- Home
- Life
- Pregnancy & Parenting
- Pregnancy: ప్రెగ్నెన్సీ రాకపోయినా లక్షణాలు? గైనకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే..
Pregnancy: ప్రెగ్నెన్సీ రాకపోయినా లక్షణాలు? గైనకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే..
Pregnancy: మాతృత్వం ఒక వరం. దానికోసమే ఆలోచిస్తూ శరీరంలో వచ్చిన చిన్న మార్పులను కూడా ప్రెగ్నెన్సీ అనుకుంటారు. కానీ కొన్నిసార్లు గర్భం దాల్చకపోయినా కూడా లక్షణాలు కనిపిస్తాయి. గైనకాలజిస్టులు చెప్పేది వింటే మీరే ఆశ్చర్యపోతారు.

మాతృత్వం ఒక వరం
పెళ్లైనప్పటి నుంచే చాలా మంది మహిళలు తల్లి కావాలని మనసారా కోరుకుంటారు. పిల్లల కోసం పూజలు, వ్రతాలు చేస్తారు. తమ జీవితంలో ఆ లోటు తీరాలని ఆశపడతారు. అందుకే శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించినా , నెలసరి ఆలస్యం కావడం, అలసట, వాంతులు..ఇవన్నీ ప్రెగ్నెన్సీ లక్షణాలేనేమోనని అనుకుంటారు. కానీ ఆ ఆశ నిజం కాదని తెలిసినప్పుడు ఆమె పడే బాధ మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది.
పిల్లల కోసం ఎదురుచూస్తూ ఎదురుచూస్తూ మహిళ మనసు అలసిపోతుంది. ఆ మానసిక ఒత్తిడి శరీర ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. అదే కారణంగా కొందరు మహిళల్లో గర్భం లేకపోయినా, గర్భధారణ లక్షణాలు నిజంగా ఉన్నట్టే కనిపించవచ్చు. కానీ ప్రతి లక్షణం ప్రెగ్నెన్సీనే సూచించదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
లక్షణాలు కనిపించినాాా గర్భం కాాదంటున్న గైైనకాలజిస్టులు(Pseudocyesis)
మహిళకు గర్భం లేకపోయినా, గర్భధారణకు సంబంధించిన లక్షణాలు కనిపించే పరిస్థితిని ఫాల్స్ ప్రెగ్నెన్సీ లేదా ప్సూడోసైసిస్ అంటారు. ఈ సమస్య ఉన్న మహిళల్లో నెలసరి ఆగిపోవడం, పొట్ట పెరగడం, వక్షోజాల్లో నొప్పి లేదా బరువు, వాంతులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి కడుపులో బిడ్డ కదులుతున్నట్టు కూడా అనిపించవచ్చు. ఇవన్నీ హార్మోన్ల మార్పుల వల్ల జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాల వల్ల మహిళ తాను నిజంగా గర్భవతినేనని ఫీల్ అవుతుంది.
నిజం ఓదార్పుతో చెప్పండి
అయితే అల్ట్రాసౌండ్, రక్త పరీక్షలు చేసిన తర్వాత గర్భం లేదని తేలినప్పుడు ఆమె తీవ్రంగా కుంగిపోతుంది. నిరాశ, బాధ, అవమానం, భయం..కొందరిలో డిప్రెషన్ కూడా రావచ్చు. అందుకే ఈ నిజాన్ని చెప్పే విధానం చాలా కీలకమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఓదార్పుతో, అర్థం చేసుకుంటూ, ఇది ఆమె తప్పు కాదని స్పష్టంగా వివరించాలి.
ప్రెగ్నెన్సీ మహిళకు ఒక వరమే. కానీ అది లేనంతమాత్రాన ఆమె విలువ తగ్గిపోదు. మాతృత్వం ఒక్క రూపంలోనే ఉండదు. గర్భధారణతోనే ఒక మహిళ జీవితం సంపూర్ణమవుతుందన్న భావన సరైంది కాదని వైద్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, సమాజం ఆమె పట్ల సానుభూతితో, సహనంతో ఉంటే ఆ మహిళ మానసికంగా బలంగా నిలబడగలుగుతుంది. అర్థం చేసుకోవడమే అసలైన చికిత్స.

