Chanakya Niti: పురుషులు జాగ్రత్త.. ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే అంతే!
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు జీవన విధానాన్ని మార్చే విలువైన సూత్రాలను అందించాడు. ఆయన చాణక్య నీతిలో పురుషుల జీవితాన్ని ప్రభావితం చేసే ఎన్నో సూచనలను చేశారు. వాటిని పట్టించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ విషయాలేంటీ?

పురుషులకు చాణక్యుడి హెచ్చరికలు
ఆచార్య చాణక్యుడు భారతదేశ చరిత్రలో గొప్ప రాజకీయ వేత్త, జ్ఞాన నిధి, మహానేతగా నిలిచారు. ఆయన చెప్పిన నీతులు వ్యక్తిగత జీవితం, కుటుంబం, సంబంధాలు, ధనం, పరిపాలన వంటి అనేక అంశాలను ప్రభావితం చేస్తాయి. చాణక్యుడు పురుషులను కొన్ని విషయాల్లో హెచ్చరించారు. వీటిని పాటించకపోతే, వారు గౌరవం కోల్పోవచ్చు, ఆర్థిక నష్టం ఎదురవొచ్చు, ఇంకా సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందట. ఇంతకీ ఈ ముఖ్యమైన హెచ్చరికలు, వాటి ప్రాముఖ్యత గురించి చూద్దాం.
స్త్రీలను అగౌరవపరిస్తే అంతే..
చాణక్యుని ప్రకారం స్త్రీల్ని అగౌరవపరచడం ఒక పురుషుడు చేసే అత్యంత గంభీరమైన తప్పు. స్త్రీలు శక్తి, ప్రేమ, దయ, సంస్కృతికి ప్రతీకలు. వారిని తక్కువగా చూడడం లేదా అనుచితంగా ప్రవర్తించడం వల్ల జీవితంలో అడ్డంకులు, ఆర్థిక నష్టం, ఆత్మగౌరవ నష్టంతో పాటు సామాజిక అవమానం ఎదురవుతుంది. చాణక్యుని దృష్టిలో, స్త్రీల పట్ల గౌరవంతో వ్యవహరించే పురుషుడే నిజమైన తెలివైనవాడు, శక్తివంతుడు. అలాంటి వారికి జీవితంలో శాంతి, స్థిరత, సమాజంలో గౌరవం లభిస్తాయి.
కోపంలో నిర్ణయం తీసుకోవద్దు
చాణక్యుని మాటల ప్రకారం.. కోపంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని అనేక సమస్యలవైపు నడిపిస్తాయి. కోపంలో మన ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతీ ముఖ్యమైన నిర్ణయానికి ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆలోచించాలి. శాంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే విజయానికి మార్గం అన్నారు.
స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి
ఆచార్య చాణక్యుడు ప్రకారం ఎవరికితో స్నేహం చేస్తామో, మన వ్యక్తిత్వం కూడా వారిలాగా మారుతుంది. అంటే సోమరులు, మోసగాళ్లు, ప్రతికూల ఆలోచనలు ఉన్నవారితో స్నేహం చేస్తే, వారి ఆ దారిలోకి మళ్లే అవకాశం ఉంది. అలాగే మంచి ఆలోచనలు, సానుకూల దృష్టికోణం ఉన్న స్నేహితులు ఉంటే, వారి ప్రభావంతో మనలో మంచి మార్పులు, విజయ మార్గం, ఉత్తమ వ్యక్తిత్వం వస్తాయి.
గర్వం తగదు
చాణక్యుని ప్రకారం.. ధనం, అధికారంపై గర్వపడే పురుషులు చివరికి పతనమవుతారు. ఎందుకంటే కాలం మారిపోతుంది, నేడు ఉన్నవన్నీ రేపు లేకపోవచ్చు. కాబట్టి, వినయం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉన్నవాడే నిజమైన పురుషుడి లక్షణం.
ఆ విషయాలను బహిర్గతం చేయరాదు
చాణక్యుడు చెప్పినట్లు.. ప్రతి రహస్యాన్ని అందరితో పంచుకోవడం పెద్ద తప్పు. ప్రత్యేకంగా పురుషులు తమ ప్రణాళికలు, బలహీనతలు, వ్యక్తిగత విషయాలు కేవలం నమ్మకమైనవారితోనే పంచుకోవాలి. లేదంటే, అవి దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.