Lord Shiva: శివుడి ఆభరణాల వెనుక ఉన్న ఆంతర్యమేంటీ? వాటిని ఇంట్లో పెట్టుకుంటే..
Lord Shiva : సమస్త సృష్టి కారకుడు శివుడు. అయితే.. అందరి దేవుళ్ల లాగా శివుడి ఒంటిపై పట్టు వస్త్రాలు, బంగారం ఆభరణాలు కనిపించవు. తన మెడలో పాము, పులి చర్మం కనిపిస్తూ ఉంటాయి. శివుడు ధరించే ఆభరణాల వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం..

శివుడి ఆభరణాల ప్రాముఖ్యత
హిందూ పురాణాల ప్రకారం.. త్రిమూర్తులలో ఒకరైన శివుడు లింగ రూపంలో, పశుపతిగా, బోలేనాథుడిగా వివిధ రూపాల్లో ప్రత్యేక పూజలందుకుంటారు. ఇతర దేవుళ్ల కంటే శివయ్య రూపంగా చాలా భిన్నంగా ఉంటుంది. శివుడు పూలమాలలు, నగలు, ఆభరణాలు ధరించకుండా భస్మాన్ని రుద్దుకుంటారు. మెడలో పాముని ధరించి, నుదుటి పై చంద్రుడు. అలాగే.. జటాజూటంలో గంగమ్మ తల్లిని మోస్తుంటాడు. శివుడు ధరించే ఆయుధాలు, కవచాలు, వస్త్రాలు అద్భుతమైనవి. వాటికి కొన్ని ప్రత్యేక అర్థాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
నంది
నంది, వృషభ, ఎద్దు శివుని వాహనం. అందుకే ప్రతి శివాలయం బయట ఖచ్చితంగా నంది దర్శనమిస్తుంది. నంది నాలుగు పాదాలు మతం, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకగా సూచిస్తాయి. అలాగే నంది ధర్మానికి ప్రతీక. ఇంట్లో నంది విగ్రహం ఉంచితే చెడు శక్తులు ప్రవేశించవట.
తలపై చంద్రుడు
శివుడు తన తలపై నెలవంక ను ఆభరణంలా అలంకరించుకుంటాడు. ఈ కారణంగానే శివుడిని సోమ, చంద్రశేఖరుడు అని పిలుస్తారు. చంద్రుడు మనసు, శాంతికి సంబంధించినది. శివుని తల పై ఉన్న నెలవంక మొదటి నుండి మనస్సు స్థిరత్వానికి చిహ్నంగా పరిగణిస్తారు. లోహపు చంద్రుడిని ఇంట్లో ఉంచితే మనశ్శాంతి, ఆనందం కలుగుతాయి.
చేతిలో ఢమరుకం..
శివుని ఆభరణాల్లో డమరుకం కూడా చాలా ముఖ్యమైనది. ఢమరుకం ఆడగానే శివుని తాండవం మొదలవుతుందని, శివుడి తాండవం వల్ల విధ్వంసం మొదలవుతుందని చెబుతారు. బ్రహ్మ స్వరూపంగా భావించే పరమశివుని ఢమరుకం విశ్వ శబ్దం నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. డమరుకాన్ని విశ్వాసానికి సూచికగా భావిస్తారు. డమరుకాన్ని ఇంట్లో ఉంచుకుంటే అన్ని విషయాలు అదుపులో ఉంటాయి.
త్రిశూలం
శివుడు తన చేతిలో త్రిశూలాన్ని పట్టుకుంటాడు. శివుని త్రిశూలం సత్వ, రజస్, తమో గుణాలను సూచిస్తుంది. దీనితో పాటు త్రిశూలాన్ని జ్ఞానం, కోరిక, పరిపూర్ణతకు చిహ్నంగా చెబుతారు. ఈ గుణాలు శివుని ఆధీనంలో ఉన్నాయని అర్థం. త్రిశూలాన్ని ఇంట్లో ఉంచితే మనసు, మెదడు, శరీరం చైతన్యవంతంగా ఉంటాయి.
మెడలో పాము
శివుని ఆభరణాల్లో పాము కూడా ఒకటి. శివుని మెడలో ఉన్న పాముని వాసుకి గా పిలుస్తారు. శివుని మెడలో ఉన్న పాము భూత, వర్తమాన, భవిష్యత్తుకు సూచికగా పరిగణిస్తారు. పాము అప్రమత్తత, జాగ్రత్తకు చిహ్నం. పామును ధరించడం ద్వారా శివుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాడని సందేశమిస్తున్నాడు. ఇంట్లో పాము ప్రతిమ ఉంచితే శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది.