- Home
- Life
- Pregnancy & Parenting
- Raising Sons: మీకు అబ్బాయి ఉన్నాడా? చిన్నప్పటి నుండే నేర్పాల్సినవి ఇవే..
Raising Sons: మీకు అబ్బాయి ఉన్నాడా? చిన్నప్పటి నుండే నేర్పాల్సినవి ఇవే..
Raising Sons: మగ పిల్లల పెంపకం విషయంలో నేటి తరం పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ లో వారిని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడమే కాదు, ఒక మంచి మనిషిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా మార్చడం అంతకంటే ముఖ్యం.

Parenting Tips
ఒకప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే.. పేరెంట్స్ చాలా భయపడేవారు. అమ్మాయిని చాలా జాగ్రత్తగా పెంచాలని, పద్దతిగా అన్నీ పనులు నేర్పించాలని ఇలా చాలా రూల్స్ ఉండేవి. అదే అబ్బాయి పుడితే మాత్రం చాలా రిలాక్స్డ్ గా ఉండేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. అమ్మాయిలను కాదు.. అబ్బాయిలను పెంచే పద్ధతి మారింది. పాతకాలపు ఆలోచనలతో వారిని పెంచడం వల్ల వారు భవిష్యత్తులో మానసిక ఒత్తిడికి లోనవ్వడమే కాకుండా, ఇతరులకు కూడా ఇబ్బందికరంగా కూడా మారతారు. అందుకే.. మగ పిల్లలను పెంచే సమయంలో.. పేరెంట్స్ చేయకూడని కొన్ని తప్పులు ఉన్నాయి. అవేంటో చూద్దాం....
1.అతిగా గారాబం( Over Entitlement)..
చాలా ఇళ్లల్లో మీరు చూసే ఉంటారు.. మగ పిల్లలను చాలా ఎక్కువగా గారాబం చేస్తారు. ఇంట్లో ఒక్కగానొక్క మగ పిల్లాడు అని అడిగినవీ, అడగనివీ అన్నీ కొనిస్తూ ఉంటారు. అంతేకాదు... ‘ నువ్వు అబ్బాయివి.. నీకు అన్నీ దక్కాలి’ అనే భావన చిన్నప్పటి నుంచీ వారిలో కలిగిస్తూ ఉంటారు. కానీ.. ఆ పొరపాటు.. పొరపాటున కూడా చేయకూడదు. పిల్లలకు అడిగిందల్లా వెంటనే ఇచ్చేయడం వల్ల వారికి వస్తువుల విలువ, కష్టం విలువ తెలీదు. అందుకే.. పిల్లలకు ఏదైనా కష్టపడితేనే లభిస్తుందని నేర్పించాలి. లేదు, కాదు అనే పదాలను వినడం పిల్లలకు అలవాటు చేయాలి.
2.మహిళలను గౌరవించడం ( Respecting Women)
ఇప్పటికీ, చాలా మంది ఇళ్లల్లో మహిళలను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. వాటిని చూసి.. పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అందుకే.. ముందు పేరెంట్స్ ఈ అలవాటు మార్చుకోవాలి.తల్లిని తండ్రి గౌరవించే విధానం నుండే అబ్బాయిలు మొదటి పాఠం నేర్చుకుంటారు. అందుకే.. ఇంట్లో ఆడ పిల్లలకు, మగ పిల్లలకు సమానమైన విలువ ఇవ్వాలి. బయట ఆడ పిల్లలతో కూడా చాలా మర్యాదగా ఎలా ప్రవర్తించాలో కూడా నేర్పించాలి.
3.భావోద్వేగాలను అణచివేయడం (Suppressing Emotions)
చాలా మంది ఇళ్లల్లో మగ పిల్లలను ఏడవనివ్వరు. ఏడుపు అనేది కేవలం ఆడపిల్లలకు మాత్రమే సొంతం అన్నట్లుగా మాట్లాడతారు. కానీ అది పొరపాటు. ‘ మగ పిల్లలు ఏడవకూడదు.. భయపడకూడదు’ అని చెప్పడం వారి మానసిక ఎదుగుదలను దెబ్బతీస్తుంది. ఏడవడం బలహీనత కాదు, అది ఒక భావోద్వేగం అని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. వారికి బాధ కలిగినా, భయం వేసినా మీతో పంచుకునే స్వేచ్ఛను ఇవ్వండి. భావోద్వేగాలను దాచుకుంటే అది భవిష్యత్తులో కోపంగా లేదా హింసగా మారే ప్రమాదం ఉంది.
4.బాధ్యతల నుండి తప్పించుకోవడం..(Avoid Responsibility)
చాలా ఇళ్లల్లో మగ పిల్లలకు ఇంటి పనులు చెప్పరు. ఇది వారిని బాధ్యతారహితంగా మారుస్తుంది. అందుకే, చిన్నప్పటి నుండే వారి ప్లేట్లు కడుక్కోవడం, గదిని సర్దుకోవడం వంటి పనులు నేర్పించాలి. తమ తప్పులకు తామే బాధ్యత వహించేలా పెంచాలి.
5.తిరస్కరణను తట్టుకోలేకపోవడం ( Non-Acceptance of Rejection)
జీవితంలో ఎప్పుడూ గెలుపు మాత్రమే ఉండదు. విమర్శను లేదా ఎవరైనా నో చెప్పినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి వారికి ఉండాలి. ఎవరైనా అమ్మాయి ప్రేమని తిరస్కరించినా లేదా ఆఫీసులో ఎవరైనా విమర్శించినా, దాన్ని హుందాగా స్వీకరించడం నేర్పించాలి. ఇది వారిని మానసికంగా వికలాంగులుగా మారకుండా కాపాడుతుంది.
ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే...మనం మన కొడుకులను ఎలా పెంచుతామో, రేపటి సమాజం అలానే ఉంటుంది. వారిని బలవంతులుగా మాత్రమే కాదు, గుణవంతులుగా కూడా తీర్చిదిద్దుదాం.

