Tirumala: ఏడు కొండలపైకి ఏడు దారులు.. మీరు ఈ దారుల్లో ఎప్పుడైనా వెళ్లారా?
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఎక్కువ మంది నడక మార్గాన్నే ఎంచుకుంటారు. అయితే అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారుల గురించి అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియని దారులు కూడా ఉన్నాయి.

శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి నడక మార్గాలు
చాలామంది.. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే పుణ్యక్షేత్రాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి ఒకటి. స్వామి వారి దర్శనానికి రోజూ లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. సినీ, రాజకీయ ప్రముఖులు, సాధారణ ప్రజలు.. ఇలా ఎవరైనా సరే.. మొక్కును బట్టి ఏడుకొండల స్వామి దర్శనానికి కాలినడకన వెళ్తుంటారు. అయితే ఇప్పటివరకు ఎక్కువమందికి తెలిసిన నడక దారులంటే అలిపిరి, శ్రీవారి మెట్టు దారులే. కానీ చాలామందికి తెలియని దారులు కూడా ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా..
అలిపిరి నడకదారి
ఎక్కువమంది భక్తులు నడిచి వచ్చే దారి అలిపిరి నడకదారి. తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ల నుంచి అలిపిరి వరకు టీటీడీ ఉచిత బస్సులను నడుపుతోంది. కొంత మెట్ల మార్గం, కొంత నడక దారి ఉంటుంది. మొత్తం 3650 మెట్లు ఉంటాయి. శ్రీవారి భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఈ మార్గం ద్వారా మొదటిసారి తిరుమల కొండకు చేరుకున్నట్లు చెబుతారు.
శ్రీవారి మెట్టు
శ్రీవారి మెట్టు అన్ని నడక మార్గాల్లోకెళ్లా చాలా ప్రాచీనమైనది. వెంకటేశ్వర స్వామి ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నారని చెబుతారు. అలిపిరి మార్గంతో పోలిస్తే... మెట్ల సంఖ్య, దూరం రెండూ తక్కువే. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారి దర్శంనంకోసం శ్రీవారి మెట్టు దారిలోనే వచ్చేవారని చెబుతారు.
కుక్కలదొడ్డి
కుక్కలదొడ్డి.. శ్రీవారి పార్వేట మండపం దారి. తుంబుర తీర్థం చేరుకొని అక్కడ నుంచి పాపవినాశనం మీదుగా స్వామివారి ఆలయం వద్దకు చేరుకోవచ్చు.
శ్యామలకోన
స్వామివారి ఆలయానికి చేరుకోవడానికి మరో నడక మార్గం.. శ్యామలకోన. కల్యాణి డ్యాం నుంచి కొన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత.. తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే.. తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది.
అవ్వచారి కోన
రేణిగుంట నుంచి కడప తిరుపతి వెళ్లే మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గర లోయలో ఉన్న అవ్వచారికోన దారి ద్వారా పడమరవైపుకి ప్రయాణిస్తే.. మోకాళ్ల పర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.
తలకోన
తలకోన నుంచి కూడా తిరుమల కొండకు చేరుకోవచ్చు. తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉంది. అందుకే దీనికి తలకోన అని పేరు వచ్చింది. జలపాతం నుంచి నడుచుకుంటూ జెండాపేటు దారిలోకి వస్తే.. తిరుమల చేరుకోవచ్చు.
మామండూరు దారి
ఒకప్పుడు శ్రీవారి మెట్టు తర్వాత బాగా రద్దీగా ఉన్న నడకదారి మామండూరు దారి. తిరుమల కొండకు ఈశాన్యం వైపు నుంచి వచ్చే యాత్రికులకు ఈ దారి అనుకూలంగా ఉండేదట. విజయనగర రాజులు ఈ దారిలో వచ్చే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటుచేశారట.
ఇప్పుడు రెండు మార్గాలే...
ఒకప్పుడు చాలామంది భక్తులు ఈ దారిల్లోనే తిరుమలకు చేరుకొనేవారట. అయితే ఇప్పుడు అలిపిరి, శ్రీవారి మెట్టు మినహా మిగిలిన నడకదారులు వాడుకలో లేవు.