిచాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త హోం..
నేషనల్ మీడియా కథనాల ప్రకారం, ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటివరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌ను సంప్రదించి చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరాలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త హోంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 మార్చి 21న ప్రారంభం కానుంది కాబట్టి, ఆర్సీబీ ఫ్రాంఛైజీ త్వరలోనే తమ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అంచనా వేస్తున్నారు.
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు కూడా..
గతంలో కూడా విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున ఆడాల్సిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియం నుంచి చివరి నిమిషంలో మార్చడం జరిగింది. ఆ సమయంలో కూడా భద్రతా ఆందోళనలే ప్రధాన కారణంగా ప్రచారం జరిగింది. ఇదే తరహాలో, మరొక ఐపీఎల్ ఫ్రాంఛైజీ అయిన రాజస్థాన్ రాయల్స్ కూడా తమ హోం గ్రౌండ్‌ను మార్చుకుంటోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ హోం మ్యాచ్‌లు పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనున్నట్లు తెలుస్తోంది.
హోం గ్రౌండ్‌ల విషయంలో..
సవాయ్ మాన్ సింగ్ స్టేడియం నిర్వహణ విషయంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌తో ఏర్పడిన విభేదాలే ఈ నిర్ణయానికి కారణం. అంతేకాకుండా, ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఆరోపణలను రాజస్థాన్ రాయల్స్ ఖండిస్తూ, సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ రెండు ఘటనలు హోం గ్రౌండ్‌ల విషయంలో జట్లు ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టం చేస్తున్నాయి.

