- Home
- Andhra Pradesh
- Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూల కోసం క్యూ లైన్‌లో నిలబడాల్సిన పనిలేదు.
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూల కోసం క్యూ లైన్‌లో నిలబడాల్సిన పనిలేదు.
భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొంగొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న టీటీడీ తాజాగా మరో విప్లవాత్మక దిశగా అడుగు వేసింది. ఇకపై లడ్డూ టికెట్ల కోసం క్యూ లైన్స్‌లో నిల్చోవాల్సిన పనిలేకుండా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.

కియోస్క్‌ల్లో లడ్డూ టికెట్లు!
శ్రీవారిని దర్శించుకునే లక్షలాది భక్తులకు తితిదే మరో సౌకర్యాన్ని అందించబోతోంది. తిరుమలలో లడ్డూ ప్రసాదం కోసం ఏర్పడే భారీ క్యూలను తగ్గించేందుకు కియోస్క్ లడ్డూ టికెట్ సిస్టమ్ ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. ఇప్పుడు భక్తులు క్యూలో వేచి ఉండకుండా డిజిటల్ పద్ధతిలో లడ్డూ టికెట్లు పొందవచ్చు. ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది? ఎక్కడ ఎలాంటి కియోస్క్‌లు ఉన్నాయన్న వివరాలను తెలుసుకుందాం.
క్యూలు తగ్గించేందుకే
ఇప్పటి వరకు అదనంగా లడ్డూలు తీసుకోవాలంటే భక్తులు లడ్డూ కౌంటర్ వద్ద క్యూలో నిల్చొని నగదు చెల్లించాల్సి వచ్చేది. అయితే, దీని వల్ల సమయం వృధా కావడంతో పాటు కొన్నిసార్లు రద్దీ పెరిగేది. ఇప్పుడు టెక్నాలజీ సాయంతో తితిదే డిజిటల్ లడ్డూ కొనుగోలు విధానాన్ని ప్రారంభించింది.
ఈ కొత్త విధానంలో భక్తులు తమ దర్శన టికెట్ నంబర్‌ను కియోస్క్‌లో నమోదు చేసి, కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంచుకుని యూపీఐ లేదా ఇతర డిజిటల్ చెల్లింపుల ద్వారా మితమైన సమయంలోనే టికెట్ పొందవచ్చు.
దర్శన టికెట్ లేకపోయినా
తిరుమలకు దర్శన టికెట్ లేకుండా వచ్చే భక్తులు కూడా లడ్డూ కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఆధార్ నంబర్‌ను నమోదు చేస్తే రెండు లడ్డూలు కొనుగోలు చేసే అవకాశాన్ని తితిదే కల్పించింది. అయితే భవిష్యత్తులో ఈ పరిమితిని నాలుగు లడ్డూలకు పెంచే ప్రయత్నం జరుగుతోంది. దర్శన టికెట్ లేకుండా తిరుమలకు వచ్చిన వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
కియోస్క్ లొకేషన్లు
ప్రస్తుతం యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకుల ఆధ్వర్యంలో ఐదు కియోస్క్‌లను లడ్డూ కౌంటర్ వద్ద, మరో మూడు కియోస్క్‌లను ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. అంతేకాదు, సీఆర్వో కేంద్రం, శ్రీపద్మావతి గెస్ట్ హౌస్, ఇతర ప్రముఖ అతిథి గృహాల వద్ద కూడా ఈ కియోస్క్‌లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కూడా కియోస్క్‌ల ద్వారానే పొందేలా చర్యలు తీసుకుంటున్నారు.
నేడు సెప్టెంబర్ దర్శన టికెట్లు విడుదల
సెప్టెంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్లను జూన్ 23న టీటీడీ ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తోంది. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టికెట్లు, 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతాయి. ఇక జూన్ 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు లభించనున్నాయి.
తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఇప్పటికీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి ప్రస్తుత వేచి ఉండే సమయం సుమారు 24 గంటలు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఆదివారం 87,254 మంది భక్తులు దర్శించుకోగా, 33,777 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా వచ్చిన మొత్తం 4.28 కోట్లు.